తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన అసలు ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చూపిస్తూ ఉన్నారు. తన భజన అతిగా చేసే వాళ్లు అడ్రస్ లేకుండా పోవడమే తప్ప.. వాళ్లకు ఒరిగేదేమీ ఉండదని చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా వారికి చవి చూపిస్తున్నారు! అప్పుడూ, ఇప్పుడూ చంద్రబాబు పట్ల వీర విధేయతను చూపించిన రాజకీయ కుటుంబాలకు గట్టి షాకే తగిలింది.
తెలుగుదేశం పార్టీ పదవుల్లో వాళ్లకు పూచికపుల్ల స్థాయి విలువ కూడా దక్కకపోవడంతో టీడీపీలోనే వారి భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ జంబో నియామకాల్లో కూడా చోటు దక్కని వారిలో భూమా కుటుంబ సభ్యులు, జేసీ కుటుంబ సభ్యులు ముందు వరసలో ఉండటం గమనార్హం.
టీడీపీలో ఈ మధ్య కాలంలో పలు నియామకాలు సాగాయి. వాటిల్లో ముందు జరిగినవి పార్లమెంటరీ నియోజకవర్గం బాధ్యుల నియామకాలు. ఎన్నికలైపోయిన ఏడాదికి చంద్రబాబు నాయుడు ఆ నియామకాలను చేపట్టారు. వాటిల్లో జేసీ కుటుంబానికి అధికారికారాల కత్తెర పడింది.
అనంతపురం మాజీ ఎంపీ అయిన జేసీ దివాకర్ రెడ్డికి ఆ బాధ్యత దక్కలేదు. గత ఎన్నికల్లో ఆయన తనయుడే అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసినా ఇప్పుడు ఆయనకు ఆ నియోజకవర్గం నాయకత్వం దక్కలేదు! ఇప్పటికీ దివాకర్ రెడ్డి ఇంకా చంద్రబాబు నాయుడు గడ్డం పట్టుకుని వేలాడుతున్నారు.
చంద్రబాబు మళ్లీ వస్తాడంటూ ఆయన పగటి కలలను ఓపెన్ గా చెప్పుకు తిరుగుతున్నారు. చంద్రబాబు మీద జేసీకి ఉన్న పాటి విశ్వాసం, జేసీ పై చంద్రబాబుకు లేనట్టుగా ఉంది! అనంతపురం బాధ్యతల నుంచి తప్పించారు. ఇక పార్టీ జంబో కమిటీల్లో కూడా ఎక్కడా జేసీ కుటుంబానికి ప్రాధాన్యత దక్కలేదు.
జేసీ బ్రదర్స్ సీనియర్లు.. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్ జూనియర్లు.. పవన్, అస్మిత్ వీళ్లెవరికీ ఎలాంటి పదవులూ దక్కకపోవడం గమనార్హం.
ఇక పదవుల జాబితాలో వినిపించని పేరు భూమా కుటుంబానిది. నంద్యాల లోక్ సభ నియోజకవర్గం బాధ్యుల నియామకంలో కానీ, పార్టీ కమిటీల నియామకాల్లో కానీ భూమా కుటుంబానికి ప్రాధాన్యత దక్కలేదు. అఖిలప్రియ, ఆమె సోదరుడు చంద్రబాబుకు వీర విధేయత వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఒకదశలో తన తండ్రికి ఏమైనా అయితే చంద్రబాబుదే బాధ్యత అని వ్యాఖ్యానించిన అఖిల ప్రియ ఆ తర్వాత చంద్రబాబుకు తిరుగులేని ఫాలోయర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అఖిల, భూమా బ్రహ్మం ఇద్దరూ చిత్తయ్యారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు అజెండాకు అనుగుణంగా అఖిల స్పందించారు. అమరావతికి అనుకూలంగా గళం విప్పి సొంత ప్రాంతంలో ఛీత్కరింపులు పొందారు. అంతజేసినా అఖిలప్రియకు పార్టీ పదవులు ఏవీ దక్కకపోవడం గమనార్హం!
అలాగే చిత్తూరు జిల్లా లో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి టీడీపీలోకి చేరి మంత్రి పదవిని పొందిన అమర్ నాథ్ రెడ్డికి కూడా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు!
పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతల విషయంలో కానీ, పార్టీ కమిటీల్లో కానీ వీరికి చోటు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. తద్వారా వీరి ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పారు.
చంద్రబాబుపై అతి విధేయతను ప్రదర్శించని వారిలో ఒకరు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. టీడీపీలో చేరినా.. ఆయన జేసీ కుటుంబాలాగానో, భూమా కుటుంబం లాగానో అతిగా సాగిలా పడలేదు. హుందా తరహా రాజకీయం చేస్తూ వచ్చారు సూర్యప్రకాష్ రెడ్డి. ప్రజల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు లభించలేదు.
కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే ఆయనకు గౌరవం అయినా బాగుండేదేమో. తెలుగుదేశంలోకి చేరి మరీ ఓడిన సూర్యప్రకాష్ రెడ్డికి మాత్రం చంద్రబాబు నాయుడు పదవిని ఇచ్చారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అనే హోదాను ఇచ్చారు.
చంద్రబాబు నాయుడి జంబో కమిటీల్లో రాయలసీమకు దక్కిన ప్రాధాన్యత తక్కువే. కామెడీ ఏమిటంటే.. పార్టీలో ఉంటారో, ఉండరో అనే సందేహాలను రేకెత్తించిన ఒకరిద్దరికి చంద్రబాబు నాయుడు కమిటీల్లో స్థానం ఇచ్చారు.
చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు డీకే సత్యప్రభ, గల్లా అరుణ కుమారిలకు చంద్రబాబు నాయుడు కమిటీల్లో స్థానం ఇచ్చారు. అయితే వీరిలో డీకే సత్యప్రభ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టో లేనట్టో జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే ఆమె తనయుడు వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వచ్చారు. ఆ వెంటనే డీకే సత్యప్రభకు చంద్రబాబు నాయుడు పార్టీ పదవిని ప్రకటించారు.
అలాగే పార్టీలో ఇది వరకూ తనకున్న హోదాకు గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఆ హోదాకే రాజీనామా చేసిన ఆమెకు మరో పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు! ఈ నియామకాలు గందరగోళాన్ని రేపాయి.