అజ్ఞాతవాసిగా మారిన యువ ఎంపీ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీలో ఒక్కొకరు ఒక్కో రకంగా సెట్ అయిపోతున్నారు. చంద్రబాబు 29 గ్రామాల నాయకుడిగా మారిపోయారు. రాజధాని ప్రాంతంలో స్థలాలు కొన్న నేతలంతా నానా రచ్చ చేస్తున్నారు. రాయలసీమ నేతలు,…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీలో ఒక్కొకరు ఒక్కో రకంగా సెట్ అయిపోతున్నారు. చంద్రబాబు 29 గ్రామాల నాయకుడిగా మారిపోయారు. రాజధాని ప్రాంతంలో స్థలాలు కొన్న నేతలంతా నానా రచ్చ చేస్తున్నారు. రాయలసీమ నేతలు, హైకోర్టుని ఒప్పుకోలేక, కాదనలేక తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఉత్తరాంధ్ర నేతలు కూడా దాదాపుగా ఇదే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరాంధ్ర పులి, సింహం, ఆశా కిరణం అని సెల్ఫ్ టైటిల్స్ ఇచ్చుకునే ఒక యువ ఎంపీ దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అసలు అడ్రస్ లేకుండా పోయారు కింజరపు రామ్మోహన్ నాయుడు.

పార్లమెంట్ సమావేశాల సమయంలో కెమెరా పైకి ఎగబడిన రామ్మోహన్ నాయుడు, జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత పత్తా లేకుండా పోయారు. విశాఖకు రాజధాని హోదా రావడం ఆయనకు సంతోషకరమైన విషయమే అయినా దానికి మద్దతివ్వలేని పరిస్థితి. జగన్ నిర్ణయానికి మద్దతిస్తే చంద్రబాబు తరిమికొడతారు. పోనీ రాజధానిగా అమరావతే ఉండాలని చెప్పాడా.. ఉత్తరాంధ్ర జనం చీదరిస్తారు.

వెనుకబడిన ప్రాంతానికి చెందిన పొలిటీషియన్ గా రాజధాని నిర్ణయాన్ని స్వాగతించకపోగా, వ్యతిరేకిస్తే తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నట్టు అవుతుంది. అందుకే ఎటూ మాట్లాడలేక ఇరకాటంలో పడ్డారు రామ్మోహన్ నాయుడు. ఏదో ఒక కార్యక్రమంతో వార్తల్లో ఉంటూ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ యువ ఎంపీ.. కొన్ని రోజులుగా కనపడ్డం మానేసేసరికి జనంలో కూడా ఇదో పెద్ద చర్చ అయింది.

ఇక రేపో మాపో.. చంద్రబాబు అమరావతికి మద్దతుగా జోలె పట్టుకుని ఉత్తరాంధ్రకూ వెళ్లడం ఖాయం. పార్టీకి ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు, చంద్రబాబుతో కలసి నడుస్తారా లేక అప్పుడు కూడా డుమ్మా కొడతారో తేలిపోతుంది. ఇప్పటివరకూ కలుగులో ఎలుకలా ఉన్న రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబు వస్తే బైటకు రాక తప్పదు. అప్పుడు తేలుతుంది అబ్బాయి ఆగట్టునుంటాడో.. ఈ గట్టుకొస్తాడో..