జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన అధినేతను కాదని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల ప్రాతినిథ్యం ఉంది.
చంద్రబాబును వ్యతిరేకించిన ఓ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఇక జనసేన విషయానికి వస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్ల అవసరం లేకపోయింది.
అసెంబ్లీలో పలు ముఖ్యమైన బిల్లులు ప్రవేశ పెట్టిన సందర్భంలో జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమానికి మద్దతుగా అసెంబ్లీలో రాపాక మాట్లాడారు.
ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి ఇంగ్లీష్ విద్య అందించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. అయితే వైసీపీ సర్కార్‌కు రాపాక మద్దతుగా నిలిచినందుకు ఏవైనా వరాలు దక్కించుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటు జనసేన కార్యకర్తలు ఆదరించక, అటు వైసీపీ కార్యకర్తలు అభిమానించకపోతే మాత్రం రాపాక రాజకీయంగా ఎటూ చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. మరోవైపు రాపాక మాత్రం వైసీపీ ప్రజానిధి మాదిరిగా జగన్ సర్కార్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు.
తాజాగా మంత్రి కొడాలి నానిని రాపాక కలిశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పాలన అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉందంటూ ప్రశంసించారు.
ఇదే సందర్భంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించడం గమనార్హం. టీడీపీకి నిమ్మగడ్డ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. కరోనా సాకుతో నాడు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపారన్నారు.
ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాత్రం ఎన్నికలు జరుపుతామంటే కోర్టులు ఒప్పుకోవన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని రాపాక చెప్పుకొచ్చారు. ఇలా ఉంది రాపాక వ్యవహారం. నమ్మి వచ్చినం దుకు వైసీపీ ఏ మాత్రం ఆదరిస్తుందో చూడాలి మరి!