తొందర పడి ఒక కూయిల ముందే కూసింది అన్నట్టు, గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు రాజకీయంగా తప్పటడుగు వేశారు. ప్రధాని మోదీపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ఈ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కడితే రాజకీయంగా లబ్ధి కలుగుతుందని ఓ మీడియాధిపతి, వారాంతపు పలుకుల సార్ ఇచ్చిన సలహాతో చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించారు. చివరికి బద్ద శత్రువైన కాంగ్రెస్‌తో చేతులు కలిపి, చంద్రబాబు కోలుకోలేని మూల్యం చెల్లించుకున్నారు.
కేవలం 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం కావడానికి మోదీని వ్యతిరేకించడం కూడా ఒక కారణమని ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే చంద్రబాబు పుణ్యకాలం కాస్త ముగిసిపోయింది. ఏపీ పట్ల మోదీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా ….గత సార్వత్రిక చేదు అనుభవాలు ఆయనపై విమర్శలు గుప్పించలేని నిస్సహాయ స్థితిని కల్పించాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ఆయన ప్రాభవం అమాంతం పడిపోతోందని తాజా సర్వే నివేదిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గతంలో మోదీపై వ్యతిరేకత లేని సమయంలో ధిక్కార స్వరం వినిపించిన చంద్రబాబు, ఇప్పుడు తన సత్తా ఏంటో జాతీయ స్థాయిలో తెలియజేసే సువర్ణావకాశం లభించింది. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటే మాత్రం చంద్రబాబు ప్రధాని పదవిలో ఆశలను సజీవంగా ఉంచుకునే అవకాశాలు లేకపోలేదు.
అమెరికాకు చెందిన డేలా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్’ వెల్లడించిన వివరాలు ప్రధాని మోదీకి రానున్నది గడ్డు కాలమే అని హెచ్చరిస్తున్నాయి. ‘మార్నింగ్’ చెబుతున్న ప్రకారం… మోదీ రేటింగ్ ప్రస్తుతం 63 శాతానికి దిగజారింది. ప్రపంచంలోని 13 మంది ముఖ్యనేతల రేటింగ్‌ను ప్రతి వారం ఈ సంస్థ ట్రాక్ చేస్తుంది. ఈ పరంపరంలో 2019, ఆగస్టు నుంచి మోదీ జనాదరణను ట్రాక్ చేస్తూ వస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని దేశం యావత్తు ముక్త కంఠంతో నినదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై జనాదరణ ఫలితాలు బీజేపీకి షాక్ ఇస్తున్నాయి. ఈ కరోనా కాలంలో అంటే ఏప్రిల్‌లో మోదీ ఆమోదయోగ్యత అత్యధికంగా 22 పాయింట్లకు పడిపోయిందని మార్నింగ్ సంస్థ సర్వేలో వెల్లడైంది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ మోదీ ప్రజాదరణ కోల్పోలేదని ఆ సంస్థ చెబుతోంది.
ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మినీ భారత్ ఎన్నికలుగా తలపించిన ఈ పోరులో బీజేపీ అధ్వానమైన పనితీరు కనబరిచి, పేలమైన ఫలితాలను దక్కించుకుంది. పశ్చిమబెంగాల్‌లో 3 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు ఎదిగామని పైకి బీజేపీ చెబుతున్నా…. అక్కడ సర్వశక్తులు ఒడ్డినా మమతాబెనర్జీ ముందు మోదీ-అమిత్‌షా ఆటలు సాగలేదన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో మరోసారి మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ, శరద్‌పవార్, కేజ్రీవాల్ తదితర జాతీయ నేతలతో కలిసి చంద్రబాబు కూటమి కడితే ఎలా ఉంటుంది? టీడీపీ నేతల్లోనూ, శ్రేణుల్లోనూ ఓ ఆలోచన.
టీడీపీ చరిత్రలో లేని విధంగా దెబ్బతీసిన మోదీ అంతు చూసేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు ఆ పార్టీలో అంతర్గతంగా తప్పక కలుగుతాయి. ఎందుకంటే ప్రత్యర్థి బలహీనపడినప్పుడే , వారిపై స్వారీ చేయడానికి వీలుంటుంది. ఆ దిశగా చంద్రబాబు ఆలోచించి ముందడుగు వేస్తే మాత్రం… లక్కీ చాన్స్ కొట్టొచ్చేమో!