మీడియాకు పనిలేకుండా చేసిన జగన్

మంత్రివర్గ ఏర్పాటు అయినా, విస్తరణ అయినా.. టీవీ ఛానెళ్లకు బోల్డంత పని. ఆశావహుల జాబితా తయారు చేసుకుని, వారి ఇంటర్వ్యూల కోసం వెంటపడటం, అవకాశాలు తక్కువగా ఉన్నవారిని రెచ్చగొట్టి సంచలనాలు సృష్టించడం.. వారికి అలవాటే.…

మంత్రివర్గ ఏర్పాటు అయినా, విస్తరణ అయినా.. టీవీ ఛానెళ్లకు బోల్డంత పని. ఆశావహుల జాబితా తయారు చేసుకుని, వారి ఇంటర్వ్యూల కోసం వెంటపడటం, అవకాశాలు తక్కువగా ఉన్నవారిని రెచ్చగొట్టి సంచలనాలు సృష్టించడం.. వారికి అలవాటే. అయితే జగన్ జమానాలో అవేవీ కనిపించడం లేదు. గతంలో మంత్రివర్గ నియామకం సందర్భంలో కూడా ఒకరిద్దరు నర్మగర్భంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారే కానీ, ఎక్కడా అసమ్మతి స్వరాలు వినిపించలేదు.

దీంతో తాజా మంత్రివర్గ చేర్పులలో కూడా ఎలాంటి హడావిడి జరగలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా సీదిరి అప్పల్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రులుగా అవకాశం వచ్చిందనే వార్త అందరికీ చేరిపోయింది. సామాజిక సమీకరణాలు తప్పలేదు కాబట్టి ఎవరికీ విమర్శలు చేసే అవకాశం రాలేదు. రాజీనామాలు చేసింది ఎమ్మెల్సీలు కాబట్టి ప్రాంతీయ సమతూకం చూడాల్సిన అవసరమే లేదు.

దీంతో ఇద్దరు కొత్త మంత్రుల ఎంపికపై ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఒకవేళ వచ్చినా జగన్ లక్ష్యపెట్టరని అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో మంత్రి వర్గంలో మార్పులుంటాయనే వార్తలు కూడా అవాస్తవం అని తేలిపోయింది.

టీడీపీ హయాంలో మాత్రం ఇలాంటి సందర్భాల్లో లెక్కలేనన్ని ఆందోళనలు చెలరేగాయి. వైసీపీ నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులిచ్చి స్థానిక నాయకులకు తీవ్ర అన్యాయం చేశారు చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై రభస జరిగినా.. అనుకూల మీడియాతో అంతా బాగానే ఉందని ప్రచారం చేసుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరని గొప్పలు చెప్పుకునే పార్టీలో అదీ పరిస్థితి.

కానీ వైసీపీ జమానాలో ఇలాంటి ఇబ్బందులెప్పుడూ జగన్ ఎదుర్కోలేదు. జగన్ లేదంటే లేదంతే.. ఎవరు ఒప్పించాలని చూసినా, ఎవరు నచ్చజెప్పాలనుకున్నా అక్కడ కుదరని పని. ఎమ్మెల్సీ నియామకాల్లో కూడా తనని నమ్ముకుని ఉన్న కుటుంబానికి న్యాయం చేశారు, ఎన్నికల ప్రచారంలో తానిచ్చిన మాటని మరోసారి నిలబెట్టుకున్నారు. కడప జిల్లాకు చెందిన జకియా, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా వివాద రహితుడు ధర్మాన కృష్ణదాస్ కి అప్పగించడంతో ఎవరికీ మాట్లాడే అవకాశమే రాలేదు. 

మొత్తమ్మీద మంత్రివర్గ చేర్పుల సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పనిలేకుండా చేశారు జగన్. 

షకలక శంకర్ డిరా బాబా వెబ్ సిరీస్ ట్రైలర్

పరాన్నజీవి ఫస్ట్ సాంగ్ రిలీజ్