దేశంలో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య రెట్టింపు కానుందా? అది కూడా అతి త్వరలో.. అంటే 2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందే.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ప్రస్తుతం ఈ చర్చను మొదలుపెట్టింది కాంగ్రెస్ నేతలే కావడం గమనార్హం. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఈ అంశం మీద ట్వీట్ చేశారు.
బీజేపీ నేతల నుంచినే తనకు ఈ సమాచారం అందిందని ఆయన అంటున్నారు. దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, ఆ సంఖ్యను వెయ్యికి మించి చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందని మనీస్ తివారీ అంటున్నారు. అయితే ఈ అంశం గురించి వ్యతిరేకతను వ్యక్తం చేయని ఈ కాంగ్రెస్ నేత, దీనిపై ప్రజల్లో చర్చ, ప్రజల అంగీకారం ఉండాలంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఉన్న 545 సీట్ల సంఖ్య దేశ జనాభా 55 కోట్లుగా ఉన్నప్పటిది అనేది నిజం. 55 కోట్ల జనాభాకు తగిన రీతిలో అప్పట్లో ఎంపీల సంఖ్యను, నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టారు. ప్రస్తుతం దేశ జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది. ఆ లాజిక్ ప్రకారం చూస్తే.. లోక్ సభ సభ్యుల సంఖ్య రెట్టింపు కావడంలో విడ్డూరం ఏమీ లేదు.
కానీ.. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూస్తే లోక్ సభ సీట్ల సంఖ్య పెరగడం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదనేది సత్యం. ఎంపీల సంఖ్య పెరిగితే ప్రోటోకాల్స్ పెరగడం, వారి జీతభత్యాలు, ఖర్చులు ప్రజలకు అదనపు భారం తప్ప.. పైసా ప్రయోజనం ఉండదు!
జనాభా పెరిగింది కానీ, ప్రాంతం అయితే అదే కదా. ఇప్పుడున్న ఎంపీలే ప్రజల మధ్యకు వచ్చేది ఐదేళ్లకు ఒకసారి. ఎమ్మెల్యేలు అయినా కాస్తో కూస్తో ప్రజలకు కాస్త అందుబాటులో ఉంటారు కానీ, ఎంపీలు తమ వ్యాపారాలు, వ్యాసంగాలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. అలాంటప్పుడు అదనంగా ఎంపీల సంఖ్యను పెంచేయడం వల్ల పైసా ఉపయోగం ఉండకపోవచ్చు.
ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, కెనడాలను ఉదాహరిస్తారు కొంతమంది. మన కన్నా జనాభాలో చిన్నవి అయిన ఆ దేశాల చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే ఆ రాజకీయ వ్యవస్థలకూ, మన దగ్గర చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజుల్లో ఒక్కో కార్పొరేటరే ఎంపీ లెవల్లో ఫీలయిపోతూ, హంగామా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అదనంగా ఎంపీల అవసరం ఎంత మేరకు? అనేది నిజంగా చర్చించదగిన అంశమే. సూటిగా చెప్పదగినది ఏమిటంటే.. పెరగాల్సింది పారదర్శకత, ప్రజారంజకమైన పాలన కానీ ఎంపీల సంఖ్య కాదు.
అలాగే జనాభా సంఖ్యకు అనుగుణంగా ఎంపీల సంఖ్యను పెంచేయడం వల్ల.. దేశంలో ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కడం జరుగుతుంది పార్లమెంట్ లో. 20 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలున్నాయి, అలాంటి వాటి నుంచి ఏకంగా 150కి మించి ఎంపీల సంఖ్య పెరుగుతుంది. దాని వల్ల రాజకీయ పార్టీలకు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు కలగవచ్చు.
అదే సమయంలో నష్టం జరిగే చోటా జరుగుతుంది. అయితే ఉత్తరభారతదేశంలో జనాభా ఎక్కువ, దక్షిణాదిన తక్కువ. పొలిటికల్ గా ఉత్తరభారతదేశం ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీలే దేశాన్ని ఏలే అవకాశం ఉంటుంది. దీంతో పాలకులు కూడా అక్కడి ప్రాంత ప్రయోజనాల కోసమే పని చేయడమూ జరగొచ్చు.
జనాభా ఆధారితంగా సీట్లు అనే లెక్కన చూస్తే మాత్రం రాజకీయ అసమానతలు కచ్చితంగా పెరుగుతాయి. ఏతావాతా.. నిజంగానే లోక్ సభ సీట్ల సంఖ్యను వెయ్యికి మించి చేసేట్టు అయితే, కమలం పార్టీ మరో రాజకీయ తేనెతుట్టెను కదుపుతున్నట్టే!