విజయవాడతో పాటు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో చీటీ మోసాలు ఈమధ్య ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. నమ్మకంగా చిట్టీలు కట్టించుకోవడం, ఆ తర్వాత బోర్డు తిప్పేయడం సర్వసాధారణమైంది. తాజాగా బెజవాడలో అలాంటిదే మరో ఘటన జరిగింది. 15 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో ఎంతో నమ్మకస్తుడిగా కనిపించిన ఓ వ్యక్తి, 4 కోట్ల రూపాయలతో ఉడాయించాడు.
సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో 15 ఏళ్లుగా ఉంటున్నాడు బాలాజీరావు. అతడికి అక్కడ సొంతిల్లు కూడా ఉంది. చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఠంచనుగా అందరికీ వడ్డీలు, చిట్టీ డబ్బులు ఇచ్చేస్తుంటాడు. దీంతో ఆ ప్రాంతంలో చాలామంది బాలాజీరావు దగ్గర చిట్టీలు స్టార్ట్ చేశారు. మరికొంతమంది అధిక వడ్డీకి ఆశపడి అతడికి అప్పులు కూడా ఇచ్చారు.
సరైన సమయం చూసిన బాలాజీరావు బిచానా ఎత్తేశాడు. 4 కోట్ల రూపాయలతో పాటు, చెల్లించాల్సిన చిట్టీ డబ్బులతో సహా పరారయ్యాడు. ఇతడి దెబ్బకు దాదాపు వంద మందికి పైగా తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తోంది. బాలాజీరావు తమను మోసం చేశాడని తెలుసుకున్న బాధితులు, అతడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. అప్పుడే వాళ్లకు మరో నిజం కూడా తెలిసింది.
ఈమధ్య బాలాజీరావు తన సొంత ఇంటిని కూడా అమ్మేశాడు. కనీసం పక్కింటికి కూడా తెలియకుండా తన ఇంటిని అమ్మేశాడనే విషయం తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, ఛీటర్ బాలాజీరావు కోసం వెదుకుతున్నారు.