ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సుమారు 15 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధితోపాటు మరో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరసల రహదారుల అభివృద్ధి, కనెక్టివిటీ, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులకు సంబంధించి 38 ప్రాజెక్ట్‌లను చేపట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టగా మిగిలిన 38 ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన పీడబ్ల్యూడీకి అప్పగించినట్లు చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు సంబంధించి అనేక చోట్ల పనులు కొనసాగుతున్నాయి. వీటిలో అత్యధికం ఈ ఏడాదిలో పూర్తి కావలసి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలన్నింటినీ ఒక పట్టిక ద్వారా ఆయన తన జవాబులో వివరించారు. వీటిలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కిమీ దారం నిర్మించే ఆరు వరసల బైపాస్ రహదారి ఒకటి. అలాగే గొల్లపూడి నుంచి చిన అవుటపల్లి వరకు 30 కి.మీ మేర నిర్మించే మరో ఆరు వరసల బైపాస్ రోడ్డు. భారత్‌మాల పరియోజన్ కింద చేపట్టే ఈ రెండు ప్రాజెక్ట్‌ల వలన కోల్కత్తా-చెన్నై, కోల్కత్తా-హైదరాబాద్ నగరాల మధ్య ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ భారం చాలా వరకు తగ్గుతుంది.
హైబ్రీడ్ యాన్యుటీ ప్రాతిపదికపైను చేపట్టే ఈ ఆరు వరసల బైపాస్ రహదారులు గుండుగొలను-విజయవాడ మధ్య నిర్మించే ఆరు లైన్ల రహదారికి అనుసంధానం చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. వీటితోపాటు గుండుగొలను, దేవరాపల్లి, కొవ్వూరు సెక్షన్ల మధ్య కొత్తగా ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే చిలకలూరుపేట బైపాస్ రోడ్డును ఆరు వరులస కింద విస్తరిస్తారు. గిద్దలూరు-వినుకొండ మధ్య 112 కి.మీ మేర రెండు వరసల రహదారిగా విస్తరించడం జరుగుతుంది. కలపర్రు నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా జంక్షన్‌ను బైపాస్ చేస్తూ చిన అవుటపల్లి వరకు ఆరు లేన్ల రహదారి నిర్మాణం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. చిలకలూరిపేట-నెల్లూరు సెక్షన్లో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాలుగు లేన్లను కొత్తగా అభివృద్ధి చేయాలని తలపెట్టినట్లు మంత్రి వివరించారు.