ఎంత పని చేశావ్ పుష్ప..!

ఇది సినిమా కథ కాదు, కర్నాటకలో నిజంగా జరిగిన యదార్థ ఘటన. పుష్ప అనే మహిళ, తన ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు తాగింది. అంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు.  Advertisement…

ఇది సినిమా కథ కాదు, కర్నాటకలో నిజంగా జరిగిన యదార్థ ఘటన. పుష్ప అనే మహిళ, తన ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు తాగింది. అంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇలాంటి బాధాకరమైన ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. అయితే పుష్ప విషయంలో మాత్రం ఓ చిన్నారి ఆచూకి మిస్టరీగా మారింది. ఈ ఆత్మహత్యల వెనక జరిగిన ఘటనలు పరిశీలిస్తే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కళ్లకు కనిపిస్తుంది.

ఇంతకీ ఏం జరిగింది..

కర్నాటకలోని హోసూర్ కు చెందిన సుమిత్ర, పారా-మెడికల్ స్టూడెంట్. అదే ప్రాంతానికి చెందిన సత్య, సుమిత్ర ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుమిత్ర గర్భవతి అయింది. చదువు, ఉద్యోగం పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ కోలార్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం సుమిత్ర తల్లికి మాత్రం తెలుసు.

బిడ్డ పుట్టిన 11 రోజుల తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోవాలని సత్య-సుమిత్ర నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల్ని ఒప్పించిన తర్వాత బిడ్డను ఇంటికి తీసుకెళ్లాలని భావించారు. అప్పటివరకు జాగ్రత్తగా చూసుకోమని తమకు తెలిసిన గీత అనే మహిళకు అప్పగించారు. గీత అందుకు అంగీకరించింది. పెంచడానికి కొంత డబ్బు కూడా తీసుకుంది.

అసలు ట్విస్ట్ ఇక్కడే..!

ప్రతి రోజూ వీడియో కాల్, వాట్సాప్ ద్వారా బిడ్డను చూసుకుంటున్నారు తల్లిదండ్రులు సత్య-సుమిత్ర. అయితే కొన్ని రోజులకు గీత మొహం చాటేసింది. 

బిడ్డను వీడియో కాల్, వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చూపించకుండా రకరకాల సాకులు చెప్పడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చిన సత్య-సుమిత్ర, గీతను కలిశారు. షాక్ ఏంటంటే.. బిడ్డ గీత దగ్గర లేదు. సరిగ్గా ఇక్కడే సీన్ లోకి ఎంటరైంది పుష్ప అనే మహిళ.

పుష్ప ఎవరు.. ఏం చేసింది?

గీత ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది పుష్ప. కొన్నాళ్ల పాటు బిడ్డను చూసుకోమని పుష్పకు బిడ్డను అప్పగించింది గీత. ఈ క్రమంలో పుష్ప నుంచి కూడా బిడ్డ మాయమైంది. దీంతో సత్య-సుమిత్ర పోలీసుల్ని ఆశ్రయించారు. గీత, పుష్పను స్టేషన్ కు పిలిచిన పోలీసులు.. 5 రోజుల్లో బిడ్డను అప్పగించాలని హెచ్చరించి పంపించేశారు. సరిగ్గా ఇక్కడే ఘోరం జరిగిపోయింది.

పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన వెంటనే గీత, తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైంది. అవమానం భరించలేని పుష్ప మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పుష్ప, ఆమె భర్త, 17 ఏళ్ల కూతురు, పుష్ప తల్లిదండ్రులు.. ఇలా అంతా కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

చనిపోతూ సూసైడ్ లెటర్ రాసిపెట్టింది పుష్ప. బిడ్డను మరో వ్యక్తికి గీత అమ్మేసిందని, తన చేతుల మీదుగానే బిడ్డను వేరే వాళ్లకు అప్పగించానని ఉత్తరంలో రాసింది పుష్ప. ఇదే విషయం పోలీసులకు చెబితే సరిపోయేది. భయంతో పుష్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ఇప్పుడు మరింత జటిలంగా మారింది.