అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి లోకువే. అక్కడి బీసీలు తమకు రుణపడి ఓటేయాలన్నట్టుగా, వారు అలానే ఉంటారన్నట్టుగా లెక్కలేసి భంగపడ్డారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
ఒకరిద్దరు బీసీ నేతల పేర్లను ప్రస్తావిస్తూ.. మొత్తం బీసీ కులాలన్నింటినీ పల్లకి మోసే వారిగా మార్చుకున్నారు తెలుగుదేశం అధినేత. అయితే ఈ రాజకీయ వ్యూహానికి జగన్ చెక్ పెట్టాడు. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మెజారిటీ లబ్ధిదారులు బీసీలే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కి సంప్రదాయ ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో చెల్లాచెదురైంది. అది కూడా రాయలసీమలో అయితే ఇప్పుడు తెలుగుదేశం జెండా పట్టే నాథుడు లేకుండా పోయాడు.
ఈ పరిస్థితుల మధ్యన ఉన్నట్టుండి లోకేష్ కొందరు రాయలసీమ పోరాటకర్తలను పిలిచి మాట్లాడారట. ఈ సందర్భంగా రాయలసీమ పోరాట కర్తలు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారు. అందులో ఒకటి రాయలసీమ మీద నోరు పారేసుకోవద్దనేది.
రాయలసీమ రౌడీలు, కడప గూండాలు, పులివెందుల పంచాయతీ.. అంటూ చంద్రబాబు నాయుడు గత కొన్నేళ్లలో కొన్ని వర్డ్స్ కాయినింగ్ చేశారు. తన రాజకీయ అవసరాలకు వాటిని వాడుతూ ఉంటారు. చంద్రబాబు చూపిన దోవలో తెలుగుదేశంలోని చోటా మోటా నేతలు కూడా వాటినే ఉపయోగిస్తారు. ఆఖరికి జగన్ ను విమర్శించాలనే చంద్రబాబు చంచాలంతా ఈ పదాలను ఉపయోగించడం పరిపాటిగా మారింది.
జగన్ పై చంద్రబాబుకు ఎంత అక్కసు ఉన్నా, తెలుగుదేశం వాళ్లు ఎంత కోపమున్నా.. ఆయనను వ్యక్తిగతంగానో, రాజకీయంగానో విమర్శించుకోవాలి. అయితే అలా చేస్తే.. అది తెలుగుదేశం ఎందుకవుతుంది? చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏనాడో తెలుగుదేశం పార్టీ పట్టాలు తప్పింది. ఈ క్రమంలోనే రాయలసీమ రౌడీలు, కడప గుండాలు, పులివెందుల పంచాయతీ వంటి పదాలు వచ్చి చేరాయి.
ఎంత అహంభావం, మూర్ఖత్వం ఉంటే.. తమ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి ఇలాంటి పదాలు వాడతారు? టీడీపీ దురదృష్టం ఏమిటంటే.. ఆ పార్టీ అధినేతే ఈ పదాలను వాడుతుంటారు తరచూ! అదే పులివెందుల్లో బీటెక్ రవిని పులి అని చెబుతూ.. మళ్లీ పులివెందుల పంచాయతీ అంటూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడటం, ట్వీటడం ఏమిటో వారికే తెలియాలి!
కడపలో టీడీపీ ఉనికి ఉండాలి.. కానీ తమ రాజకీయ వ్యూహాల కోసం కడప రౌడీలు అనే మాట ఉపయోగిస్తారు. విశాఖలో రాయలసీమ రౌడీలు అంటూ ప్రచారం చేస్తారు తెలుగుదేశం వారు! అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేశారు, ఇప్పుడు కూడా అదే తీరు! అలాంటి టీడీపీ అధినేత తనయుడు ఇప్పుడు రాయలసీమ పోరాటకర్తలను పిలిచి మాట్లాడారట. వారు భాషను మార్చుకోవాలని వీరికి సూచించారట.
సూచించడం, అభ్యర్థించడం కాదు.. హెచ్చరించాల్సింది. నోరు పారేసుకోవద్దని చెప్పాల్సింది. ఒక ప్రాంతానికి చెడును ఆపాదించి మాట్లాడితే కేసులు పెట్టాలి. అంతటి దారుగతంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. మళ్లీ వాళ్లను అభ్యర్థించడం ఏమిటో మరి!
అయినా.. అధికారంలో ఉంటే రాయలసీమ చంద్రబాబుకు కన్నూమిన్నుకు కానరాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాయలసీమ పర్యటనకు వెళితే ముందస్తుగా అక్కడ లాయర్లను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయించిన చరిత్ర చంద్రబాబుది. గత టర్మ్ లోనే అలాంటి ముచ్చట్లు చోటు చేసుకున్నాయి. ఒక రకంగా కాదు.. 14 యేళ్ల తన పదవీకాలంలో చంద్రబాబు నాయుడు రాయలసీమను నిర్లక్ష్యం చేయని రీతి అంటూ లేదు. అన్ని రకలుగానూ కసి గట్టినట్టుగా వ్యవహరించారు.
అందుకు ప్రతిఫలమే గత ఎన్నికల్లో నాలుగు జిల్లాలకూ గాను దక్కిన మూడు సీట్లు. ఇంత చరిత్రను అంతా మరిచిపోవాలన్నట్టుగా లోకేష్ రాయలసీమ జనోద్ధకరుడిగా కొత్త వేషం కడుతున్నట్టుగా ఉన్నారు. మరి ఈ మహానటుడు దీన్ని ఏ మేరకు పండిస్తాడో!