ఒకవైపు మోడీ హయాంలో భారత విదేశాంగ విధానం వెలిగిపోతోందంటూ భక్తులు చెబుతూ ఉంటారు. అయితే మోడీ తొలి టర్మ్ లో ప్రధానిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి భారత విదేశాంగ విధానంలో చాలా మార్పు వచ్చిందని పరిశీలకులు అంటూ ఉంటారు. అందుకు వారు పలు కారణాలను ప్రస్తావిస్తూ ఉంటారు.
ఇక ప్రధాన మంత్రి హోదాలో మోడీ అమెరికాకు వెళ్లి 'అబ్కీ బార్ ట్రంప్ సర్కార్' అంటూ నినాదం ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి రాజకీయాల గొడవ మనకెందుకు? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
పరాయి దేశ పాలకులు ఎవరైనా, అక్కడ ఏ పార్టీలు అధికారంలో ఉన్నా.. మనకు సంబంధం లేని అంశమే. అమెరికా అధ్యక్షుడు క్లింటన్ అయినా, బుష్ అయినా భారతీయులు వారిని అమెరికా అధ్యక్షులుగా చూశారు కానీ, వారు డెమొక్రాట్లా, రిపబ్లికన్ లా .. వాళ్ల వ్యక్తిగత ఆసక్తులు, వారికి వచ్చిన మెజారిటీలతో భారతీయులకు పని లేదు.
భారతీయులకే కాదు.. ఏ దేశం కూడా మరో దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలనే ఆసక్తి అంత ప్రయోజనకరమైనది కాదు. అయితే ట్రంప్ మళ్లీ నెగ్గాలంటూ రాజకీయ ప్రకటన చేసి మోడీ మనకు సంబంధం లేని అంశంపై స్పందించినట్టుగా అయ్యింది.
మోడీ పిలుపును, మోడీ ఆకాంక్షను అమెరికన్లు పట్టించుకున్నట్టుగా లేరు. ఇప్పుడు ట్రంప్ ఓడిపోయారు. ఆయన ప్రత్యర్థి విజయం సాధించారు. అయితే బైడెన్ ప్రతి అంశంలోనూ చాలా హుందాగా స్పందిస్తున్నారు. తను డెమొక్రాట్లకో, రిపబ్లికన్లకో అధ్యక్షుడిని కాదంటూ.. తను అమెరికాకు అధ్యక్షుడిని అంటున్నారు. ఇలా హుందాగా స్పందిస్తున్నారాయన.
అదే ఆయనది కూడా ఏ ట్రంప్ లాంటి మనస్తత్వమో అయి ఉంటే? మోడీ రాజకీయ పిలుపులను మనసులో పెట్టుకుంటే? ఇదెలాంటి పరిణామాలకు దారి తీస్తుందో! అందుకే.. అమెరికాలో మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది అప్పట్లోనే. భక్తగణం ఇలాంటి అంశాలను పట్టించుకోదేమో కానీ, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు.