విధేయతా ?…సమర్థతా ? 

తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఎపిసోడ్ కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో తెలియడంలేదు. ఇది కార్తీక దీపం సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు…

తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఎపిసోడ్ కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో తెలియడంలేదు. ఇది కార్తీక దీపం సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు టీపీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని పక్కన పెట్టాలని, లేకపోతే అది తన గెలుపు మీద ప్రభావం చూపిస్తుందని అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి, కురువృద్ధుడు జానా రెడ్డి అధిష్టానానికి చెప్పారు కదా. అధిష్టానం ఆయన మాటను గౌరవించి టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేసింది.

జానా రెడ్డి అప్పట్లో ఆ షరతు పెట్టక పోయుంటే ఈపాటికి టీపీసీసీ కొత్త ఆధ్య్యక్షుడు తెర మీదికి వచ్చేవాడు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నిక మీద ఇంట గందరగోళం జరగడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్ష రేసులో రేవంత్ ముందువరుసలో ఉన్నాడు. కానీ ఆయన ఒరిజినల్ కాంగ్రెసువాది కాదు కదా. టీడీపీ నుంచి వచ్చాడు. పార్టీలో కూడా ఇతర నాయకులతో పోల్చుకున్నప్పుడు చాలా జూనియర్. ఇతర నాయకులతో చూసుకున్నప్పుడు వయసులోనూ చిన్నవాడు. కానీ విపరీతమైన చురుకుదనం ఉన్న నాయకుడు. టీడీపీలోనూ ఇలాగే ఉండేవాడు.

అధికార పార్టీ మీద విమర్శలు చేయడంలో చాలా స్పీడ్. ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడంటే పక్కాగా ఆధారాలు చూపిస్తాడు. చాలా కాంక్రీట్ గా మాట్లాడతాడు. రేవంత్ అధ్యక్షుడైతే అది చాలామంది సీనియర్లకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక సామాజాకా వర్గం పరంగా చూసుకుంటే ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం. 

ఒకవేళ రేవంత్ అధ్యక్షుడైతే ఆయనా రెడ్డి సామాజిక వర్గం వాడే అవుతాడు. ఈ పదవిని వీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని వి. హనుమంత రావు అలియాస్ వీహెచ్ లాంటివారు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే వారు సామాజిక వర్గాన్ని ముందుకు తెచ్చారు. ఇప్పుడు అదీ వెనక్కి పోయింది.

కాంగ్రెస్ పార్టీ విధేయులకు ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబానికి విధేయులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా దీనిపై సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. ఈమధ్య వీహెచ్ ఘాటుగానే మాట్లాడుతున్నాడు. తనకు పొమ్మనలేక పొగబెడుతున్నారని అన్నాడు. విచిత్రమేమిటంటే … ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నప్పటికీ దాని అధ్యక్ష పదవి మీద మోజు మాత్రం తగ్గలేదు. కాంగ్రెస్ నాయకులు ఆ పదవిని సీఎం పదవితో సమానంగా భావిస్తారు. అందుకనే పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఆ పదవి దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మధు యాష్కీ, జగ్గా రెడ్డి, షబ్బీర్ అలీ … ఇలా ఎందరో కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యే నాయకుడి నేతృత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 

పీసీసీ అధ్యక్షుడి విషయంలో.. కొంత మంది నేతలు తమ లెటర్ హెడ్ మీద  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్ మీద రాసిన లేఖపై .. ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తూర్పు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు సంతకాలు చేశారు. 

ఆ లేఖలో అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లో అభ్యర్థి ట్రాక్ రికార్డ్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ కి గాంధీ కుటుంబానికి లాయలిస్ట్, నమ్మకస్తుడు అయ్యుండాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ.. తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యేలు కూడా అందరూ సంతకాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆరుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఈ లెటర్ పై ముగ్గురు మాత్రమే సంతకాలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు చేయలేదు. వీరిలో రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సీతక్క మాత్రం మొదటి నుంచి.. ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ ఎంపీ రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొనే రాశారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలాఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఆ పదవి రేసులో తాను లేనని అన్నారు. మొత్తం మీద డైలీ సీరియల్‌ను తలపిస్తున్న  టీపీసీసీ ప్రక్రియలో కొత్త ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఎటువైపు కు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి పార్టీ అధిష్టానం విధేయతకు పెద్ద పీట వేస్తుందా ? సమర్ధతకు పట్టం కడుతుందా? చూడాలి