ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ప్రజల గొంతును అణచివేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించడానికి 13 తెలంగాణ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వెబ్‌నార్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ప్రజా అసెంబ్లీ’ ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రసిద్ధ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ మాట్లాడుతూ దేశంలో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు లేవన్నారు.
పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అధికార పక్షాన్ని విపక్షాలు ప్రశ్నించకుండా చేశారని, ఇక ప్రజలు ఎక్కడ ప్రశ్నించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పర్యావరణ ప్రభావ మదింపు-2020 నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల సందర్భంలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేస్తున్నారన్నారు.
ఈ చట్టం వల్ల ప్రజలకు అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ఆమె ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాలకు గౌరవం లేనప్పుడు ప్రజాస్వామ్య దేశం ఎలా అనిపించుకుంటుందని ఆమె ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు గొంతెత్తితేనే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు ఏజెండాగా మారుతాయ న్నారు.