అదృష్టం తలుపు తడుతూ రావడం అంటే ఇదే మరి. రాత్రికి రాత్రి ఓ కూలీ జీవితాన్ని కోటీశ్వరుడిని చేసింది. ఇది కలా, నిజమా అని ఆ కూలీ కుటుంబం నమ్మలేనంత సొమ్ము లాటరీలో తగిలింది. ఈ ఆనందకర సంఘటన కేరళ రాష్ట్రంలోని మలూర్లోని తోలంబ్రా ప్రాంతం పురాలీమాల కైతాంచల్ కురీచయ కాలనీలో చోటు చేసుకొంది.
పేరూసన్ రాజన్ (58)ది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. కూలి పనులకు పోతే తప్ప కుటుంబం గడవని దుర్భర జీవితం. దీంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఏదైనా జీవితంలో అద్భుతం జరిగితే తప్ప అప్పులు తీరడంతో పాటు కష్టాల నుంచి బయటపడలేనని అతను అనుకునే వాడు. కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులో కొంత సొమ్మును లాటరీ టికెట్ కొనేందుకు ప్రతి రోజూ ఖర్చు చేసేవాడు.
ఏదో ఒక రోజు అదృష్ట దేవత తలుపు తట్టకపోతుందా, తన జీవితం మారకపోతుందా అని అతను నమ్ముతూ వచ్చాడు. అతని నమ్మకమే విజయం సాధించింది. అదృష్ట దేవత అతని తలుపు తట్టింది. రాజన్ కొన్న లాటరీ టికెట్కు కేరళ క్రిస్టిమస్ బంపర్ లాటరీ అక్షరాలా రూ.12 కోట్లు దక్కింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇది నిజంగా నిజమేనా లేక కలా అని కొంత సేపటి వరకు నమ్మలేక పోయాడు. ఆ తర్వాత వాస్తవమే అని తెలిసి భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంత పెద్ద మొత్తంలో లాటరీ తగులుతుందని ఊహించలేదని రాజన్ ఆనందంతో చెప్పాడు. రాజన్ తన భార్య రజనీ, కుమారుడు రిజిల్, కుమార్తె అక్షరలతో కలిసి కన్నూర్ జిల్లా సహకార బ్యాంకుకు వచ్చి అక్కడి అధికారులకు లాటరీ టికెట్ అప్పగించారు.
కూతుపరంబ పట్టణంలో లాటరీ టికెట్ కొన్నానన్నాడు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయన్నాడు. ఈ డబ్బులతో ముందుగా అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పాడు. అలాగే తనకు కష్టాల్లో సాయం చేసిన వాళ్లకి అండగా నిలుస్తానని రాజన్ చెప్పాడు. శ్రమకోర్చి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించాడు.