మరి మనోళ్లు బుద్ధిగా ఉంటారా ? 

మనోళ్లు అంటే ఎవరండీ? మన కుటుంబ సభ్యులా? బంధువులా? ఫ్రెండ్సా ? వీళ్లంతా బుద్ధిగా ఉండాలా? ఎక్కడ ఉండాలి … ఎప్పుడు ఉండాలి? అబ్బే… బుద్ధిగా  ఉండాల్సింది వీళ్ళు కాదండి. వీరు బుద్ధిగా ఉన్నా…

మనోళ్లు అంటే ఎవరండీ? మన కుటుంబ సభ్యులా? బంధువులా? ఫ్రెండ్సా ? వీళ్లంతా బుద్ధిగా ఉండాలా? ఎక్కడ ఉండాలి … ఎప్పుడు ఉండాలి? అబ్బే… బుద్ధిగా  ఉండాల్సింది వీళ్ళు కాదండి. వీరు బుద్ధిగా ఉన్నా లేకున్నా దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మనోళ్లు అంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఈ ప్రజా ప్రతినిధుల్లో మనం మాట్లాడుకునేది పార్లమెంటు సభ్యుల గురించి.

అంటే ఎంపీలన్న మాట. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలనేదే కదా ప్రశ్న. త్వరలోనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి వర్షాకాల సమావేశాలన్న మాట. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించగానే ఉన్నట్టుండి ఆగిపోయాయి పార్లమెంటు సమావేశాలు. నిబంధనల ప్రకారం తరువాతి సెషన్స్ ఆరు నెలలలోగా నిర్వహించాలి.

అందుకే ఆగస్టు మూడోవారంలోగాని, నాలుగోవారంలోగాని పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆగస్టులో జరిగే సమావేశాల గురించి అంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేముంది అంటారా? ఉంది కదా మరి. వానాకాలం పార్లమెంటు సమావేశాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో జరగబోతున్నాయి. కాబట్టి  వీటికో ప్రత్యేకత ఉంది. సభ్యులు ఎప్పటిమాదిరిగా పార్లమెంటును (లోక్ సభ, రాజ్యసభ ) రణరంగం చేయడం కుదరదు. వీరావేశంతో, అరుపులతో, కేకలతో సభను స్తంభింపచేయడం కుదరదు.

గతంలో మాదిరిగా బాహాబాహీకి సిద్ధపడటం, బిల్లు ప్రతులనో, ఇతర కాగితాలనో చింపిపడేయడం వీలుకాదు. చీటికిమాటికి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడం కుదరదు. ఎందుకంటే కరోనా నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మాస్కులు కట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్స్ ఉపయోగించడం … ఇలాంటి పనులన్నీ చేయాలి.

ఎందుకంటే సమావేశాలను ప్రత్యక్షంగా ఎప్పటిమాదిరిగానే నిర్వహించాలనుకుంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు వర్చువల్ విధానంలో అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించాలనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నెల రోజుల కిందట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కరోనా నేపథ్యంలో సమావేశాలు ఎలా నిర్వహించాలనే విషయం చర్చించారు.

అప్పుడు వర్చువల్ సమావేశాలపై ఆలోచించారు. ఈ తరువాత హైబ్రిడ్ సెషన్ గురించి ఆలోచించారు. హైబ్రిడ్ సెషన్ అంటే ఫిజికల్, వర్చువల్ సమ్మేళనమన్నమాట. దీనిప్రకారం కొందరు సభ్యులు సభలో ఉంటే, కొందరు ఆన్లైన్ ద్వారా పాల్గొంటారు. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉన్నా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కష్టమని భావించారు. కొందరు ఫిజికల్ గా, కొందరు వర్చువల్ గా పాల్గొంటే సమన్వయం కుదరదని అనుకున్నారు.

చివరకు పూర్తిగా ప్రత్యక్ష సమావేశాలే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోంది. సమస్త జాగ్రత్తలు తీసుకొని సమావేశాలు నివహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఆరు నెలలలోగా సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ విధి అన్నారు. అసలు వర్షాకాలం సెషన్స్ జరగక పోవొచ్చని గతంలో కొందరు భావించినా ఇది తప్పనిసరి విధి కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిర్వహించాల్సిందే. పార్లమెంటులో ఎలా వ్యవహరించాలనేదానిపై ఎనిమిదికి పైగా నిబంధనలు రూపొందించారు.

లా మేకర్స్ ఆర్ లా బ్రేకర్స్ అనే నానుడి ఉంది కదా. శాసనకర్తలు తాము చేసిన శాసనాలను తామే అతిక్రమిస్తారు. కరోనా నిబంధనలు పాటించాలని నీతులు చెప్పే మంత్రులు, ప్రజా ప్రతినిధులు వారే కరోనా నిబంధనలు అతిక్రమించడం రోజూ చూస్తూనే ఉన్నాం. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు నిబంధనలు పాటిస్తారనే నమ్మకం ఏముంది? మాస్కులు కట్టుకోవచ్చు, శానిటైజర్స్ ఉపయోగించవచ్చు.

కానీ భౌతిక దూరం ఎంతమేరకు పాటిస్తారనేది డౌటే. సభలోకి వెళ్ళాక వారి ఒళ్ళు, వారి నోరు వారి స్వాధీనంలో ఉండవు. రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం ఆటోమాటిగ్గా జరుగుతుంది. సభ్యుడికి-సభ్యుడికి మధ్య కనీసం ఆరడుగుల డిస్టెన్స్ ఉండాలని చెబుతున్నారు. కాబట్టి సీటింగ్ లో మార్పులు చేసుకోవాలి. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవలసి రావొచ్చు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. గొడవలకు అలవాటుపడిన మన ఎంపీలు కరోనా నిబంధనలు ప్రకారం ఎంతమేరకు బుద్ధిగా వ్యవహరిస్తారో చూద్దాం. 

కరోనా చికిత్సకి రెండువేలు ఖర్చయింది

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను