మిగతా రాష్ట్రాల కంటే ఆలస్యంగా తెలంగాణలో లాక్ డౌన్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల కంటే వేగంగా సడలింపులిస్తున్నారు. ఇప్పటికే వీలైనన్ని ఎక్కువగా సడలింపులు, మినహాయింపులిచ్చిన ముఖ్యమంత్రి.. మరో 4 రోజుల్లో లాక్ డౌన్ ను నామ్ కే వాస్తే చేయబోతున్నారు. ఈసారి సమయాన్ని మరింత కుదించి, సాధారణ పరిస్థితులు తీసుకురాబోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రస్తుతం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న లాక్ డౌన్ ను మరింత సడలించబోతున్నారు. ఈనెల 19వరకు ఈ నిబంధన అమల్లలో ఉండగా.. 20వ తేదీ నుంచి ఈ సమయాన్ని మరింత కుదించబోతున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను అమల్లో ఉంచాలని అనుకుంటున్నారట.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకంటే, కేవలం నైట్ లైఫ్ కు మాత్రమే ఇబ్బందన్నమాట. బార్లు, పబ్బులు, థియేటర్లు లాంటి వాటికే ఆంక్షలుంటాయన్నమాట. ఈ లాక్ డౌన్ ను కూడా మరో వారం, 10 రోజుల పాటు నామమాత్రంగా కొనసాగించి, వచ్చేనెల 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలకు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కాబట్టి ఆరోజు నుంచి ఆంక్షల్లో సడలింపులు భారీగా ఉండబోతున్నాయి. మరోవైపు జిమ్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ పై ఒకేసారి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇక అత్యంత కీలకమైన ఈ-పాస్ విధానానికి కూడా స్వస్తి చెప్పాలని సర్కారు భావిస్తోంది. లోపభూయిష్టంగా ఉన్న ఈ విధానంపై ప్రస్తుతం చాలా విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రతి రోజూ సరిహద్దుల్లో పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. మరికొన్ని రోజుల్లో ఈ-పాస్ విధానాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.