చూడ్డానికి స్మార్ట్ గా ఉంటాడు. చక్కగా చదువుకున్నాడు. అంతే చక్కగా మాట్లాడతాడు. కార్పొరేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకేముంది.. ఈ అర్హతల్నే తన మోసానికి పెట్టుబడిగా పెట్టుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 17 కోట్ల రూపాయలు దోచేశాడు.
నెల్లూరుకు చెందిన శ్రీహర్ష, తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసి బ్యాంక్ ఉద్యోగం కూడా సంపాదించాడు. హైదరాబాద్ లోని తార్నాక బ్రాంచ్ లో మూడేళ్లు పనిచేశాడు. ఆ మూడేళ్లలో చాలామంది కస్టమర్లను తన వలలో వేసుకున్నాడు. బ్యాంకులో పెట్టే డబ్బు కంటే, తన దగ్గర పెడితే, వాటిని మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టి రెట్టింపు లాభాలు ఇస్తానన్నాడు.
శ్రీహర్ష మాటలు నమ్మి చాలామంది అతడికి డబ్బులిచ్చారు. వాళ్లందరికీ ఠంచనుగా నెలకోసారి వడ్డీ ఇచ్చేవాడు. అలా లక్షల నుంచి ప్రారంభించి కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం ప్రారంబించాడు శ్రీహర్ష. మరోవైపు బ్యాంక్ వాళ్లు అతడికి ప్రమోషన్ ఇచ్చారు. తార్నాక నుంచి ఏకంగా అబుదాబి మెయిన్ బ్రాంచ్ కు పంపించారు. ఎప్పుడైతే తన కస్టమర్లకు దూరంగా అబుదాబి వెళ్లాడో శ్రీహర్ష తన అసలు రంగు బయటపెట్టాడు.
కస్టమర్ల నుంచి తీసుకున్న డబ్బును వెనక్కి ఇవ్వలేదు. అబుదాబి బ్రాంచ్ లో కనుక్కుంటే, అప్పటికే ఉద్యోగం మానేసినట్టు తెలిసి ఖాతాదారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబుదాబి బ్రాంచ్ లోనే పంజాబ్ కు చెందిన ఓ అమ్మాయితో శ్రీహర్షకు పరిచయమైంది. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల అనుమానమే నిజమైంది. పంజాబ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని, అన్ని గుర్తింపులు వదిలేసి, ఆ స్టేజ్ లోనే గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేస్తున్నాడు శ్రీహర్ష. మొత్తానికి పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. 17 కోట్ల రూపాయల్ని కక్కించే పనిలో పడ్డారు.