పశ్చిమబెంగాల్ లో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. వీటిల్లో ఒక స్థానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన మమత.. ఈ బై పోల్ లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగే ప్రయత్నంలో ఉన్నారు. అందు కోసం భవానీపూర్ కు ఉప ఎన్నికను తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఈ సీటుకు సీఈసీ ఉప ఎన్నికను నిర్వహిస్తోంది.
భారీ ఎత్తున ప్రచారం లేకపోయినా.. పోటాపోటీ పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికలో మమతను ఓడించి.. ఆమెకు చెక్ పెట్టడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో మమతను ఓడించినట్టే, ఈ బై పోల్ లోనూ ఓడించి సత్తా చూపుతామంటూ సువేందు అధికారి ప్రకటించుకున్నారు.
ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న మమతను మరోసారి ఎమ్మెల్యేగా ఓడించి.. ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తామన్నట్టుగా కమలం పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. వాళ్ల టార్గెట్ గట్టిగానే ఉన్నా.. అది ఆచరణలో తేలికగా కనిపించడం లేదు.
భవానీపూర్ టీఎంసీకి కంచుకోట. గతంలో మమత ఇదే సీటు నుంచి రెండు సార్లేమో నెగ్గారు. అలాంటి చోట ఆమెను ఓడించడం దాదాపు అసంభవం. ఫలితాల సరళి కూడా ఇదే చెబుతూ ఉంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికే మమత మెజారిటీతో దూసుకుపోతున్నారు.
మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి మమతా బెనర్జీ 2500 ఓట్లకు పైగా మెజారిటీని సంపాదించారు. బీజేపీ అభ్యర్థి తొలి రౌండ్ లో కేవలం ఎనిమిది వందల ఓట్లు మాత్రమే పొందారు.
భవానీ పూర్ లో టీఎంసీకి ఉన్న ఊపు, తొలి రౌండ్ల కౌంటింగ్ సరళిని గమనిస్తే.. మమత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనంగా కనిపిస్తూ ఉంది. మరోసారి మమతను ఓడించి సీఎం సీట్లో కూర్చుకోవడానికే ఆమె మొహమాటపడే పరిస్థితి తీసుకురావాలనుకున్న బీజేపీ లక్ష్యం నెరవేరుతున్నట్టుగా లేదు!