Advertisement

Advertisement


Home > Politics - National

బ్రిట‌న్ ను దాటేశామా.. అస‌లు విష‌యం అది క‌దా!

బ్రిట‌న్ ను దాటేశామా.. అస‌లు విష‌యం అది క‌దా!

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జాబితాలో భారత్ త‌న స్థానాన్ని మ‌రింత మెరుగుప‌రుచుకుంద‌ని బ్లూమ్ బ‌ర్గ్ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జాబితాలో తొలి స్థానంలో యూఎస్ఏ, రెండో స్థానంలో పీపుల్స్ రిప‌బ్లిక్ చైనా, మూడో స్థానంలో జ‌పాన్, ఆ త‌ర్వాత జ‌ర్మ‌నీలున్నాయి. 

చాన్నాళ్లుగా ఇండియా ఐదో స్థానానికి ఎగ‌బాకుతుంద‌ని చెబుతూ వ‌చ్చారు. కరోనా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇంగ్లండ్ మంద‌గ‌మనంలోకి పోవ‌డంతో ఇండియా స్థానం మెరుగై ఐదో స్థానాన్ని అందుకుంద‌ని బ్లూమ్ బ‌ర్గ్ చెబుతోంది. ఇలా ఇండియా ప్ర‌పంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిలుస్తోంద‌ని అంటున్నారు.

మరి ఇంగ్లండ్ క‌న్నా అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అయిపోయాం కాబ‌ట్టి.. ఇంగ్లండ్ క‌న్నా ఇండియా అభివృద్ధి సాధించేసిన‌ట్టే, ఇంగ్లండ్ లో పౌరుల క‌న్నా భార‌తీయులు సౌఖ్యంగా బ‌తుకుతున్నారు అనుకోవ‌డం మాత్రం ఇక్క‌డ అతి పెద్ద పొర‌పాటు!

ఇదే బ్లూమ్ బ‌ర్గ్ చెప్పే విష‌యం ఏమిటంటే.. యూకే ప‌రిధిలో పౌరులు 1980ల‌లో పొందిన జీవ‌న‌ప్ర‌మాణాల‌ను భార‌తీయులు అందుకోవాలాన్నా.. ఇంకో ప‌దేళ్లు ప‌డుతుంది! ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం. ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిమాణం సంగ‌తి పక్క‌న పెడితే... ఏ దేశం అభివృద్ధికి అయినా సూచిక అక్క‌డ మౌళిక వ‌స‌తులు, మ‌నుషుల జీవ‌న ప్ర‌మాణాలు! ఇవి మాత్ర‌మే నిజం. మిగ‌తావ‌న్నీ వేరే. ఈ విష‌యంలో మాత్రం భార‌త‌దేశం ఇప్ప‌టికీ చాలా చాలా వెనుక‌బ‌డి ఉంది!

బ్రిట‌న్ పౌరులు 1980ల‌లో బ‌తికినంత ప్ర‌మాణాల స్థాయికి భార‌తీయుల‌ను తీసుకెళ్ల‌డానికి ఇక్క‌డి ప్ర‌భుత్వాల‌కు ఇంకో ప‌దేళ్లు ప‌డుతుంద‌ని అంచ‌నా! ప‌దేళ్లు అంటే.. క‌నీసం 2030 నాటికి అనుకుందాం. మ‌రి ఏ బ్రిట‌న్ ను అయితే దాటేశామ‌ని సంబ‌ర‌ప‌డుతున్నామో.. అక్క‌డి 1980 నాటి జీవ‌న ప్ర‌మాణాల రేటును అందుకోవ‌డానికి మ‌న‌కు 2030 వ‌ర‌కూ వేచి చూడాల్సి వ‌స్తే, అదే బ్రిట‌న్ 2030 నాటి జీవ‌న ప్ర‌మాణాల రేటును అందుకోవ‌డానికి ఆ త‌ర్వాత ఇండియాకు ఇంకెంత కాలం ప‌డుతుంది? 

ఆర్థిక వ్య‌వ‌స్థ పెద్ద‌దైతే కాదు.. త‌ల‌సారి అదాయం పెర‌గాలి, ఉపాధి ప్ర‌మాణాలు మెరుగ‌వ్వాలి, మౌళిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న జ‌రగాలి! ఇవి ఉంటే ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్న‌దైనా పెద్ద‌దైనా ఒక్క‌టే! ఇండియా క‌న్నా చాలా చిన్న చిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లైన దేశాల్లో కూడా జీవ‌న ప్ర‌మాణాలు మ‌న‌క‌న్నా వంద‌ల రెట్లు మెరుగ్గా ఉంటాయ‌నే విష‌యాన్ని మ‌రిచిపోయి, ఐదో స్థానం అంటూ గ‌ప్ఫాలు కొట్టుకోవ‌డం మాత్రం వ్య‌ర్థం కాదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?