దేశంలో కరోనా థర్డ్ వేవ్ గురించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ ఆదేశానుసారం జరిగిన ఈ అధ్యయనం వివరాలను ఇది వరకే ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్టుగా సమాచారం. దేశంలో మూడో వేవ్ కరోనా తప్పదని ఈ అధ్యయనం అంచనా వేసింది. అది ఈ ఏడాది అక్టోబర్ లో పతాక స్థాయికి చేరుతుందని కూడా పేర్కొంది.
అలాగే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటాన్ని కూడా ఈ అధ్యయనం తన నివేదికలో ప్రస్తావించిందట. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ చాలా స్లోగా ఉందని, దీని ఫలితం థర్డ్ వేవ్ పై ఉంటుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఈ అధ్యయనం పూర్తయ్యే సమయానికి దేశంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన ప్రజల సంఖ్య కేవలం 8 శాతం లోపు ఉంది. ఆ పరిమాణాన్ని చాలా వరకూ వీలైనంత త్వరగా పెంచాలని ఈ అధ్యయనం కేంద్రానికి సూచించిందట. ఒకవేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలాగే నెమ్మదిగా సాగితే.. థర్డ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం అంచనా వేసింది.
కనీసం ఇప్పటి నుంచి అయినా..రోజుకు కోటి డోసుల మేర వ్యాక్సినేషన్ జరిగితే.. మూడో వేవ్ లో కరోనా నియంత్రణ స్థాయిలో ఉంటుందని, ఒకవేళ అలా జరగని పక్షంలో మూడో వేవ్ లో గరిష్టంగా రోజుకు ఆరు లక్షల స్థాయిలో కరోనా కేసులు నమోదు కావొచ్చని ఈ అధ్యయనం అంచనా వేసిందట! ఆరు లక్షలు అంటే.. అది సెకెండ్ వేవ్ పతాక స్థాయి కన్నా ఎక్కువే!
రెండో వేవ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు రోజుకు ఐదు లక్షల మేరకు అధికారికంగా కేసులు వచ్చాయి. అయితే మూడో వేవ్ పతాక స్థాయిలో అంతకు మించిన స్థాయిలో కేసులు రావొచ్చని ఈ అధ్యయనం అంచనా వేయడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే.. దేశంలోని మెజారిటీ వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తే థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉంటుందని, అది జరగని పక్షంలో మూడో వేవ్ భయంకరంగా మారే అవకాశం ఉందంటూ కేంద్రాన్ని హెచ్చరించిందట ఈ నివేదిక.
అయితే… మూడో వేవ్ పతాక స్థాయిలో ఉంటుందన్న అక్టోబర్ కు మరెంతో సమయం లేదు. మరో నెలన్నర రోజుల్లోనే కరోనా థర్డ్ వేవ్ పతాక స్థాయిలో ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఇక ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసుల మేర వ్యాక్సినేషన్ జరుగుతుందని కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే.. అలాంటి సీనేమీ లేకుండా పోయింది. ఆగస్టు నెలాఖరుకు కూడా కనీసం ఒక్క రోజుంటే ఒక్క రోజు కూడా కోటి డోసుల వ్యాక్సిన్లను వేయలేకపోయారు. సగటున 50 లక్షల డోసులు కూడా గగనంగా మారిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. కేంద్రం తనే ప్రకటించుకున్న టార్గెట్ ను కూడా సగం స్థాయిలో మాత్రమే రీచ్ అయ్యింది. అమెరికాతో పోల్చినా ఇండియాలో వ్యాక్సినేషన్ వేగం తక్కువగా ఉందని కూడా నివేదికలో పేర్కొన్నారట.