వాట్సాప్ తుపాను.. హడలిపోతున్న నెల్లూరు జనం

నెల్లూరు జిల్లాలో ఓ వాట్సప్ మెసేజ్ హడలుగొట్టేస్తోంది. జిల్లానే కాదు, ఆ జిల్లాతో సంబంధం ఉండే ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు కూడా ఆ మెసేజ్ చూసి హడలిపోతున్నారు. జిల్లాలో ఉన్న బంధువులకి, స్నేహితులకి ఫోన్…

నెల్లూరు జిల్లాలో ఓ వాట్సప్ మెసేజ్ హడలుగొట్టేస్తోంది. జిల్లానే కాదు, ఆ జిల్లాతో సంబంధం ఉండే ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు కూడా ఆ మెసేజ్ చూసి హడలిపోతున్నారు. జిల్లాలో ఉన్న బంధువులకి, స్నేహితులకి ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత ఓ భారీ తుఫాన్ నెల్లూరు తీరాన్ని తాకబోతోందనేది ఆ వాట్సప్ మెసేజ్ సారాంశం. 

ఇప్పటికే తుఫాన్ ప్రభావం పెరిగిపోయి భారీ వర్షాలు పడుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారని, తుఫాన్ దూసుకొస్తోందంటూ.. వాట్సప్ మెసేజ్ ఫార్వార్డ్ అవుతోంది.

2008లో ఓసారి నెల్లూరు దగ్గర తుఫాన్ తీరం దాటిన మాట వాస్తవమే అయినా.. ప్రస్తుతం అలాంటి ముప్పేమీ జిల్లాకు లేదు. అది తుఫాన్ కూడా కాదు, దానికెవరూ ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. 

ఆ వాయుగుండం కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, దాని వల్ల ఉత్తర తమిళనాడుపై తీవ్ర ప్రభావం ఉంటుందని, దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. అయితే స్థానిక ప్రజలు మాత్రం ఈ ''వాట్సప్ తుఫాన్''తో హడలిపోతున్నారు. అధికారిక సమాచారం పక్కాగా లేకపోవడంతో అందరూ ఈ పుకారునే నమ్మి భయపడిపోయారు.

వాస్తవానికి బుధవారం సాయంత్రానికి వాయుగుండం బలపడటంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రానికి వాయుగుండం శ్రీహరికోట-కలైకర్ మధ్యలో.. కడలూరు సమీపంలో తీరం దాటుతుందని చెబుతున్నారు భారత వాతావరణ విభాగం అధికారులు. చెన్నై సహా తమిళనాడులోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్వయంగా అక్కడ సీఎం స్టాలిన్ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అయితే ఏపీలో ప్రమాద తీవ్రత అంతగా లేదని అంటున్నారు అధికారులు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయి ఉన్నప్పటికీ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అసలు తుఫాన్ కంటే.. వాట్సప్ తుఫాన్ నెల్లూరు వాసుల్ని బాగా భయపెట్టింది.