విరామాల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తూ, హైదరాబాద్ లో గడుపుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు. ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి ఏపీకి వెళ్లడం, అక్కడ ఒకటీ రెండు రోజుల పాటు గడపడం.. ఆ తర్వాత చలో హైదరాబాద్! అన్నట్టుగా ఉంది వీరి కథ.
ఆ మధ్య ఏపీ వెళ్లి, ఆ తర్వాత హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న నారా లోకేష్ మళ్లీ ఏపీలో కనపడలేదు. అలాగని హైదరాబాద్ లో కూడా ఆయన కనపడలేదు. ఎట్టకేలకూ విజయవాడ బయల్దేరారట చంద్రబాబు తనయుడు.
ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ ను తెలంగాణ పోలీసులు ఆపినట్టుగా వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. భారీ కాన్వాయ్ తో లోకేష్ బాబు బయల్దేరగా పోలీసులు ఆపినట్టుగా తెలుస్తోంది. రొటీన్ చెకప్స్ లో భాగంగా తనిఖీ నిర్వహించి.. ఆ తర్వాత లోకేష్ కాన్వాయ్ కు రైట్ రైట్.. అన్నారట పోలీసులు. లోకేష్ కాన్వాయ్ లో అభ్యంతకరమైనవి ఏమీ దొరక లేదని తెలుస్తోంది.
గ్రేటర్ లో తెలుగుదేశం అభ్యర్థులు సుమారు వంద డివిజన్లకు పోటీ చేస్తున్నా.. లోకేష్ కిక్కురుమనడం లేదు. క్రితం సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేష్ తన ప్రతాపం చూపించారు. వీదివీధీ తిరిగి అప్పట్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ టీడీపీ సింగిల్ సీటు విజయంతో చిత్తయ్యింది. ఇప్పుడు కూడా తగ్గకుండా వంద కు పోటీ చేస్తోంది.
అయితే పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించాల్సిన లోకేష్.. పోలింగ్ కు వారం ఉండగా.. విజయవాడకు వెళ్లిపోవడం గమనార్హం. బహుశా గ్రేటర్ లో టీడీపీ అభ్యర్థులకు దొరకకుండా ఆయన విజయవాడకు వెళ్లిపోయినట్టుగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.