Advertisement

Advertisement


Home > Politics - National

రాముడు పోయి.. కృష్ణుడొచ్చె.. టాంటాంటాం!

రాముడు పోయి.. కృష్ణుడొచ్చె.. టాంటాంటాం!

రాముడి కథ అయిపోయింది. రాముడిని వాడినంత కాలం బాగానే వాడాము. ఇక ఒకే ఒకసారి 2024 ఎన్నికల ముంగిటకు వచ్చినప్పుడు.. అయోధ్యలో పూర్తిచేసిన రామాలయాన్ని ట్రంప్ కార్డులా ప్రయోగించి.. బ్రహ్మాస్త్రంలాగా వాడుకోవాల్సిందే. మధ్యమధ్యలో ఆ మాట ఎత్తడం కుదరదు. 

మరి ఇప్పటికిప్పుడు గుజరాత్ ఎన్నికల సమరాంగణంలో విజయం కావాలంటే.. రాముడు లేకుంటే ఎలా? అందుకే కృష్ణుడిని తెరపైకి తీసుకువచ్చింది భారతీయ జనతా పార్టీ. కృష్ణుడినిక్కడ తురుపుముక్కలా వాడుతోంది. ద్వారక కారిడార్ ఏర్పాటుచేస్తూ.. పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం చేస్తామని సెలవిస్తోంది. అందులో భాగంగా ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా నిర్మిస్తామని చెబుతోంది. 

తొలినుంచి హిందుత్వ పునాదుల మీదనే మనుగడ సాగిస్తున్న బిజెపి.. ద్వారక గుజరాత్ లోనే ఉన్నప్పటికీ.. 27 ఏళ్లుగా వాళ్లే అక్కడ పాలన సాగిస్తున్నప్పటికీ.. ఇంతకాలం దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు. హఠాత్తుగా ఈ కృష్ణ భక్తి ఎలా వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలే. 

మొత్తానికి ఇన్నాళ్ల పాటుకొన్ని దశాబ్దాలుగా అయోధ్యలో రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ బతికిన బిజెపి ఇప్పుడు, ద్వారకలో కృష్ణుడు పేరు చెప్పుకుంటోంది. అయితే ఇదంతా కూడా గుజరాత్ లో 25 లక్షల జనాభా ఉన్న యాదవ ఓటు బ్యాంకును ఆకర్షించడానికేనా అనేమాట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గుజ్జర్లు, జాట్లు, ఆహిర్లు అందరూ కూడా యాదవుల కిందికే వస్తారు. వీళ్లందరూ కృష్ణుడి కాలంలో యాదవులుగా పరిగణింపబడే వారని అంటారు. కాకపోతే వారందరికీ యాదవ అనే పేరులో తగిలించుకోవడం ఉండదు. అయితే కృష్ణభక్తులై ఉండడం చాలా సాధారణం. 

ఈ నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసం దేవుడిని వాడుకునే అలవాటు ఉన్న బిజెపి ఇప్పుడు కృష్ణుడిని రంగంలోకి తెచ్చింది. ఈ వాతావరణం గమనిస్తే.. గుజరాత్ ఎన్నికల బరి బిజెపికి అనుకున్నంత సులువుగా లేదా? అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కష్టకాలంలో ప్రయోగించే తురుపుముక్క అస్త్రాలే. 

గుజరాత్ లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కొత్త శత్రువు కూడా తయారయ్యారు. కాంగ్రెస్ కు వేసే ఓటు వేస్టయిపోతుందని, ఆప్ కు ఓటు వేస్తే మాత్రమే.. రాష్ట్రంలో అధికార మార్పిడి సాధ్యమవుతుందని.. ప్రజలకు తెలియజెప్పడంలో కేజ్రీవాల్ కొంత మేర సక్సెస్ అవుతున్నారు. ఇద్దరు బలమైన శత్రువులతో పోరాడడం అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఎడ్వాంటేజీనే కానీ.. ఈసారి ఆప్ దెబ్బకు బిజెపి కొంచెం అతిజాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?