మేకర్స్ ముందుజాగ్రత్త.. క్యూ కట్టడం ఆపేశారు

సెకెండ్ వేవ్ కు ముందు టాలీవుడ్ మేకర్స్ అంతా ఎగబడ్డారు. వరుసపెట్టి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. అప్పుడే సెట్స్ పైకొచ్చిన సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటించి హంగామా చేశారు. ఎప్పుడైతే…

సెకెండ్ వేవ్ కు ముందు టాలీవుడ్ మేకర్స్ అంతా ఎగబడ్డారు. వరుసపెట్టి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. అప్పుడే సెట్స్ పైకొచ్చిన సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటించి హంగామా చేశారు. ఎప్పుడైతే సెకెండ్ వేవ్ మొదలై, మళ్లీ థియేటర్లు మూతపడ్డాయో అంతా సైలెంట్ అయ్యారు. ప్రకటించిన తేదీలన్నీ పోయాయి.

ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో సందడి మొదలైంది. ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్ తో పాటు పెద్ద-చిన్న సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చాయి. కానీ గతంలో చూపించిన అత్యుత్సాహాన్ని మాత్రం ఈసారి ప్రదర్శించడం లేదు మేకర్స్. ఏ ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించడం లేదు. ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి కూడా రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు.

మూడో ముప్పు భయం

దేశంలో కరోనా భయాలు ఇంకా తొలిగిపోలేదు. మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ వస్తుందనే అనుమానాలున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మూడో ముప్పు ఎదుర్కోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైన ఉదంతాల్ని ఉదాహరణలుగా చూపిస్తున్నారు.

సో.. ఇలాంటి టైమ్ లో మరోసారి రిలీజ్ డేట్స్ ప్రకటించి, ఆ తర్వాత థర్డ్ వేవ్ వస్తే ఇంకోసారి ఆశాభంగం తప్పకపోవచ్చు. అందుకే మేకర్స్ అంతా సైలెంట్ అయ్యారు. ఆచార్య, అఖండ, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైనప్పటికీ ఇంకా విడుదల తేదీలు ప్రకటించకపోవడానికి ఇదే కారణం.

థియేటర్లతో జగడం

ఓవైపు కరోనా భయాలతో పాటు మరోవైపు థియేటర్ల సమస్యలు కూడా ఉండనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేసినప్పటికీ సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి లేదు. వినాయక చవితి తర్వాతే థియేటర్లు తెరుచుకుంటాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించడం కష్టం అంటున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్ల వ్యవహారం కూడా ఉండనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లపై సినిమాలు నడిపించడం సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో థియేటర్లకు నిర్ణయించిన ధరలు తమకు ఆమోదం కాదని చెబుతున్నారు. దీనికితోడు ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉండడంతో.. ప్రస్తుతానికి 3 షోలకే అనుమతిచ్చారు. అంటే 50శాతం ఆక్యుపెన్సీతో 3 షోలు మాత్రమే నడిపించాలన్నమాట.

మరోవైపు టాలీవుడ్ కు అత్యంత కీలకమైన ఓవర్సీస్ పరిస్థితులు కూడా ఏమంత అనుకూలంగా లేవు. జాతిరత్నాలు, క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలకు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వచ్చాయనే ఆనందం ఓవైపు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇప్పటికిప్పుడు మరో సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. 

అందుకే మేకర్స్ అంతా తమ సినిమాలు ఓవైపు రెడీ అవుతున్నప్పటికీ, మరోవైపు రిలీజ్ డేట్స్ మాత్రం ప్రకటించకుండా స్తబ్దుగా ఉండిపోతున్నారు. అటు చిన్న సినిమాలు మాత్రం ఈ నెలాఖరు నుంచి థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవి రిలీజైన తర్వాత థియేటర్ల అసలు మార్కెట్ ఏంటనేది బయటపడుతుంది.