Advertisement

Advertisement


Home > Politics - Opinion

అదాని కుంభకోణం ఒక నెసెస్సరీ ఈవిల్?

అదాని కుంభకోణం ఒక నెసెస్సరీ ఈవిల్?

అదాని కుంభకోణం గురించి పలువురు విద్యావేత్తలు, వ్యాపారరంగ నిపుణులు వారి వారి విషయ పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా విశ్లేషణలు చేస్తున్నారు. హిడెన్ బెర్గ్ నివేదిక అనంతరం ఈ వ్యవహారం మొదలైంది. అప్పటివరకు ఎవ్వరూ మాట్లాడింది లేదు. అలాగని వీళ్లు ఆ నివేదిక గురించే చెప్తున్నారా అంటే కాదు. అసలు అదాని ఎక్కడినుంచి మొదలయ్యాడు, ఇప్పటి స్థాయికి ఎవరి అండదండలతో ఎలా ఎదిగాడు, అతని వల్ల దేశానికి ఎలాంటి ముప్పు ఉంది అనేది వివరిస్తున్నారు. ఇందులో వాస్తవాలతో పాటు చెప్పేవారిలోని కొంతవరకు ఏకపక్ష రాజకీయకోణాలు ఉండొచ్చు.  

అసలు అదాని చేసిన పనేంటి, హిడెన్ బెర్గ్ నివేదిక ఏవిటి, అతనంత కుబేరుడిగా ఎదగడానికి దోహదం చేసిన విషయాలేవిటి, వ్యక్తులెవరు...దేశానికి వాటిల్లే ముప్పు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పుకుందాం. 

వ్యాపార విశ్లేషకులు, విద్యాధికులు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్ శాస్త్రి ఈ విషయాన్ని సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చాలా ఆసక్తికరంగా విపులంగా వివరించారు. వేరు వేరు వేదికలమీద ఇతరలు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అటు ఇటుగా ఆయన చెప్పినవి, ఇంకొందరు విజ్ఞులు చెప్పిన విషయాల సారాంశం ముందుగా చెప్పుకుందాం: 

అదాని కుటుంబానిది వజ్రాల వ్యాపారం. విదేశాల నుంచి వజ్రాలు కొని, భారతదేశంలో వాటిని ఆభరణాలుగా మార్చి మళ్లీ వేరు వేరు దేశాలకి ఎగుమతి చేయడం వాళ్ల పని. ఈ క్రమంలో అప్పటి మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ తరహా వ్యాపారానికి రాయితీలివ్వడం మొదలుపెట్టింది. అంటే విదేశీ ఎగుమతులను ప్రోత్సహించడానికి వజ్రాభరణాల ఎగుమతిదారులకి అమ్మిన దానిని బట్టి కొంత మొత్తాన్ని ఇచ్చేదన్నమాట. ఇక్కడే పెద్ద స్కాం జరిగింది. వజ్రాలు కొన్నట్టుగా కాగితాలు సృష్టించి, ఆభరణాలు తయారు చేసి అమ్మినట్టుగానూ ఋజువులు సృష్టించి ప్రభుత్వం నుంచి (అ)క్రమంగా రాయితీగా పొందిన మొత్తం రూ 650 కోట్లు. 

తయారు చేసిన వజ్రాభరణాలు అమ్మినట్టు చ్హొపించిన కంపెనీ అదానిదైతే, కొన్నట్టు కనికట్టి చేసిన కంపెనీలు కూడా అతని బినామీలే. అలా ప్రపంచవ్యాప్తంగా డొల్ల కంపెనీలు పెట్టాడు. లేని వ్యాపారం చెసి, రాయితీలు పొందాడు. అయితే తన ప్రస్థానాన్ని వజ్రాలతో ఆపకుండా అన్ని రంగాల్లోకి చొరబడ్డాడు. 

అసలు వ్యాపరమే లేని చోట ఉన్నట్టుగా భ్రమింపజేసి మొత్తం కాగితాల మీద నడపడం ఇతని మాయ. డొల్ల కంపెనీలతో తన సొంత ఎకో సిస్టం సృష్టించుకుని షేర్ మార్కెట్లో కూడా దూసుకుపోవడం మొదలుపెట్టాడు. దీనికి కేతన్ పరేఖ్ వంటి వ్యక్తులు మార్గనిర్దేశకులయ్యారు. చాలా మంది కాకలు తీరిన బడా ఆర్ధిక నేరగాళ్లు ఈ కుట్రలో భాగం. లూప్ హోల్స్ ని రాజమార్గాలుగా వాడుకోవడం వీళ్ళకి వెన్నతొ పెట్టిన విద్య. 

దీనికి తోడు ఓవర్ ఇన్వాయిసింగ్ చేసి వ్యాపారంలో మోనోపొలీని సాధించడం అదాని మరొక ఎత్తుగడ. ఉదాహరణకి తన బినామీ కంపెనీతో బొగ్గుని రూపాయికి కొని, ఆ కంపెనీ నుంచి తాను రూ.8 కి కొనట్టుగా చూపించి, దానిమీద రూ.2 లాభం వేసుకున్నట్టు చెప్పి ఏ జిందాల్ లాంటి కంపెనీకో రూ10 కి అమ్ముతాడు. ఆ జిందాల్ దానిమీద మరొక రూ.4 ఖర్చులు కలిపి కరెంటుని సామాన్యుడికి రూ. 14 కి అమ్మొచ్చు. అంటే మధ్యలో అదాని చేసిన ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల సామాన్యుడి జేబుకి అతిపెద్ద చిల్లన్నమాట. 

కాలక్రమంలో అదాని డేగకన్ను పోర్టులపై, విమానాశ్రయాలపై కూడా పడింది. అతనేదీ ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారం చేయడు. ఏరియాలని కబ్జాచేసి అద్దెలు వసూలు చేసే పని పెట్టుకుంటాడు. తన ఎయిర్పోర్టులో విమానాలు నిలుపుకోవడానికి అద్దె ఇంత అని రేపు పెంచొచ్చు. దానివల్ల టికెట్ రేట్లు పెరుగుతాయి. అది తిరిగి సామాన్యుడిపై పడుతుంది. 

అలాగే గంగవరం హార్బర్ ని తన చేతుల్లో పెట్టుకుని విశాఖ పోర్టులో బెర్త్స్ అభివృద్ధి చేస్తానని చెప్పి బ్యాంకుల నుంచి వందలకోట్ల రుణం పొందాడు. కానీ మొదలుపెట్టి మధ్యలో ఆపేసి తనకది నష్టం వస్తోందని చేతులెత్తేసాడు. ఏ కేసైనా కాగితాల మీదే నడుస్తుంది కనుక వాటిల్లో తనకు ప్రమాదం సంభవించని విధంగా రాయించుకుని చివరికి బ్యాంకులకి, విశాఖ పోర్టు యాజమాన్యానికి లింకు పెట్టి మీరూ మీరూ చూసుకోండని చెప్పి దులిపేసుకున్నాడు. ఈ గొడవ జరుగుతున్నంత కాలం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారమంతా గంగవరం నుంచే జరిగింది. అది అదాని తెలివి. 

ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలపైనా అదాని నీడ పడింది. 

అప్పటి ప్రభుత్వం నుంచి రూ 650 కోట్లు రాయితీగా పొందినా, ఆ తర్వాత బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టినా అదంతా ప్రజాధనమే. ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో ప్రజలనుంచి ఆ మొత్తాన్ని వెనక్కి రాబడితే, బ్యాంకులు వడ్డీల పెంపుదలతో తమ కష్టమర్స్ నుంచి రాబడతాయి. ప్రభుత్వం కానీ, బ్యాంకులు కానీ నష్టపోవు..నష్టపోయేది ప్రజలే అన్నది ఇక్కడ పాయింటు. 

ఇక్కడ విషయమేంటంటే ఈ పద్ధతిలో ఒక్క అదానియే కాదు..చాలామంది వ్యాపారస్తులు తమ పరిధిలో బ్యాంకులపై పడి సామ్రాజ్యాన్ని పెంచుకుని చివరకు చేతులెత్తేస్తారు. 

ఉదాహరణకి ఒక బట్టల షాపు యజమాని బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని రెండు షోరూములు కట్టొచ్చు. ఏడాది పోయాక ఆ రెండు షోరూములని తాకట్టు పెట్టి ఇంకొంత లోన్ తెచ్చుకుని మరో నాలుగు షోరూములు పెట్టొచ్చు. వ్యాపారం అంతగా ఉండకపోవచ్చు. కానీ బ్యాంక్ రుణాలతో కథ నడిపిస్తూ కాగితాల మీద లాభాలు చూపించుకుంటూ ఉండొచ్చు. లోన్ తీసుకున్నప్పుడల్లా కొంత మొత్తాన్ని పక్కకు తీసి సొంత ఖజానా ఏర్పాటు చేసుకోవచ్చు. నడిపేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు తేడా వస్తే నష్టం వచ్చిందని చేతులెత్తేయొచ్చు. బ్యాంకులు వీళ్ల వ్యక్తిగత ఆస్తులమీదకు రావు. ఆ నష్టాన్ని జనం మీద నుంచే వెనక్కు లాక్కోవాలి. అందుకే బ్యాంకులన్నీ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రమే పెట్టుకుంటాయి. అవసరాన్ని బట్టి ఇంట్రెస్టులు పెంచుకుంటూ, తగ్గించుకుంటూ తమ నష్టాల్ని భర్తీ చేసుకుంటాయి. 7.5% ఇంట్రెస్ట్ కి రెండేళ్ళ క్రితం వాహన లోన్ తీసుకున్న సామాన్యుడు ప్రస్తుతం 9.5% ఇంటెరెస్ట్ చెల్లిస్తూ ఉండొచ్చు. అంటే ఐదేళ్లల్లో తీరాల్సిన తన అప్పు ఆరెళ్లకు తీరొచ్చు. ఈ.ఎం.ఐ మారదు కనుక ఆ సామాన్యుడు కంగారు పడడంతే. 

ఇంతకీ హిడెన్ బర్గ్ చేసిన పనేంటంటే అదాని కంపెనీ విదేశీ డొల్లకంపెనీలతో చేసిన వ్యవహారాన్ని బయటపెట్టింది. అలాగని హిడెన్ బెరేమీ సచ్చీలత ఉన్న సంస్థ కాదు. షార్ట్ సెల్లింగ్ చేసుకుంటూ డబ్బులు గడించడం, రకరకాల కంపెనీలతో చేతులు కలిపి ఆర్ధిక నేరాలను తాము పెట్టుకున్న రూల్స్ ప్రకారం చేయడం, ఎవరైనా తనకు నచ్చపోయినా, ఈ సిండికేట్ పెట్టుకున్న రూల్స్ అతిక్రమించినా నెగటివ్ రివ్యూ రాసి వాళ్లని భ్రష్టుపట్టించడం...ఇదే హిడెన్ బెర్గ్ చేసే పని. 

ఇంత పెద్ద మోసం చేస్తూ హిడెన్ బెర్గ్ లాంటి శక్తుల్ని దువ్వుకుని పక్కన పెట్టుకోకుండా విస్మరించడం అదాని చేసిన తప్పన్నమ్మాట. 

ఇదంతా అసలు కథ. 

మరి ఇంత జరుగుతుంటే ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంది. చూస్తూ కూర్చోవడమే కాదు ఎందుకు అండదండలిస్తోంది. ఇప్పుడు చర్చించుకోవాల్సింది ఇది.

మోదీ సంగతి అందరికీ తెలుసు. ఆయన బ్రహ్మచారి. ప్రజాధనాన్ని కొల్లగొట్టి దాచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయనకానీ, ఆయన కుటుంబ సభ్యుల జీవినవిధానం కాని దీనికి నిదర్శనం. మరెందుకు ఒక ఆర్ధిక నేరగాడిని ఇంతిలా ప్రోత్సహించడము అంటే...దానికి కారణాలు కొన్నున్నాయి. 

ప్రతి వ్యవస్థలోనూ నెసెస్సరీ ఈవిల్స్ అని కొన్ని ఉంటాయి. అది తప్పని తెలుసు...కానీ చేయక తప్పదు. ఉదాహరణకి... 

- మద్యం సమాజానికి, ప్రజల ఆరోగ్యానికి అరిష్టం అని తెలుసు. అలాగని మద్యనిషేధం చేస్తే కొన్ని ప్రభుత్వాలు నడవకపోవచ్చు. 

- క్రూడాయిల్ రేటు తగ్గినా పెట్రోల్ ధర తగ్గించకపోవడం ప్రభుత్వం ప్రజలకి చేసే అన్యాయమే. కానీ అలా చెయ్యకపోతే కొన్ని ప్రభుత్వాలు నడవకపోవచ్చు. 

- గ్యాంబ్లింగ్ నేరమే...దానివల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని తెలుసు. కానీ గోవా కేంద్రంగా క్యాసినోలకి లైసెన్సులిచ్చి నడపకపోతే ఆ రాష్ట్రప్రభుత్వం నడవదు. 

ఇలా చేయడం ప్రభుత్వ వైఫల్యమే అని ప్రజలు ఎద్దేవా చేయొచ్చు. పరిశ్రమలు తీసుకురాలేక, స్వయం ఉత్పత్తులు పెంచలేక చేసే వెధవ పనులివి అని తిట్టిపోయొచ్చు. కానీ తిట్టినంత తేలిక కాదు వ్యవస్థని సమూలంగా ఉన్నట్టుండి మార్చేయడం. 

ప్రజల్లో..ముఖ్యంగా యువతలో స్వయం ఉత్పత్తులు చేయడానికి ఎంత వరకు సుముఖంగా ఉన్నారో గుండెల మీద చేతులేసుకుని ప్రశ్నించుకోవాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అమెరికా వెళ్లి డాలర్ సంపాదన తప్ప మరొక ఆలోచన లేని భారతదేశ యువతని ప్రోత్సహించి చైనావాళ్లలాగ స్వయం ఉత్పత్తులు చేయించాలంటే అదొక దశాబ్దాల కాలం పట్టే సుదీర్ఘ ప్రణాలిక. అమెరికావంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు, విదేశీ వస్తువులపై భారతీయ యువత మోజు వంటి కారణాల వల్ల అత్యంత నాణ్యమైన సొంత ఉత్పత్తులు చేసేసి చైనా కంటే తక్కువ ధరలకి ప్రపంచదేశాలకి అమ్మేసి నిలబడడానికి సరపడా వ్యవస్థ, నైపుణ్యం, తర్ఫీదు, సంకల్పం అన్నీ అల్పంగానే ఉన్నాయి. కనుక ఆ దిశగా అడుగులు వేసే వాతవరణం మన దగ్గరలేదు. వెయ్యాలనున్నా పైన చెప్పినట్టు దశాబ్దాలు పట్టేస్తుంది. అంతవరకు షో రన్ అవ్వాలంటే నెసెస్సరీ ఈవిల్స్ మీద ఆధారపడక తప్పదు. 

మోదీ చేస్తున్నదీ ఇంచుమించు అదే. ఆయనేం చేస్తున్నాడో ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. 

ఒక కుండలో నీళ్లున్నాయి. కానీ ఆ కుండకి పది రంధ్రాలున్నాయి. రంధ్రాలన్నీ పూడ్చడం కష్టం. అలాగని అన్ని రంధ్రాల కింద గిన్నెలు పెట్టి నీళ్లు వేస్టవ్వకుండా ఆపడం కూడా కష్టమే. కనుక అన్ని రంధ్రాలని పూడుస్తూ ఒకే ఒక్క పెద్ద రంధ్రం ద్వారా నీళ్లు పోనిచ్చి దానికింద తన గిన్నె పెట్టాడు. దాంట్లో ఎంత పడుతోందో లెక్క తెలుస్తోంది. గిన్నె నిండాక మళ్లీ ఆ నీటిని కుండలోనే పోస్తున్నాడు. ఆ రంధ్రాన్ని కూడా పూడ్చేయొచ్చు కదా అని అడగొచ్చు. పూడ్చేస్తే ప్రస్తుత వ్యవస్థలో పని జరగదు. పైన చెప్పుకున్నట్టు ఇది నెసెస్సరీ ఈవిల్.

దేశ ఖజానాలోకి డబ్బొచ్చిపడాలంటే జనమే తలోచెయ్యి వేసి నింపాలి. వేరే మార్గం లేదు. అర్థశాస్త్రంలో చాణక్యుడు చెప్పాడు- "తేనెటీగ పూవులనుంచి మకరందాన్ని ఎలా నెమ్మదిగా గ్రహిస్తుందో ప్రభుత్వం కూడా ప్రజల వద్ద పన్నుల్ని అంత సుతారంగా వసూలు చెయ్యాలి". 

మోదీ ప్రభుత్వం చేస్తున్నది అదే. ప్రతి మనిషి అప్పుడొక పది రూపాయలు, అప్పుడొక వంద తమ తమ ఆర్ధిక స్థితికి తగ్గట్టుగా నొప్పి తెలియని విధంగా దేశఖజానాలో తమకు తెలిసి కొంత తెలియక కొంత వేస్తున్నారు. ఏ కుటుంబం దేశానికి టాక్సులు కట్టలేక రోడ్డున పడట్లేదు. వాడెవడో వెయ్యి కోట్లు బ్యాంకులో అప్పు చేసి ఉడాయిస్తే నేనెందుకు బ్యాంకుకి పది రూపాయలు ఎక్కువ కట్టాలి అనేది మాత్రమే ఇక్కడ బాధ. ఏకపక్షంగా చూస్తే అది కచ్చితంగా మనస్కరించని విషయమే. జేబులో పది రూపాయలు లేక కాదు... దోచుకుంటున్నవాళ్లపై ప్రభుత్వం యొక్క ఉదాసీనతని భరించడం కష్టమయ్యి. 

కానీ నాణేనికి మరోవైపు చూస్తే, ఆ విధంగా చేయడం వల్ల బ్యాంకులు దివాళా తీయకుండా నడుస్తున్నాయి. జీ.ఎస్.టి నుంచి సాధారణ ట్యాక్సుల వరకు జనం నుంచి కేంద్రానికి, రాష్ట్రాలకి చేరబట్టే దేశం ఎకనామికల్ గా ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరింది. వ్యవస్థలో లోటుపాట్లున్నమాట వాస్తవం. ఆ వ్యవస్థని సమూలంగా ఉన్నపళంగా మార్చలేనప్పుడు జనం తలో చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మన దేశమే నిదర్శనం. 

ఇలాకాదని, వ్యవస్థలో ఎవడో చేసిన తప్పులకి, జనం నుంచి వసూలు చేయడమేంటని ప్రశ్నించినా, ప్రభుత్వ పరమైనవి ప్రైవేటు పరం కాకూడది అన్నా ఇంకా పెద్ద ప్రమాదముంది. ప్రభుత్వం ప్రజలతో నేరుగా వ్యాపారం చెయకూడదు. కానీ ప్రజాధనంతో ఖజానా నిండాలంటే ఏం చెయ్యాలి? కేవలం ట్యాక్సులు సరిపోవు. తక్కువ ధరలకి ప్రయాణ టికెట్లమ్మి, తక్కువ ధరలకే విద్త్యుత్తు అమ్మి, తక్కువకే టోల్ వసూలు చేసి..పైగా రకరకాల రాయితీలిచ్చి దేశాన్ని నడిపితే మన దేశం పాకిస్తాన్ కి తీసిపోని విధంగా ఉండేది. మరి మన దేశం ఏం చెసింది..ఏం చేస్తోంది? వ్యాపరస్థుల చేతికి వ్యవస్థల్ని అప్పజెప్పి ప్రజలతో వ్యాపారం చేయనిచ్చి అధిక మొత్తంలో ఆయ కంపెనీల నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తోంది. 

మోదీ కాబట్టి ఒక్క అదానీతో నెసస్సరీ ఈవిల్ యాక్ట్ చేయించి బండి లాగుతున్నాడు. అదే స్వార్థపరుడైన, ధనాశగల నాయకుడైతే వందమంది అదానీలు పుట్టుకురావొచ్చు. అప్పుడు కళ్లెం ప్రధాని చేతిలో కూడా ఉండదు. అతి తెలివిగల వంద గుర్రాల్ని ఒక్క రౌతు నడపడం అసాధ్యం. 

మోదీ ఎంత తెలివిగా ఒక్కడి ద్వారానే కథ నడిస్పిస్తున్నప్పటికీ ఇక్కడ ఒక ప్రమాదమైతే ఉంది. అదానీని చూసి దేశంలో అన్ని కంపెనీలూ ఇలాగే ఉంటాయేమోనని విదేశీ పెట్టుబడిదారులు అనుకునే అవకాశం చాలా ఎక్కువ. వాళ్లందరికీ భరోసా కల్పించడానికి మోదీ నానాకష్టాలు పడాల్సి రావొచ్చు. ఆ కష్టాన్ని అధిగమించగలిగే యుక్తులు, శక్తులు ఆయనకు తోడవ్వాలి. అప్పుడు దేశం యోక్క ఆర్ధిక స్థానం సుస్థిరంగా ఉంటుంది. లేకపోతే ప్రమాదం తప్పదు. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?