Advertisement

Advertisement


Home > Politics - National

క్రిస్టియానిటీ రాష్ట్రాల్లో.. హిందుత్వ పార్టీ పాతుకుపోయింది!

క్రిస్టియానిటీ రాష్ట్రాల్లో.. హిందుత్వ పార్టీ పాతుకుపోయింది!

2013 నాటికి మేఘాల‌యా, నాగాలండ్, త్రిపుర‌.. ఈ మూడు బుల్లి రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి స్థిరంగా ఉన్న ఓటు షేర్ కేవ‌లం రెండు శాతం! కేవ‌లం 2 ప‌ర్సెంట్ ఓట్ల‌ను మాత్ర‌మే బీజేపీకి అప్ప‌టికి పొందింది. అయితే 2014 నుంచి క‌థ మారుతూ వ‌చ్చింది. 

దేశంలో హిందుత్వ వాద ప‌తాకం ఎగ‌సిన నేప‌థ్యంలో బీజేపీ కేంద్రంలో బంప‌ర్ మెజారిటీతో అధికారాన్ని అందుకుంది. ఆ త‌ర్వాత బీజేపీ ప్రాప‌కం ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే ఉంది. పార్ల‌మెంట్ లో ప్ర‌స్తుతం క‌మ‌లం పార్టీ తిరుగులేని మెజారిటీతో ఉంది. దీనికి కార‌ణం హిందుత్వ గాలులు గ‌ట్టిగా ప్ర‌భావం చూపే ఉత్త‌రాదిన క‌మ‌లం పార్టీకి భారీగా సీట్లు ద‌క్కుతుండ‌ట‌మే అనే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా ఉన్నాయి. 80 ఎంపీ సీట్లున్న యూపీలో బీజేపీ చెక్కుచెద‌ర‌ని బ‌లంతో ఉంది. ఇంకా దేశంలోని పెద్ద రాష్ట్రాలు చాలా వ‌ర‌కూ బీజేపీ పాల‌న‌లోనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా ద‌శాబ్దాల నుంచి కొన‌సాగుతూనే ఉంది!

ఇవ‌న్నీ పెద్ద ఆశ్చ‌ర్యాలు కాదేమో కానీ, మ‌తం ప్ర‌మేయం పెద్ద‌గా లేని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా క‌మ‌లం పార్టీ  స‌త్తా చూపిస్తూ ఉండ‌ట‌మే రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా బాగా ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తుంటారు. భార‌త‌దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో నాగ‌రిక‌త ప్ర‌త్యేకం! ఆ ప్రాంత ప్ర‌జ‌లు, వారి ఆహారపు అల‌వాట్లు, మ‌తాచారాలు అన్నీ విభిన్నం. ఈ రాష్ట్రాల్లో క్రిస్టియ‌న్ల శాతం బాగా ఎక్కువ‌. మేఘాల‌య‌, నాగాలాండ్, త్రిపుర‌.. వంటి రాష్ట్రాల్లో 90 శాతం క్రిస్టియ‌న్లే అంటాయి గ‌ణాంకాలు. అయితే వారిని క్రిస్టియ‌న్లుగా క‌న్నా.. తెగ‌ల గానే ఎక్కువ‌గా చూస్తారంతా!

అక్క‌డ మ‌తం క‌న్నా తెగే ప్ర‌ధానం. గిరిజ‌న తెగ‌లు చాలా ప్ర‌భావంత‌మైన‌వి. ఏ తెగ దానికది ప్ర‌త్యేకం. వారికి మ‌తం పెద్ద ప్ర‌ధానం కాదు. తాము హిందువులు అనో, క్రిస్టియ‌న్లో అని గుర్తించుకోవ‌డం కంటే.. త‌మ తెగ గుర్తింపుతోనే వారు ఎక్కువ‌గా మ‌నుగ‌డ సాగిస్తూ ఉంటారు. మ‌రి ఇలాంటి తెగ‌ల మ‌ధ్య‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న పర‌ప‌తిని పెంచుకోవ‌డ‌మే అది పెద్ద పొలిటిక‌ల్ మిస్ట‌రీ!

యూపీలోనో, మ‌రే ఉత్త‌రాదిన‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనో.. ఇంకో చోటో బీజేపీ ఈజీగా మ‌త‌ప‌ర‌మైన ప‌రిణామాల‌ను రాజ‌కీయ అనుకూల‌త‌లుగా మార్చుకోవ‌డాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. అయితే త‌మ‌ది హిందూ మ‌తం అని చెప్పుకునే తెగ‌లేవీ లేక‌పోయినా.. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బండి  దూసుకుపోతోంది. 2013 నాటికి బీజేపీకి రెండు మూడు శాతం ఓట్లు కూడా లేని చోట 2018 నాటికి ఆ పార్టీ ప‌రిస్థితి చాలా వ‌ర‌కూ మెరుగ‌య్యింది. 2018 నాటి ఎన్నిక‌ల్లో నాగాలాండ్ లో బీజేపీకి 15 శాతం ఓట్లు వ‌చ్చాయి. త్రిపుర‌లో ఏకంగా 44 శాతం ఓట్లు వ‌చ్చాయి. మేఘాల‌య‌లో ప‌ది శాతం ఓట్లు ద‌క్కాయి. మోడీ పాల‌న నాలుగు ఏళ్లు పూర్త‌య్యాకా అలా బీజేపీ త‌న ఓట్ల శాతాన్ని రెండు నుంచి పెంచుకుంది!

ఇక 2023 ఎన్నిక‌ల నాటికి మేఘాల‌య‌లో మ‌ళ్లీ అదే ప‌దిశాతం ఓట్ల‌ను బీజేపీ నిలుపుకుంది. నాగాలాండ్ లో నాలుగు శాతం ఓట్ల‌ను పెంచుకుని 19 శాతం స్థాయికి పెరిగింది. ఇక త్రిపుర‌లో అయితే మ‌రో ఐదు శాతం ఓట్ల‌ను బీజేపీ పెంచుకుంది! ఇలా భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేప‌ట్టి దాదాపు ప‌దేళ్లు కావొస్తున్న త‌రుణంలో ప‌దేళ్ల కింద‌ట త‌మ‌కే మాత్రం ప‌ట్టు లేక రెండు మూడు శాతం ఓట్ల‌కు ప‌రిమితం అయిన చోట త‌నే అధికారాన్ని చేప‌డుతోంది. కొన్ని చోట్ల సోలోగా, కొన్ని చోట్ల కూట‌ముల‌తో!

ఇందుకు కార‌ణం ఏమిటంటే.. అభివృద్ధికి , సంక్షేమానికి బోలెడంత దూరంలో నిలిచిన ఈ రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు ఉచిత రేష‌న్ తో స‌హా ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు. అలాగే అభివృద్ధి నినాదాలు ఇస్తున్నారు. ఇక అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా బెదిరించో, బ‌తిమాలో ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను కూడా క‌లుకుపోతోంది. ఈ వ్యూహాల‌తో క‌మ‌లం పార్టీ తెగ‌లే త‌ప్ప మ‌తం లేని చోట కూడా పాగా వేస్తోంది!

-హిమ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?