తెలుగుదేశం పార్టీ భావి ఆశాకిరణం నారా లోకేష్ భాష నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇప్పటికే హద్దు మీరి మాట్లాడిన లోకేష్.. ఈ విషయంలో మరింత తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే జగన్ ను ఉద్దేశించి.. వాడూ, వీడు.. వంటి మాటలు లోకేష్ మీడియా ముఖంగానే మాట్లాడారు.
ఇక పీకడం.. అనే మాటను తన జాతిమాట అనేంత స్థాయిలో లోకేష్ ఉపయోగించారు. ఈ విషయంలో తండ్రీకొడుకులు పోటీ పడ్డారు. పదే పదే ఏమైనా పీకారా.. పీకుతారా.. అంటూ లోకేష్, చంద్రబాబులు ఉచ్ఛనీఛాలు మరిచి మాట్లాడారు.
అయితే వీరి ఫ్రస్ట్రేషన్ ఇంతటితో కూడా తీరడం లేదు. తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో వీక్ అయ్యే కొద్దీ వీరి భాష తేడాగా మారుతోంది. ఈ క్రమంలో నారా లోకేష్ స్పందిస్తూ.. జగన్ దున్న అని అన్నారు. ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా జగనన్న పథకం అంటూ పేర్లు పెడుతున్నారని, అయితే వాటిని జగన్ దున్న పథకాలు అనాలన్నట్టుగా లోకేష్ వ్యాఖ్యానించాడు.
జగనన్న కాదు జగన్ దున్న అనాలని లోకేష్ అన్నాడు. దున్నపోతు పొడుస్తుందని, వెంటపడి తరుముతుందని, కుమ్ముతుందని.. అంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు. ఈ మాటల్లో ఉన్న విజ్ఞత గురించి వేరే చెప్పనక్కర్లేదు.
ఇటీవలే ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన పదాలతో టీడీపీ తనేదో విజయం సాధించినట్టుగా భావించి ఉండవచ్చు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి చెంప పగలగొట్టి ఉండేవాడిని.. అని ఒక కేంద్రమంత్రి అంటే మరో ఆలోచన లేకుండా ఆయనను అరెస్టు చేశారు. అయితే ఏపీలో టీడీపీ నేతలు ఏం మాట్లాడినా.. అరెస్టు భయాలు లేవు. ఒకవేళ కేసులు, అరెస్టులు జరిగినా.. నిమిషాల వ్యవధిలో వారు బయటకు రాగలుగుతున్నారు. ఆ ధీమానే ఇలాంటి మాటలకు కారణం కావొచ్చు.
ఇక టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ ఈ స్థాయిలో ఇలా సాగుతూ ఉంది. మరి ఇంకా ఎన్నికలకు సమయం ఉండనే ఉంది. అంతలోపు.. వీరి నుంచి ఇంకా ఎలాంటి బూతులు ఆణిముత్యాల్లా జాలువారనున్నాయో!