ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఆరోపణలు చేసేందుకు టీడీపీ వేసిన నక్క జిత్తులు అన్నీ ఇన్నీ కావు, అనుకూల మీడియాని అడ్డు పెట్టుకుని పన్నిన పన్నాగాలకు లెక్కే లేదు. అయితే రెండేళ్లపాటు టీడీపీ చెత్త ఐడియాలు సీఏంను ఏమీ చేయలేకపోయాయి.
ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్న ఈ దశలో.. దుష్ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది టీడీపీ, దాని అనుకూల మీడియా. దీనికి తాజా ఉదాహరణే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గించడం.
పాజిటివ్ వార్తగా కలరింగ్..
నేరుగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గిస్తున్నారంటే దాన్ని వ్యతిరేక వార్తగా అందరూ కొట్టిపారేస్తారు. అందుకే జగన్ ని పొగిడేలా నెగెటివ్ వార్తల్ని తయారు చేశారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల పదవీ విరమణ వయసుని రెండేళ్లు పెంచి, అనవసరంగా భారం పెంచారని, ఆ భారం తగ్గించేందుకు, వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని జగన్ రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ తో లింకు..
ప్రస్తుతం ఏపీలో జాబ్ క్యాలెండర్ గొడవ నడుస్తోంది. ఖాళీల సంఖ్య తక్కువగా చూపించారని, నియామకాలు చేపట్టలేదనేది ప్రతిపక్ష పార్టీల వాదన. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ వయసు కుదించి తద్వారా ఖాళీ అయ్యే 2 లక్షల పోస్టులను యువతకు సీఎం జగన్ కేటాయించబోతున్నారని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.
అత్యథిక వేతనాలు పొందే వారిని మూడేళ్ల ముందుగానే తగ్గించి, ఆ స్థానంలో కొత్తవారిని తక్కువ జీతానికి నియమించుకుంటారని, ఇలా రాష్ట్రంపై ఆర్థిక భారం కూడా తగ్గిపోతుందని అంటున్నారు.
అన్నీ కల్పితాలే..
రిటైర్మెంట్ వయసు తగ్గించడం అనే నిర్ణయాన్ని ఏ ప్రభుత్వమూ ఏకపక్షంగా తీసుకోదు. ఉద్యోగ సంఘాలతో చర్చించి మాత్రమే అలాంటి నిర్ణయాలు అమలు చేస్తారు. అయితే ఏపీలో మాత్రం ఏకంగా సీఎం జగన్ ఫొటోతో వార్తలు వండివారుస్తున్నారు.
రేపోమాపో జీవో వచ్చేస్తుందని సోషల్ మీడియాలో డిసైడ్ చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.