కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత వైఎస్సార్ ఆత్మీయ మిత్రుడు కేవీపీ రామచంద్రరావు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి చెందిన సంగతి తెలిసిందే. గౌతమ్‌కు నివాళులర్పించేందుకు కేవీపీ అపోలో ఆస్పత్రి వద్దకెళ్లారు. మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.
మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల్నిఅడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రాజకీయ యువనాయకులకు గౌతమ్ మరణం తీరని లోటన్నారు. తనను గౌతమ్ తరచూ కలిసే వాడని చెప్పుకొచ్చారు.
తనను వైసీపీలోకి రావాలని గౌతమ్ ఆహ్వానించినట్టు కేవీపీ సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఇలా రెండు మూడు సార్లు పార్టీలోకి రావాలని కోరినట్టు చెప్పారు. తన అవసరం లేకుండానే ఏపీలో వైసీపీ విజయాలు నమోదు చేసుకుంటుందన్న విషయాన్ని గుర్తు చేసినట్టు కేవీపీ తెలిపారు.
అయితే మీ లాంటి పెద్దల ఆశీస్సులు, మార్గనిర్దేశకత్వం అవసరమని, అందువల్ల పార్టీలోకి రావాలని ఒక రకంగా ఫోర్స్ చేశారని గౌతమ్‌తో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదర్శవంతమైన నాయకుడిని సమాజం కోల్పోయిందని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.