ఇండియాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతూ ఉంది. దేశంలోని వయోజనుల్లో కనీసం 25 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. దాదాపు 88 కోట్ల మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ను పొందినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మరి ఇప్పటి వరకూ పడ్డ వ్యాక్సిన్ డోసుల్లో ఏ కంపెనీ వాటా ఎంత? అనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే. ప్రత్యేకించి కరోనా నివారణకు దేశీ వ్యాక్సిన్ ఆదిలోనే తయారయినట్టుగా ప్రకటన రావడంతో.. ఏ వ్యాక్సిన్? అనేది చర్చనీయాంశంగా నిలుస్తూ వచ్చింది.
కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ లే ప్రధానంగా ఇండియాలో అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు వయోజనులంతా కనీసం ఒక డోసును పొందడం కంప్లీట్ అవుతున్న తరుణంలో.. వీటిల్లో ఏ వ్యాక్సిన్ ఎక్కువగా పడింది? అనే అంశంపై ఒక ఆసక్తిదాయమైన సమాచారం అందుతోంది.
వ్యాక్సిన్ పొందిన ప్రతి 11 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే కో వ్యాగ్జిన్ వేశారనే వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. దేశీయ వ్యాక్సిన్ అంటూ సోషల్ మీడియాలో మొదట్లో చాలా మంది హడావుడి చేశారు. భారతదేశం గొప్పదనాన్ని హైలెట్ చేశారు. అయితే అదే వ్యాక్సిన్ వినియోగం విషయంలో నంబర్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఇప్పటి వరకూ వినియోగించిన వ్యాక్సిన్ డోసుల్లో 90 శాతం కోవీషీల్డ్ డోసులేనట! దేశీయ వ్యాక్సిన్ ను ప్రతి 11 మందిలో ఒకరికి మాత్రమే వినియోగించారట! దీనికి ప్రధానకారణంగా.. అవసరమైన స్థాయిలో ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదనే టాకే వినిపిస్తోంది. దేశీయ వ్యాక్సిన్ అంటూ హడావుడి అయితే జరిగింది కానీ, ఇప్పటి వరకూ వేసిన కోట్ల కొద్దీ డోసుల్లో.. కేవలం పది శాతం లోపు మాత్రమే ఆ వ్యాక్సిన్ వాడారనే చేదు నిజాన్ని కూడా భారతీయులు తెలుసుకోవాలి.