ఎల్లో మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ….ఇదేంటబ్బా అని చూస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పిందని సమాచారం. వరద బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడంతో పాటు బాధితులను ఆదుకోవ డంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం లోకేశ్ పర్యటన ప్రధాన ఉద్దేశం.
ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, అందులోనూ టీడీపీ భవిష్యత్ ఆశా కిరణమైన లోకేశ్ ఆ మాత్రం దూకుడు ప్రదర్శించాల్సిందే. ఇంత కాలం ఇల్లు, ట్విటర్‌ను విడిచి ఏపీ మొహమే చూడని లోకేశ్‌కు ఉన్నట్టుంది జ్ఞానోదయం కావడం ఆశ్చర్యమే.
తాజాగా ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడం ఆనందించాల్సిన విషయం. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనుషులుగా పరస్పరం గౌరవించుకోవడం మంచి సంప్రదాయం.
ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లడంతో కొంతసేపు ఆందోళన నెలకొంది. లోకేశ్ పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
అనంతరం ట్రాక్టర్ మీద నుంచి లోకేశ్‌ను కిందకు దింపారు. లోకేశ్ సురక్షితంగా బయట పడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా భవిష్యత్‌లో టీడీపీ స్టీరింగ్‌ను చేపట్టి ముందుకు నడపాల్సిన లోకేశ్‌కు డ్రైవింగ్ రాకపోవడం ఏంటని? ప‌్రత్యర్థులు సెటైర్లు విసురుతున్నారు.
ట్రాక్టరే నడపలేని లోకేశ్ …ఇక పార్టీని ఎలా నడుపుతారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో టీడీపీ కకావికలం కాకుండా కాపాడుకోవడం చంద్రబాబుకే సాధ్యం కాలేదని, ఇక ఆయన తనయుడు లోకేశ్‌తో ఏమవుతుందని వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
వరద బాధితుల పరామర్శలో భాగంగా జగన్ సర్కార్‌పై లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శిస్తుండడంతో …అధికార పార్టీ నేతలు కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టడం లేదు.