Advertisement

Advertisement


Home > Politics - National

ఇండియా అడ్ర‌స్ లేని ప్ర‌పంచ క్రీడా సంగ్రామం!

ఇండియా అడ్ర‌స్ లేని ప్ర‌పంచ క్రీడా సంగ్రామం!

ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది వీక్షించే క్రీడ ఫుట్ బాల్! మ‌రి ప్ర‌పంచంలో ఎక్కువ మంది వీక్షించే క్రీడ‌లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం లేక‌పోవ‌డాన్ని ఎలా చూడాలి?  ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ విష‌యంలో టీమిండియా పేరు ఎప్పుడూ వినిపించ‌దు! ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ లో సాధార‌ణంగా 32 జ‌ట్లు పాల్గొంటాయి. ఈ సారి కూడా ఫీఫా అదే స్థాయి జ‌ట్ల‌తో ప్ర‌పంచ‌క‌ప్ ను నిర్వ‌హిస్తోంది. మ‌రి ప్ర‌పంచంలోని 32 జ‌ట్ల తో ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించ‌డం అంటే మంచి స్థాయిలో ద‌క్కుతున్న ప్రాతినిధ్య‌మే అది!

స్పోర్ట్స్ ప‌రంగా ప్ర‌పంచంలో చెప్పుకోద‌గిన యాక్టివ్ గా ఉన్న దేశాల సంఖ్య ఇంత క‌న్నా ఎక్కువేమీ ఉండ‌దు. 32 జ‌ట్ల‌కు అవ‌కాశం ల‌భిస్తున్నా.. భార‌త్ మాత్రం ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ లో స్థానానికి ఎన్నో ఆమ‌డ‌ల దూరంలోనే ఉంది. ఇప్పుడే కాదు.. స‌మీపకాలంలో కూడా ఇండియా జ‌ట్టుకు ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌నే ఆశ‌లు కూడా ఎవ‌రికీ లేదు!

మ‌రి ఈ విష‌యంలో ఎక్క‌డుంది లోపం.. అంటే, ఫుట్ బాల్ ప‌ట్ల భార‌తీయుల‌కు ఆస‌క్తి లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం అనుకోవాలి. వాస్త‌వానికి సాక‌ర్ ఎంతో మ‌జా అయిన గేమ్. అందుకే ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ‌మంది వీక్షించే గేమ్ అయ్యింది. అయితే ఆ మ‌జా భార‌తీయులు అర్థం చేసుకోలేదు ఇప్ప‌టి వ‌ర‌కూ! కేవ‌లం ఇండియా అనే కాదు.. భార‌త ఉప‌ఖండ దేశాల్లో కూడా ఫుట్ బాల్ అంత కిక్ ఇవ్వ‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కూ! అలాగ‌ని ఇక్క‌డ ఫుట్ బాల్ కు పూర్తి స్థాయిలో ఆద‌ర‌ణ లేద‌ని కాదు. ఇండియాలోనే ప‌లు రాష్ట్రాల్లో ఫుట్ బాల్ అంటే ఎన‌లేని ఉత్సాహం.

ప‌శ్చిమ‌బెంగాల్, కేర‌ళ‌, గోవా రాష్ట్రాల్లో ఫుట్ బాల్ కు మంచి క్రేజ్ ఉంటుంది. బెంగాల్ లో అత్యంత పురాత‌న ఫుట్ బాల్ క్ల‌బ్ లున్నాయి. మ‌రి నిజంగా దేశానికి ఒక మంచి ఫుట్ బాల్ జ‌ట్టు ఇవ్వాలంటే.. పై మూడు రాష్ట్రాలే చాలు! ఎందుకంటే.. ఈ మూడు రాష్ట్రాల‌తో పోల్చినా.. మూడో వంతు జ‌నాభా లేని దేశాల నుంచి కూడా జ‌ట్లు వ‌స్తున్నాయి. అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తా చూపిస్తూ ఉన్నాయి.

ఫుట్ బాల్ కేవ‌లం 90 నిమిషాల పాటు జ‌రిగే ఆట‌. ఎక్స్ ట్రా టైమ్ లు అన్నీ క‌లిపితే. .మ‌రో 15  నిమిషాలు. స్థూలంగా రెండు గంట‌ల్లోపు మ్యాచ్ ముగుస్తుంది. చాలా వ‌ర‌కూ మ్యాచ్ లు ఫ‌లితం వ‌స్తాయి. ఈ రెండు గంట‌ల స‌మ‌యాన్ని ఆస్వాధించే అభిమానుల ఉత్సాహానికి హ‌ద్దే లేదు. గోల్.. గోల్.. అంటూ గంతులేస్తూ. యూరోపియ‌న్లు, ద‌క్షిణ అమెరిక‌న్లు, ఆఫ్రిక‌న్లు..  ఫుట్ బాల్ గేమ్స్ ను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యూరోపియ‌న్ ఫుట్ బాల్ క్ల‌బ్ లు ప్ర‌పంచంలోనే అత్యంత రిచ్ లీగ్ లుగా ఉన్నాయి. యూరోపియ‌న్ ఫుట్ బాల్ క్ల‌బ్ ల‌లో వాటాల‌ను కొనుగోలు చేసే స్థితిలో ఉన్నారు భార‌తీయ శ్రీమంతులు, అయితే ఇండియా మాత్రం ఒక అంత‌ర్జాతీయ స్థాయి ఫుట్ బాల్ జ‌ట్టును ప్రొడ్యూస్ చేయ‌లేక‌పోతోంది!

గ్రౌండ్ లెవ‌ల్ నుంచినే ఫుట్ బాల్ కు ఆద‌ర‌ణ లేదు. ఆ పై క్రికెట్ మాయ అంతా ఇంతా కాదు. క్రికెట్ తో పోల్చినా ఫుట్ బాల్ ఆడ‌టానికి కావాల్సిన సౌక‌ర్యాలు అదే స్థాయిలో ఉంటాయి. అయినా.. క్రికెట్ మాయ‌లో కూరుకుపోయిన భార‌తీయులు మరో క్రీడ వైపు చూడ‌టానికి పెద్ద ఆస‌క్తి చూప‌రు. జాతీయ క్రీడ హాకీని కూడా మూల‌కు ప‌డేశారు. ఇత‌ర అథ్లెటిక్స్ లో మ‌న‌కున్న ప్రాతినిథ్యం అత్యంత ప‌రిమితం. వాస్త‌వానికి భార‌తీయుల అథ్లెటిక్స్ ఫిట్ నెస్సే ప‌రిమిత స్థాయిలో అనుకోవాల్సి ఉంది. అందుకే ఒలింపిక్స్ లో కూడా భార‌తీయులకు వ‌చ్చే ప‌త‌కాల సంఖ్య అత్యంత ప‌రిమితం. జ‌నాభాలో కోటీ, రెండు కోట్ల స్థాయిలో ఉన్న దేశాలు సాధించే ప‌తాక‌ల స్థాయిలో కూడా ఇండియాకు మెడ‌ల్స్ ద‌క్క‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కూ!

పిల్ల‌ల‌ను చ‌దివించ‌డమే భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ప‌ర‌మావ‌ధి. అంత‌కు మించి జీవితంలో మ‌రో లక్ష్యం పెట్టుకోవ‌డాన్ని కూడా ఉత్సాహ ప‌ర‌చ‌ని వాతావ‌ర‌ణం మ‌న‌ది. చ‌దువుకుని పాస్ అయితే అదే ప‌ది వేలు అనుకోవ‌డ‌మే జీవిత‌మైంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క్రీడ‌ల‌కు ఉండే ప్రోత్సాహం గురించి వేరే అంచ‌నా వేయన‌క్క‌ర్లేదు. ఏదైనా క్రీడ‌లో మంచి ప్ర‌తిభావంతుడు అయిన‌ప్ప‌టికీ.. ప్రోత్సాహం ఉండ‌దు. ఆట‌ల పేరుతో క్లాసులు ఎగ్గొడుతున్నాడంటూ కాలేజీల్లో, స్కూళ్ల‌లో టీచ‌ర్లు మంద‌లిస్తారు. పేరెంట్స్ ను భ‌య‌పెడ‌తారు. ఇదంతా ప‌ర‌మ రొటీన్.  ఈ ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తేనే.. భ‌విష్య‌త్తులో అయినా క్రీడ‌ల్లో భార‌త్ కు ప్రాతినిధ్యం ల‌భిస్తుంది.

అయితే క్రీడ‌ల వైపు వెళ్లినా ఎక్కువ డ‌బ్బు వ‌చ్చే ఆట‌ల మీదే కాన్స‌న్ ట్రేట్ చేయాల‌నేది మ‌న‌కు మ‌నం పెట్టుకున్న మ‌రో నియం. అందుకు ఉదాహ‌ర‌ణగా ఇప్పుడు చాలా మంది త‌మ పిల్ల‌ల‌ను క్రికెట్ క్లాసుల‌కు పంపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. క్రికెట్ లో ఇప్పుడు కావాల్సినంత డ‌బ్బుంది.

ఇప్పుడు ఒక్కో రంజీ క్రికెట‌ర్ ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ లతోనే సుమారు 35 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ సంపాదించుకోగ‌లడు ఒక ఏడాదిలో. వాటిల్లో రాణిస్తే ఐపీఎల్ అవ‌కాశాలు ద‌క్కుతాయి. ఐపీఎల్ లో ఇప్పుడు క‌నీస వేత‌నం 30 ల‌క్ష‌ల‌కు పైనే! ఒక‌టీ రెండు ఇన్నింగ్స్ ల‌తో గుర్తింపు ద‌క్కినా.. వ‌చ్చే పారితోషికాలు కోట్ల రూపాయ‌ల్లోనే! జాతీయ జ‌ట్టు వ‌ర‌కూ వెళితే ఇక తిరుగే లేదు. అవ‌కాశాలు పెరిగాయి. ఐపీఎల్ తో ప్ర‌తి యేటా వంద‌ల మంది భార‌తీయ క్రికెట‌ర్ల‌కు భారీ స్థాయి డ‌బ్బులొచ్చే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇంకా సిటీ లెవల్ లీగులు వ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. క్రికెట్ లో భ‌విష్య‌త్తులో కూడా డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయ‌నే లెక్క‌ల‌తో కొంద‌రు త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ఇలాంటి ట్రైనింగ్ ల‌కు పంపిస్తూ ఉన్నారు.

అదే ఫుట్ బాల్ అంటే, హాకీ అంటే.. వారు కూడా పంప‌రు! ఎందుకంటే ఈ క్రీడ‌ల‌కు దేశంలో ఆద‌ర‌ణ లేదు. వాటిల్లో రాణించినా గుర్తింపు అంతంత‌మాత్ర‌మే. ఇలా ఎవ‌రి లెక్క‌లు వారివి. ఇలా ఎవ‌రి లెక్క‌లు వారివైన‌ప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు గురించి మాట్లాడుకోవ‌డం, ఆశించ‌డం కూడా స‌బ‌బేమీ కాదు. భ‌విష్య‌త్తులో ఎప్పుడో ఇండియాకు ఇలాంటి అవ‌కాశాలు ల‌భించే వ‌ర‌కూ సిస‌లైన స్పోర్ట్స్ మ‌జాను లైవ్ టెలికాస్ట్ ల‌లో వీక్షించ‌డ‌మే మార్గం!

-హిమ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?