Advertisement

Advertisement


Home > Politics - National

మోడీ, షా సొంత రాష్ట్రంలో ఆస‌క్తి రేపుతున్న రాజ‌కీయం!

మోడీ, షా సొంత రాష్ట్రంలో ఆస‌క్తి రేపుతున్న రాజ‌కీయం!

దేశ‌మంతా దున్నేస్తున్నారు న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా. ఆ మూల నుంచి ఈ మూల వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండా పాతేస్తున్నారు. బీజేపీ ఉనికే లేని రాష్ట్రాల్లో కూడా సామ‌దాన‌బేద‌దండోపాయాల‌ను ఉప‌యోగించుకుని కాషాయ జెండా పాతుతున్నారు. దేశంలో కాంగ్రెస్ ఉనికినే లేకుండా చేయ‌డానికి వీరు కంక‌ణం క‌ట్టుకున్నారు. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అనే నినాదాన్ని అధికారం ద‌క్కిన నాటి నుంచి ఇస్తూనే ఉన్నారు. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. కాంగ్రెస్ పార్టీ ప‌డుతూ లేస్తూ సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి  ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న రాష్ట్రాల్లో ఒక‌టి గుజ‌రాత్! ఇది అటు ప్ర‌ధాని మోడీకి  బీజేపీకి ముఖ్య నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సొంత రాష్ట్రం ఇది.

అతి త్వ‌ర‌లో గుజ‌రాతీలు త‌మ రాష్ట్రంలో అధికారం ఎవ‌రిక‌నే అంశం గురించి తీర్పును ఇవ్వ‌బోతున్నారు. ఈ రాష్ట్రంలో ద‌శాబ్దాల నుంచి వ‌ర‌స‌గా బీజేపీనే అధికారాన్ని ద‌క్కించుకుంటూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదా నుంచినే డైరెక్టుగా మోడీ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి ప్ర‌మోష‌న్ పొందారు. ఇక్క‌డ నుంచినే అమిత్ షా జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. దేశ రాజ‌కీయాన్ని ఇప్పుడు ఒంటి చేత్తో ఆడిస్తున్నార‌నే పేరును గ‌డించారు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా.. ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి గుజ‌రాత్ ప్ర‌తిష్టాత్మ‌కంగానే ఉంది.

ఒంటి చేత్తో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకునే ప‌రిస్థితి కానీ, ఏక‌ప‌క్ష విజ‌యాన్ని న‌మోదు చేసే ప‌రిస్థితి కానీ గుజ‌రాత్ లో ఇప్పుడు బీజేపీకి లేదు! క‌నీసం యూపీ వంటి రాష్ట్రంలో విజ‌యం ప‌ట్ల ఉన్నంత ధీమా.. గుజ‌రాత్ విష‌యంలో క‌మ‌లం పార్టీకి లేన‌ట్టుగా ఉంది! అన్నింటికీ మించి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఐదేళ్ల కింద‌ట బీజేపీకి 99 సీట్లు వ‌స్తే కాంగ్రెస్ కు 77 సీట్లు ద‌క్కాయి.

అప్పుడు బీజేపీకి 16 సీట్ల మేర బ‌లం త‌గ్గింది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ 16 సీట్ల‌ను అద‌నంగా పొందింది. కేంద్రంలో అప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ యే అధికారంలో ఉంది. మోడీ- అమిత్ షాల ద్వ‌యం అప్పుడు కూడా రాజ‌కీయాన్ని శాసిస్తూ ఉంది. అయితే అప్పుడు వారి సొంత రాష్ట్రంలో బీజేపీ అంత‌కు ముందు తో పోలిస్తే కొన్ని సీట్ల‌ను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ గుజ‌రాత్ లో అప్పుడు త‌న శ‌క్తిని పెంచుకుంది!

అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌లేదు. గ‌త ఐదేళ్ల‌లో ఎడాపెడా కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. అనేక మంది ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంది. వ‌చ్చిన వారంద‌రికీ వెల్క‌మ్ చెప్పింది. గ‌తంలో త‌ను నిందించిన వారిని కూడా మొహ‌మాట‌ప‌డ‌కుండా బీజేపీ ఈ సారి చేర్చుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేయిస్తోంది. ఇక టికెట్ల కేటాయింపులో కూడా అన్ని అంశాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. విజ‌య‌మే ల‌క్ష్యంగా టికెట్ల కేటాయింపు చేసింది.

అయినా ఈ సారి మాత్రం ఫ‌లితం అత్యంత ఆస‌క్తిదాయ‌క‌మే! కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అయితే పెద్ద‌గా కోలుకున్న దాఖలాలు లేవు! ఆ పార్టీకి నూత‌నోత్తేజం ఏమీ రాలేదు. రాహుల్ గాంధీ అయితే సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్నారు. దీంట్లో ప‌డి ఆయ‌న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం వైపు కూడా చేస్తారో లేదో తెలియ‌దు! సోనియా గాంధీ యాక్టివ్ గా లేన‌ట్టే. కొత్త జాతీయాధ్య‌క్షుడు ఖ‌ర్గే తో కొత్త‌గా వ‌చ్చే ఉత్సాహమూ లేదు! ఇక గుజ‌రాత్ నుంచి బీజేపీ వైఖ‌రిని గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌ళ‌మేదీ వినిపించ‌నూ లేదు! గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున యాక్టివ్ గా ప‌నిచేసిన వారంద‌రినీ బీజేపీ చేర్చేసుకుంది! ఇలా చూస్తే.. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ సారి గుజ‌రాత్ లో స్వీప్ చేయాలి. కానీ.. అదంత తేలిక కాదు! అన్నీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టే జ‌రిగిపోవు!

ప్ర‌జ‌లే ప్ర‌జాస్వామ్యంలో అంతిమ తీర్పును ఇవ్వ‌గ‌ల‌రు. గుజ‌రాత్ లో ప్ర‌జాస్పంద‌న ఎలా ఉంటుంద‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతున్న అంశం. వ‌ర‌స‌గా బీజేపీ పాల‌న‌ను చూసి గుజ‌రాతీల‌కు మొహం మొత్తిందా లేక మ‌రోసారి కూడా ఆ పాల‌న‌నే కోరుకుంటున్నారా అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఐదేళ్ల కింద‌టే బీజేపీకి 16 సీట్ల‌ను త‌గ్గించి, ఆ మేర‌కు కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్య‌ను పెంచారు ప్ర‌జ‌లు. మ‌రి ఈ సారి కూడా మ‌రోసారి అలాంటి నిర్ణ‌య‌మే తీసుకుంటే ఆస‌క్తిదాయ‌క‌మైన రాజ‌కీయ ప‌రిణామ‌మే అవుతుంద‌ది. 115 నుంచి 99కు ప‌డిపోయింది బీజేపీ క్రితం సారి. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 77కు పెరిగింది. మ‌రి ఇప్పుడు అలాంటిదే మ‌రోసారి జ‌రిగితే బీజేపీ బ‌లం 83కు ప‌డిపోవ‌చ్చు! కాంగ్రెస్ బ‌లం 93కు పెర‌గొచ్చు! ఏం జ‌రుగుతుంద‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి ఆస‌క్తిదాయ‌క‌మైన మిస్ట‌రీ!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?