“ఆయన సింగిల్ కాదు మింగిల్..
ఇవాళ కంఠం ఆయనది. భావం చంద్రబాబుది
పవన్ ఓ గెస్ట్ టూరిస్ట్..
మీది ఓ పంచకూల కషాయం..
గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్.. కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి..”
పవన్ కల్యాణ్ కి ఒక త్రివిక్రమ్ సరిపోతాడేమో.. కానీ వైసీపీలో చాలామంది త్రివిక్రమ్ లు ఉన్నారు. పవన్ సభ లో పేల్చిన పంచ్ ల కంటే.. ఆ తర్వాత ప్రెస్ మీట్లలో పేర్ని నాని, వెల్లంపల్లి పేల్చిన పంచ్ డైలాగులే ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అంబటి పేల్చిన పంచ్ లు ఎట్రాక్ట్ చేశాయి. ఈ రేంజ్ లో ప్రతిస్పందన ఉంటుందని పవన్ కూడా ఊహించి ఉండడేమో.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, జనసేన ఆవిర్భావ సభకు పెద్ద తేడాలేదన్నారు పేర్ని నాని. అక్కడ కూడా సినిమా రచయితలు రాసిచ్చిన డైలాగుల్ని పవన్ కంఠత పెట్టారని, ఇప్పుడు కూడా అదే పని చేశారని విమర్శించారు. అదే సమయంలో పవన్ పై పేర్ని నాని పేల్చిన పంచ్ డైలాగులు అదిరిపోయాయి. ఆవిర్భావ సభలో ప్రసంగం కోసం పవన్ ఎంత కసరత్తు చేశారో తెలియదు కానీ, అది పూర్తయిన గంటల వ్యవధిలోనే కౌంటర్లు ఆ స్థాయిలో పడటం మాత్రం విశేషమే.
తానెప్పుడూ ఒంటరిని అని చెప్పుకునే పవన్ నిజానికి సింగిల్ కాదని, టీడీపీతో ఆయన మింగిల్ అని దెప్పిపొడిచారు పేర్ని నాని. పొత్తులకు సై అని పవన్ కంఠం చెబుతున్నా లోపల భావం మాత్రం చంద్రబాబుదే ఉందని అన్నారు. తమని మానసిక అత్యాచారం చేశారంటూ పవన్ చేసిన విమర్శలకు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు పవన్. అవంతి పూబంతి, వెల్లుల్లి, ర్యాంబో అంటూ పవన్ చేసిన వెటకారాన్ని దుయ్యబట్టారు. మానసిక అత్యాచారం చేయడంలో మీరు స్పెషలిస్టా..? మీకేమైనా లైసెన్స్ ఉందా అని ప్రశ్నించారు.
ఉద్యమాలు జరుగుతున్నప్పుడు విహార యాత్రకు వచ్చినట్టు వస్తారు, పక్కనోళ్ల బాక్సు తీసుకుని పెరుగన్నం తిని వెళ్తారు, వెళ్తూ వెళ్తూ చంద్రబాబు ఇంటికెళ్లి అంతా బాగానే జరిగిందని చెబుతారు.. అంటూ పవన్ ఉద్యమ పంథాని కూడా ఎండగట్టారు నాని. సిద్ధాంతాలు, లక్షల పుస్తకాలు చదివిన మీలాంటి వారు ఇలా ప్రవర్తించడం ధర్మం కాదంటూ సెటైర్ పేల్చారు.
రోజూ ఢిల్లీలో సలాం కొట్టే పవన్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో తెలియదా అని ప్రశ్నించారు నాని. హిందూ దేవతలకు అపచారం జరిగిందని పంగనామాలు పెట్టుకుని మాట్లాడుతున్న పవన్ కి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఆలయాలను పడగొట్టారో తెలియదా అని అడిగారు. జనసేన మిత్రపక్షంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎండోమెంట్ చట్టాన్ని ఎందుకు మార్చలేదన్నారు.
వెల్లుల్లి అంటూ తనపై సెటైర్ పేల్చే సరికి మంత్రి వెల్లంపల్లి కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ గబ్బర్ సింగ్ కాదని, రబ్బర్ సింగ్ అని అన్నారు. మధ్యాహ్నం పొలిటికల్ మీటింగ్ సాయంత్రం ఫామ్ హౌస్ మీటింగ్ చేసేవారికి రాజకీయాలెందుకని ప్రశ్నించారు వెల్లంపల్లి. పవన్ రాజకీయాల్లో ఊసరవెల్లి లాంటి వారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి అంగీకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులన్నారని, అప్పుడు వైసీపీ నేతలు గాడిదలు కాశారా అంటూ పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో దేవాలయాలు కూల్చినప్పుడు పవన్ గాడిదలు కాశారా, పందులు కాశారా అంటూ విమర్శించారు మంత్రి వెల్లంపల్లి. పవన్ కల్యాణ్ పొలిటికల్ కమెడియన్ అని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. సోషల్ మీడియాలో అంబటి పంచ్ లు మరో ఎత్తు. “జనసైనికులారా తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధంకండి.. ఇదే జనసేన ఆవిర్భాత దినోత్సవ సందేశం” అంటూ అంబటి పెద్ద పంచ్ పేల్చారు. చంద్రబాబుకు నమస్కారం పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టకపోవడమే పవన్ సంస్కారం అంటూ చెడుగుడు ఆడేసుకున్నారు. ఈ నేతల కామెంట్స్ చూస్తుంటే.. వైసీపీలోనే ఎక్కువమంది త్రివిక్రమ్ లు ఉన్నట్టు అనిపిస్తోంది.