Advertisement

Advertisement


Home > Politics - National

సస్పెన్సన్లు అన్నీ ఉత్తుత్తి డ్రామాలేనా?

సస్పెన్సన్లు అన్నీ ఉత్తుత్తి డ్రామాలేనా?

గుజరాత్ ఎన్నికల సమరాంగణంలో భారతీయ జనతా పార్టీకి ఈసారి విజయం నల్లేరుపై బండినడకలాగా సులువుగా సాగిపోయేలా లేదు. 27ఏళ్ల సుదీర్ఘ అధికార ప్రస్థానానికి తెరదించేయాలని కాంగ్రెస్, ఆప్ కష్టపడుతున్నాయి. అయితే మళ్లీ నెగ్గుతాం అనే నమ్మకంతో ఉన్న బిజెపికి మాత్రం తిరుగుబాటు అభ్యర్థుల సమస్య వెన్నాడుతోంది. టికెట్ ఆశించి భంగపడి, ఇండిపెండెంట్ గా బరిలో మిగిలిన అభ్యర్థులు చాలామందే ఉన్నారు. వీరిలో 12 మందిని తాజాగా బిజెపి పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఇలా తిరుగుబాటు అభ్యర్థులను సస్పెండ్ చేయడం అనేది డ్రామానా? లేదా, నిజంగానే సీరియస్ నిర్ణయంగా సస్పెండ్ చేశారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో నడుస్తోంది. 

ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో మిగిలిన వారిలో కాస్త గట్టివాళ్లు, ఆరుసార్లు ఏకబిగిన గెలిచిన వాళ్లూ కూడా ఉన్నారు. అంతటి ఘనత ఉన్న మధు శ్రీవాస్తవ్ అనే అభ్యర్థి.. తన మనుషులజోలికి ఎవరైనా వస్తే.. కాల్చి చంపుతానని హెచ్చరిక కూడా చేశారు. అమిత్ షా, మోడీ ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చానని చెప్పుకున్న ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. ఆయనకు హిందూత్వ అతివాది కింద పేరుంది. ముస్లింలమీద జరిగిన దాడులకు సంబంధించి కేసులు ఆయనపై ఉన్నాయి. 

ఇప్పుడు టికెట్ నిరాకరించడానికి అవి కారణం కాకపోవచ్చు గానీ.. మొత్తానికి ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా మిగిలారు. 

ఇలా రకరకాల కారణాలతో 12 మంది తిరుగుబాట్ల మీద సస్పెన్షన్ వేటు పడింది. అయితే అన్ని పార్టీల్లాగానే ఎన్నికల సమయంలో.. తిరుగుబాట్లను సస్పెండ్ చేయడం అనేది ఒక డ్రామాలాగా బిజెపి నడిపిస్తున్నదా , లేక సీరియస్ నిర్ణయమేనా? అనేది ఇక్కడ కీలకాంశం. ఎందుకంటే.. అన్ని పార్టీలు ఇలాంటి సస్పెన్షన్ డ్రామాలను ఎన్నికల తర్వాత ముగిస్తుంటాయి. తిరుగుబాటు అభ్యర్థి ఎన్నికల్లో సొంతంగా గెలిస్తే గనుక.. ఎన్నిక పూర్తయిన వెంటనే తిరిగి తమ పార్టీలో నిస్సిగ్గుగా చేర్చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ నేతలే రకరకాల సమీకరణాల వల్ల.. తమకు కావాల్సిన వారిని తిరుగుబాటుగానే బరిలోకి దించి, లోపాయికారీగా సహకరించి గెలిపించి తర్వాత పార్టీలో చేర్చుకోవడమూ కద్దు. 

బిజెపి వీరి విషయంలో కూడా అలాంటి డ్రామానే నడిపిస్తుందేమో అనే అనుమానం కొందరికి ఉంది. ఇప్పుడు 12 మందిని సస్పెండ్ చేయడం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న పార్టీ అయితే.. ఆ 12 మంది గెలిచినా సరే తిరిగి పార్టీలో చేర్చుకోవడం జరగదని ప్రకటించగలరా? అనే అనుమానమూ పలువురిలో వ్యక్తం అవుతోంది. 

ప్రీపోల్ సర్వేలు.. చాలా వరకు గుజరాత్ లో మళ్లీ బిజెపి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేస్తున్నాయి. అయితే.. ఆప్, కాంగ్రెస్ రెండూ కలిపి ఇస్తున్న పోటీని తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు. అధికారానికి ఒకటిరెండుసీట్ల దూరంలో ఆగిపోయి, ఆ తేడాను భర్తీ చేసేలా తిరుగుబాటు అభ్యర్థులే గెలిస్తే.. సస్పెండైన వారు గనుక.. వారి మద్దతు తీసుకోకుండా బిజెపి విలువలు పాటిస్తుందా? ఇలాంటి ప్రశ్న వచ్చినందుకే నవ్వుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడున్నది నైతికవిలువలకోసం అధికారాన్ని గడ్డిపోచలాగా వదులుకున్న వాజపేయి హయాంలోని బిజెపి కాదు! అదీ సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?