మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఇతర కుటుంబ సభ్యులిచ్చిన అనుమానిత జాబితాతో పాటు తాను సేకరించిన లిస్టు అనుసరించి విచారణకు సీబీఐ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ రెండు గ్రూపులుగా విడిపోయి విచారణ జరుపుతోంది.
ఈ క్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు విచారణ ఎదుర్కోవడం గమనార్హం. వైఎస్ కుటుంబానికి చెందిన యువకుడైన డాక్టర్ అభిషేక్‌రెడ్డి మొదలుకుని ఆ కుటుంబంలో అత్యంత పెద్ద వయస్కుడైన వైఎస్ ప్రకాశ్‌రెడ్డి వరకూ అందరూ ఒక్కొక్కరుగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. విడతల వారీగా విచారణకు హాజరైన వారిలో వైఎస్ కుటుంబానికి చెందిన డాక్టర్ అభిషేక్‌రెడ్డి, ఆయన అబ్బ వైఎస్ ప్రకాశ్‌రెడ్డి (నాన్న తండ్రి), వైఎస్ ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఆయన సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డి కూడా విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. వీళ్లిద్దరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుసకు చిన్నాన్నలవుతారు. వీరిని పులివెందుల ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రస్తుతం విచారిస్తున్నారని సమాచారం. సీబీఐ విచారణ ముగింపు దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణలో వైఎస్ కుటుంబ సభ్యులిచ్చే సమాచారం కీలకమని భావిస్తున్నారు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. నేడు ఆయన విచారణకు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై పులివెందుల నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.