తనది నలభై యేళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజకీయానికి కుప్పం సెలవును ప్రకటించింది. ఆయన సేవలు తమకు చాలనే తీరును కుప్పం చాటుకుంది. కుప్పంలో టీడీపీ చిత్తవ్వడం ఇప్పుడు కాదు, ఎంపీటీసీ- జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలప్పుడే జరిగింది!
అయితే టీడీపీ ఓటములను, ఫెయిల్యూర్లను, స్వయంగా టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ చిత్తవ్వడాన్ని అందంగా కవర్ చేయడానికి మీడియా ఉంది. అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమే చిత్తైన వైనాన్ని చర్చలోకి కూడా రానివ్వలేదు! దానికి తోడు.. అప్పుడు ఆడిన బహిష్కరణ నాటకంతో కొంత బయటపడ్డారు.
అయితే రాజకీయంలో ఎక్కువ కాలం పాటు.. డ్యామేజ్ కంట్రోల్ సాధ్యం కాదు. అది కూడా చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయాల్లో తిమ్మిని బమ్మిని చేసి చూపెట్టే మీడియా పాత్ర పరిమితం అవుతోంది. సోషల్ మీడియా విప్లవం తర్వాత.. ఆ రెండు పత్రికలు ఏం చెబితే దాన్ని నమ్మే పరిస్థితి, ఆ నాలుగు చానళ్లూ ఏం చూపిస్తే దాన్నే చూసే పరిస్థితి పోయింది!
ఇప్పుడు కుప్పం ఓటమిపై చంద్రబాబు ఒకటే మాట అంటారు. ఆల్రెడీ అనేశారు కూడా! అక్రమాలు అని, దొంగ ఓట్లు అని, ఎన్నికల సంఘం వైఫల్యం అని, ఎస్ఈసీ రాజీనామా చేయాలని ఈ తొండి వాదనలతో చంద్రబాబు నాయుడు రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టగల సమర్థులు. ఆ ప్రెస్ మీటును పచ్చ పత్రికలు పతాక శీర్షికల్లో హైలెట్ చేయవచ్చు. అయితే ఇదంతా తమను తాము మోసం చేసుకోవడమే తప్ప ఇంకోటి కాదు!
తమ ఓటమిని, వైఫల్యాన్నీ ఒప్పుకునే స్వభావం కాదు చంద్రబాబుది. తన ఓటమికి కూడా వేరే ఎవరో కారణం అని చెబుతూ, లేదా అది ఓటమే కాదని.. భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఇన్నేళ్ల కెరీర్ ను కొనసాగించిన ఆయన, ఇప్పుడు రియలైజ్ అవుతారనుకోవడం అనుకునే వాళ్ల భ్రమ. ఇప్పుడు కూడా సాకులు చెప్పి, ఇదో ఓటమి కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక గెలుపు కాదని.. చంద్రబాబు నాయుడు, అయన అనుకూల మీడియా వాదిస్తుంది. ఒప్పుకోకుంటే మీద పడి రక్కుతుంది!
కానీ.. అదంతా పిచ్చివాళ్ల స్వర్గం బాపతు. కుప్పంలో చంద్రబాబు రాజకీయ శకం ముగిసింది. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఇలా మున్సిపల్ ఎన్నికలో ఓటమితో దాదాపు ముగిసింది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో మళ్లీ చంద్రబాబు పోటీ చేస్తారా? అంత సీనుందా? అంటే సమాధానం సులువుగానే దొరుకుతుంది.
ఇన్నాళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును, టీడీపీ ఓటమిని చిన్నవిగా చేసి చూపుతూ నెట్టుకొచ్చారు. ఆ కథ ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎదుర్కొనే అతి పెద్ద సంక్షోభం ఇప్పుడే మొదలైంది!