ఒకవైపు అధికారిక గణాంకాలేమో దేశంలో 75 లక్షల మంది వరకూ కరోనాకు గురి అయినట్టుగా చెబుతున్నాయి. వీరిలో 90 శాతం మంది వరకూ కోలుకున్నారు. ఏడు లక్షల స్థాయిలో కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. కొత్త కేసుల సంఖ్య కూడా రోజువారీగా తగ్గుతూ ఉంది. ఇవి కరోనా టెస్టులు, పాజిటివ్ గా తేలిన కేసుల లెక్కలు!
అయితే కరోనా అసింప్టమాటిక్ కేసుల మీద వివిధ అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోనే ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. వాటి ప్రకారం చాలా మందికి కరోనా వచ్చి వెళ్లినట్టుగా ఐసీఎంఆర్ తేల్చింది. ఆగస్టు 15 నాటికే దేశంలో 15 కోట్ల మందికి కరోనా సోకిందనేది ఐసీఎంఆర్ వేసిన ఒక అంచనా!
చాలా మంది శరీరాల్లో యాంటీబాడీస్ తయారయి ఉండటంతో.. అప్పటికే వారికి కరోనా వచ్చి వెళ్లిపోయినట్టుగా ఐసీఎంఆర్ పేర్కొంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా 40 శాతం జనాభాకు కరోనా వచ్చి వెళ్లిందని కూడా ఐసీఎంఆర్ కొన్నాళ్ల కిందట ప్రకటించింది. అయితే వారిపై కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఎలాంటి సింప్టమ్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ వారికి ఎదురుకాలేదు. వారికే తెలియకుండా కరోనా వారికి సోకి, శరీరంలో వ్యాధినిరోధకతతో ఓడి వెళ్లిపోయిందనేది ఆ సర్వే సారాంశం.
ఆగస్టు 15 నాటికే దేశంలో 15 కోట్ల మందికి కరోనా సోకిందంటే, మరో రెండు నెలలు గడిచిపోయిన నేపథ్యంలో..ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అంటే.. దేశంలో దాదాపు 30 శాతం జనాభాకు కరోనా ఇప్పటికే సోకిందనేది కేంద్ర కమిటీ వేసిన తాజా అంచనా. 130 కోట్ల స్థాయి జనాభాలో ముప్పై శాతం జనాభాకు అంటే దాదాపు 45 కోట్ల మందికి ఇప్పటికే కరోనా సోకింది అనేది తాజా అంచనా! అయితే టెస్టులు చేయగా, నిర్ధారణ అయిన వారి సంఖ్య మాత్రం 75 లక్షల స్థాయికి చేరింది. మిగతా వారంతా అసింప్టమాటిక్, అసలు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేని వారు!
కరోనా ఎక్కువ మందికి సోకాకా.. వారు కోలుకుంటే.. దాని వ్యాప్తి ఆటోమెటిక్ తగ్గే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం.. ఏ సమూహంలో అయినా 50 శాతం మందికి ఒక వ్యాధి వచ్చి వెళ్లాకా.. దాని వ్యాప్తి ఆ తర్వాత కచ్చితంగా తగ్గిపోతుంది. వైరస్ ల విషయంలో ఇది జరుగుతుంది. అసింప్టమాటిక్ గా ప్రస్తుతం భారత దేశంలో 30 శాతం జనాభాకు కరోనా సోకిందని అధ్యయనాలు చెబుతున్నాయి, వీరిలో 75 లక్షల మంది చికిత్స వరకూ వెళ్లారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో సుమారు 50 శాతం జనాభాకు కరోనా సోకుతుందని కూడా కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. వారిలో ఎంతమంది సింప్టమాటిక్ పేషెంట్లు, ఆసుపత్రి పాలయ్యే వారు ఉంటారనేది వేరే అంచనా. అయితే ఫిబ్రవరి 21 నాటికి దేశంలో సుమారు 65 కోట్ల మందికి కరోనా సోకుతుందని అంచనా వేసింది కేంద్ర కమిటీ.
అలా కరోనా 50 శాతం మందికి సోకిన తర్వాత దాని వ్యాప్తి సహజంగానే తగ్గిపోతుంది. ఒకసారి కరోనా సోకిన వారికి మరోసారి ఆ వైరస్ సోకిన దాఖలాలు తక్కువే. శరీరంలో సహజంగా ఏర్పడే యాంటీబాడీస్ వారిని రక్షించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏదేమైనా 50 శాతం జనాభాకు కరోనా సోకి వెళ్లాకా.. ఆ తర్వాత దాని ప్రభావం అంతగా ఉండదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
అయితే అంతలోపు సింప్టమాటిక్ పేషెంట్ల సంఖ్య కూడా పెరగొచ్చేమో! 30 శాతం మందికి కరోనా సోకిందనే లెక్కల్లో 75 లక్షల మందికి నిర్ధారణ పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో, మరో 20 శాతం మందికి కరోనా సోకే సరికి.. కొన్ని లక్షల మంది సింప్టమాటిక్ కేసులుగా, టెస్టుల్లో పాజిటివ్ గా తేలే అవకాశాలు ఉండవచ్చునేమో!