వ్యాక్సినేషన్ గురించి ప్రశ్నలు ఎదురయినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట చెబుతూ వచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి మొత్తం పరిస్థితి మారిపోతుందంటూ చెబుతూ వచ్చింది. దాదాపు రెండు నెలల నుంచి ఇదే మాట! మే నెలలోనే ఇందుకు సంబంధించి ప్రకటనలు చేస్తూ వచ్చింది. జూన్, జూలై నెలల్లో వ్యాక్సిన్ గురించి అడగొద్దన్నట్టుగా.. ఆగస్టు ఒకటి నుంచి మాత్రం మొత్తం కథ మారిపోతుందని చెబుతూ వచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ ఖాయమంటూ చెబుతూ వచ్చింది.
ఇటీవల పార్లమెంట్ లో కూడా ఇదే మాటే చెప్పింది మోడీ ప్రభుత్వం. తగ్గేదేలేదని… ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసులు అంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. మరి ఆ ఆగస్టు ఒకటో తేదీ రానే వచ్చింది. నేటి నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్రం ఇది వరకూ పలు సార్లు, బల్లగుద్ది మరీ చెప్పింది కాబట్టి.. కోటి డోసుల వ్యాక్సిన్ ఉంటుందనే అనుకోవాలి!
కేంద్ర హోం శాఖ వెబ్ సైట్ అందిస్తున్న గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటి వరకూ మొత్తం 47 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. వీరిలో ఒక డోసు వ్యాక్సిన్ పొందిన వారు, రెండు డోసుల వ్యాక్సినేషన్ పొందిన వారు ఉన్నారు. అందరికీ కలిపి 47 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. మరి ఇక ఈ రోజు నుంచి కోటి అంటే.. అవసరం అయిన వాళ్లందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినట్టే!
అటు ఇటుగా రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరో 150 కోట్ల డోసుల వ్యాక్సిన్ కనీస అవసరం. ఈ రోజు నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్ అందుబాటులో అంటే.. మరో 150 రోజుల్లో దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టే. ఐదు నెలల్లో.. అంటే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 200 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చేస్తున్నట్టే. ఇది ప్రభుత్వం చెబుతున్న మాట. ఇక ఆచరణలో కథ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఆగస్టు ఒకటి నాడే కోటి డోసులు అందుబాటులోకి అని ఇది వరకూ అనేక సార్లు చెప్పారు కాబట్టి.. మరి ఈ రోజు సాయంత్రానికి అసలు కథలో కొంత బయటపడిపోతుంది. అయితే భక్తులు ఇప్పుడు మరో ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. వ్యాక్సిన్ ఉన్నా జనాలకు దానిపై ఆసక్తి పోయిందని, డిమాండ్ లేదని సోషల్ మీడియాలో తమ మార్కు ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఇది భక్తుల మార్కు తప్పుడు ప్రచారం మాత్రమే.
ఇప్పటికీ 45 యేళ్ల వయసు లోపు వారికి వ్యాక్సిన్ అంటే.. నో స్టాక్ అనే అంటున్నారు చాలా రాష్ట్రాల్లో. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరఫు నుంచి ఎంతో కొంత సులభంగా వ్యాక్సిన్ దొరుకుతున్నది కేవలం 45 యేళ్ల పై వయసు వారికి మాత్రమే. అలాగే ఇంతకీ నిన్న ఎన్ని డోసుల వ్యాక్సిన్ వేశారంటే.. 60 లక్షల డోసులట. ఈ రోజు నుంచి కోటి లెక్కన వేయబోతున్నారు!