కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ ఎంపికలో ప్రతిష్టంభన ఏర్పడిందా? అక్కడ పార్టీని ఏకతాటిపైకి తీసుకు రావడంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి చేతకాలేదా? తదితర ప్రశ్నలు గత నాలుగు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంలో నిజానిజాలేంటో తెలుసుకుందాం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చావు దెబ్బతింది. ఆ పార్టీకి అంతోఇంతో పరువు దక్కిందంటే రాయలసీమలోని తాడిపత్రి, మైదుకూరులో వచ్చిన మెరుగైన ఫలితాలే కారణమని చెప్పక తప్పదు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ తమ పట్టు నిలుపుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ మంచి ఫలితాలు సాధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చైర్మన్ పదవిలో కూచున్నారు. ఇక మైదుకూరులో విజయ తీరాలకు వచ్చినప్పటికీ టీడీపీ త్రుటిలో చైర్మన్ పదవిని కోల్పోయింది.
మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా.. టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడంతో చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకుంది. వైఎస్సార్‌సీపీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులుండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. వైసీపీ బలం 13కి పెరిగింది. ఇదే సందర్భంలో టీడీపీ ఆరో వార్డ్ కౌన్సిలర్ మహబూబ్‌బీతో పాటూ జనసేన కౌన్సిలర్ బాబు చైర్మన్ ఎంపికప్పుడు సమావేశానికి రాలేదు. వైఎస్సార్‌సీపీకి 11 వార్డులతో పాటూ ఎక్స్ అఫిషియో రెండు ఓట్లు తోడుకావడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి వైసీపీ వశమైంది.
మైదుకూరు మున్సిపల్ చైర్మన్‌గా మాచనూరి చంద్ర, వైస్ చైర్మన్‌గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. రెండో చైర్మన్ పదవిని కూడా తీసుకురావడం, కోరం లేక మైదుకూరులో సమావేశం వాయిదా పడుతుండడంతో రాజకీయంగా పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. వైసీపీలో రెండో వైస్ చైర్మన్ ఎంపికపై ఏకాభిప్రాయం రాలేదని, అందువల్లే ఈ తలనొప్పి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవడంతో రెండో వైస్ చైర్మన్ ఎంపిక కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చైర్మన్ పదవిని బలిజ, అలాగే వైస్ చైర్మన్‌గా ముస్లిం మైనార్టీకి ఇచ్చారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇక రెండో వైస్ చైర్మన్ విషయానికి వస్తే రెడ్డి లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేయడమే తరువాయని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యం కాస్త కుదుట పడగానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.