జనసేనాని పవన్‌కల్యాణ్ కంటే డైలాగ్ కింగ్ మోహన్‌బాబుకే ఢిల్లీలో పలుకుబడి బాగా ఉన్నట్టుంది. పవన్ ఢిల్లీ పర్యటన కేవలం ప్రచారానికే తప్ప ఫలితాలు ఇవ్వడం లేదు. శనివారం ఆయన ఆకస్మికంగా ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడంతో రకరకాల ఊహాగానాలకు తావిచ్చాడు. తీరా ఢిల్లీకి పోయినా…కనీసం ఒక్క బీజేపీ అగ్రనేతను కూడా ఇంత వరకు కలిసిన దాఖలాలు లేవు.
ఇదే మన డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ప్రచారం లేకుండా నేరుగా ప్రధానితో భేటీ అయ్యాడు. సుమారు అర్ధగంట సేపు కూతురు లక్ష్మీప్రసన్న, కుమారుడు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధానితో మాట్లాడటం సామాన్యమైన విషయం కాదు.
అదే రోజు సాయంత్రం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా మోహన్‌బాబు కుటుంబంతో సహా కలుసుకోవడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. కానీ అలాంటివేమీ జరగలేదు.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుపై రచ్చ సాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. నిన్న రాత్రే బీజేపీ నాయకుడు నడ్డాను కలుస్తాడని ప్రచారం జరిగింది. కానీ కలిసిన దాఖలాలు లేవు. ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా పవన్ భేటీ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అదీ ఇంత వరకు జరగలేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో పవన్ ఢిల్లీలో ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అపాయింట్‌మెంట్ లేకుండానే పవన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత పర్యటన మాదిరిగానే బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మింట్ చిక్కక ఉత్తచేతులతో ఊగుతా రావాల్సిందేనా? అని జనసేన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీలో పవన్ కంటే మోహన్‌బాబుకే ఎక్కువ పలుకుబడి ఉందనే విషయం అర్థమవుతోంది.