Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఎంపీగా విజయేంద్ర ప్రసాద్: వక్రతకు కిరీటం!

ఎంపీగా విజయేంద్ర ప్రసాద్: వక్రతకు కిరీటం!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీ అవుతున్నారు. రాష్ట్రపతి కోటాలో.. దేశవ్యాప్తంగా నలుగురు ప్రముఖులను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేస్తే అందులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమ గర్వించాల్సిన విషయం ఇది. 

అయితే కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న నీతి, విధానాలు గమనించినప్పుడు.. విజయేంద్రప్రసాద్ ఎంపికకు వారిని ప్రేరేపించిన అంశాలేమిటా అనే ఆలోచన కలగడం సహజం. మోడీ దళం కోరుకునే రీతిలో హిందూత్వ ఎజెండాను తన భుజాన మోస్తున్నందుకే, ప్రత్యేకించి విజయేంద్రప్రసాద్ ను ఎంపీని చేశారా? అనే అనుమానం పలువురిలో ధ్రువపడుతోంది.

నిజానికి రచయిత విజేయంద్రప్రసాద్ తన భుజాన మోస్తున్నది కేవలం హిందూత్వ ఎజెండాను మాత్రమే కాదు. ‘‘బిజెపివాద హిందూత్వ’’ ఎజెండాని! ‘‘బిజెపివాద జాతీయవాదాన్ని’’! చాలా మంది బిజెపి నేతల కంటె కూడా ఆ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఆయన ఎంతో పరిశ్రమిస్తున్నారు. బిజెపి వాళ్లు మాట్లాడితే.. అది బిజెపి వాదన లాగానే ఉంటుంది. 

అలా కాకుండా.. ప్రజలపై అత్యంత ప్రభావశీలమైన సినిమా మాధ్యమం ద్వారా, బిజెపి చెప్పే జాతీయ వాదాన్ని ప్రజల బుర్రల్లోకి చొప్పించడంలో విజయేంద్ర ప్రసాద్ ఒక టూల్ లాగా ఉపయోగపడుతున్నారా? ఆ ‘టాస్క్’ను చాలా గొప్పగా నిర్వహిస్తున్నందుకే ఆయనకు ఇప్పుడు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని  కూడా కట్టబెట్టినదా? అనే కోణంలో ఈ ఎంపీ పదవి కట్టబెట్టడాన్ని గమనించాలి.

జవహర్ లాల్ నెహ్రూలో ఉన్న పదవీలాలసత, ఆయన తొలి ప్రధాని కావడం వలన జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన ఇంటి పెరట్లో పెరిగిన మామిడి చెట్టులా ఒక భావన ఏర్పడడం, అందులోని పండ్లన్నిటినీ ఆయన కుటుంబమే అనుభవించాలనే భావనకు భజన పరులందరూ రావడం.. ఇలాంటి అపసవ్యతలన్నీ పక్కన పెడదాం. అవి ఈ సందర్భానికి ప్రస్తావనార్హం కాదు. కానీ.. నెహ్రూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుడే! 

‘‘గాంధీ కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం బలంగా పోరాడిన వ్యక్తి..’’ అనే వాక్యం రాయాలంటే సిగ్గుగా అనిపిస్తోంది. ఎందుకంటే.. ఎవరెన్ని పోరాటాలు చేసినా.. భారతదేశ స్వాతంత్ర్యం అనేది.. మహాత్మాగాంధీ అనే పేరుతో పెనవేసుకుపోయింది. ఆయన మనకు నిస్సంశయంగా జాతిపిత!

అయితే గాంధీ, నెహ్రూలు ఇద్దరూ స్వాతంత్ర్య పోరాట యోధులే కాదన్నట్టుగా కొసమెరుపు అభివ్యక్తీకణతో.. విజయేంద్ర ప్రసాద్ కథాకథనం సమకూర్చిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొంది.. దేశవ్యాప్తంగా ప్రజల మెదళ్లలోకి ఒక విషాన్ని ఎక్కించింది. ఇదేదో పెద్ద దేశభక్త సినిమా లాగా ఆదినుంచి బిల్డప్ ఇచ్చారు. ఒక ఫక్తు కమర్షియల్ మల్టీస్టారర్ యాక్షన్ డ్రామాను వండివార్చారు. 

అతి బలహీనమైన పాయింట్ పునాదిగా.. చిత్రవిచిత్ర సన్నివేశాలను ఇద్దరు హీరోలకోసం వండుకుని.. ఆ ఇద్దరికీ కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు అనే ఫ్లేవర్ సెంటులను స్ప్రే చేసి.. దానికి ఒక స్థాయి కల్పించడానికి ప్రయత్నించారు. ఈ దేశభక్త, స్వాతంత్ర్య పోరాట కాలం నాటి ఊహాత్మక కథకు మరింత దేశభక్త రంగు పులమడానికి సినిమా చివరలో ఒక పాట పెట్టారు. దేశభక్తులు, స్వాతంత్ర్య పోరాట యోధుల బొమ్మలను ఆ పాటలో ప్రదర్శించారు. పనిగట్టుకుని.. గాంధీ నెహ్రూల ఫోటోలను విస్మరించారు. విస్మరించడం కాదు. పనిగట్టుకుని చూపించలేదు.!

సహజంగానే ఆ పాయింట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కొత్త ఆలోచన కలిగించింది. చూపించిన బొమ్మల్లోని నేతల కంటె గాంధీ నెహ్రూ పనికిమాలినవాళ్లా అనే అనుమానం కలిగింది. సహజంగా సినిమా పరిశ్రమ వివాదాల్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. అలాగే ఈ వివాదాన్ని కూడా సినిమా టీమ్ క్యాష్ చేసుకోవాలనుకుంది. సినిమా విడుదల తర్వాత విజయేంద్రప్రసాద్ ప్రత్యేకించి ప్రతిఒక్కరికీ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ పాట గురించి, గాంధీ నెహ్రూ లేకపోవడం గురించి సమర్థింపు వివరణలు ఇచ్చుకున్నారు. సినిమాలో పోరాట యోధులను చూపించామని, గాంధీ నెహ్రూ అలాంటి పోరాట వీరులు కాదని ఆయన చెప్పుకొచ్చారు. 

అంటే తుపాకీ పట్టి, కత్తులు పట్టి చేయడం మాత్రమే పోరాటం అని, అలాంటి పోరాటయోధులే ఈ సినిమాకు ప్రాతిపదిక అని ఆయన అనుకున్నారేమో తెలియదు. నెత్తురు చిక్క చిందకుండా.. దుష్ట పాలకుల పీచమణచడానికి సత్యాగ్రహం అనే అద్భుత ఆయుధాన్ని యావత్ ప్రపంచానికి అందించిన మహనీయుడు మహాత్ముడు గాంధీ అనేది విజయేంద్రప్రసాద్ కు తెలియక కాదు. ఆయన దానిని కావాలని విస్మరించదలచుకున్నారు. ప్రజల్లో ఒక కొత్త ఆలోచన కలిగించడం ద్వారా, గాంధీ యశస్సును మసకబారేలా చేయాలనుకున్నారు. 

అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి ఆపలేరు అంటాడు కార్ల్ మార్క్స్. అయితే విజయేంద్రప్రసాద్ అరచేతిని అడ్డుపెట్టి ఆకాశాన్నే కప్పేయాలనుకున్నారు. సాధ్యమేనా? ఆయన అరచేతిని ఏ కంటిమీద కప్పెట్టాడో ఆ కంటికి, ఆ సమయంలో మాత్రమే ఆకాశం కనిపించకపోవచ్చు! అలా ఆయన తనకున్న ఎన్ని వేల కోట్ల చేతులతో ఎన్ని లక్షల కోట్ల కన్నులను కప్పెట్టి.. ఆకాశం అస్తిత్వాన్ని దాచిపెట్టగలరు! 

ఈ దేశానికి సంబంధించినంత వరకు గాంధీ భావజాలంతో విభేదించేవాళ్లు, ఆయన నెహ్రూ కుటుంబం అనుకూల దృక్పథంతో గానీ, హిందూ--ముస్లిం మైత్రిని అభిలషించే మెతకవాద దృక్పథంతో గానీ, స్వాతంత్ర్యానంతర భారతదేశానికి అసంకల్పితంగా చేసిన నష్టం గురించి గానీ చాలా మంది రకరకాల అభిప్రాయాలు వెలవరిస్తారు. అయితే.. స్వాతంత్ర్య సాధనకు వహించిన సారథ్యం విషయంలో అందరూ ఏకాభిప్రాయం మీదనే ఉంటారు. 

ఎందరెన్ని పోరాటాలు చేసినా.. స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తి అనేది.. ‘దే శ వ్యా ప్తం’ కావడానికి ఏకైక కారకుడు గాంధీ! ఆయన తదనంతర కాలంలో జరిగిపోయిన అతిపెద్ద దుర్మార్గం ఏమిటంటే.. కొందరు మహానుభావుల్ని కొన్ని కులాలు సొంతం చేసుకుని వారి విలువను తగ్గించే రీతిలోనే.. ఈ దేశంలోని ప్రతి మనిషికీ సొంతమైన మహాత్మాగాంధీని కాంగ్రెసు పార్టీ కబ్జా చేసింది. తమ సొంతం చేసుకుని ఇతర పార్టీల వారు ద్వేషించే వాతావరణం ఏర్పాటుచేసింది. ఇదంతా ఒక రకమైన నేపథ్యం.

ఆ నేపథ్యం కారణంగా, గాంధీ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తక్కువ చేసి చూపించడం, దానిని ప్రజలు విస్మరించేలా చేయడం భారతీయ జనతా పార్టీ అప్రకటితంగా వ్యూహాత్మకంగా భుజాన మోస్తూ ఉండే నిత్య ఎజెండాలలో ఒకటి! ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇలాంటి పనుల్లో ఒకటి. పటేల్ ను తక్కువ చేయడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. పటేల్ ను అడ్డు పెట్టుకుని గాంధీని తక్కువ చేయడానికి జరుగుతున్న జాతీయవాదకుట్ర గురించిన అవగాహన కల్పించడమే.

అలాంటి భావజాల కుట్రల్లో విజయేంద్రప్రసాద్ కూడా ఒక పావుగా మారారు. మామూలు కమర్షియల్ చిత్రాలకు తగిన వంటలను బహు బాగా అందించగల విజయేంద్రప్రసాద్ గాంధీ లేని స్వాతంత్ర్య పోరాట గీతాన్ని ప్లాన్ చేసినప్పుడు.. దానికి తగినట్లుగా ఎంత రీసెర్చి చేశారో ఎవ్వరికీ తెలియదు. అవకాశం కూడా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత అనేకానేక ఇంటర్వ్యూలలో గాంధీ, నెహ్రూలు ఈ సినిమాలో చూపించిన తరహాపోరాట యోధులే కాదంటూ విజయేంద్రప్రసాద్ సమర్థించుకున్నారు. 

స్వాంతంత్ర్యం తరువాత.. తొలి ప్రధాని కావడానికి కాంగ్రెస్ ప్రతినిధుల్లో అత్యధికులు వల్లభాయ్ పటేల్ ను ఎంచుకున్నా.. గాంధీ నెహ్రూను ఎంపిక చేసి, అందరితో ఆమోదింపజేశారనే వాదన కూడా విజయేంద్రప్రసాద్ వినిపించారు. అది నిజమే కావొచ్చు. అందుకని.. గాంధీని స్వాతంత్ర్య యోధుడే కాదని తెలియజెప్పేలా సినిమాలో పాటను రూపొందిస్తారా? ఇది ద్రోహం కదా?

ఈ దేశచరిత్రకు అది ద్రోహం! ఆ ద్రోహం ద్వారా.. బిజెపి బహిరంగంగా వ్యక్తపరచడానికి సాహసించలేని కుత్సిత భావజాలాన్ని, సినిమా అనే పవర్‌ఫుల్ మీడియం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విజయేంద్రప్రసాద్ వారికి ఎంతో సహకరించారు. తెలిసి చేశారో తెలియక చేశారో, ఎవరైనా పురమాయిస్తే చేశారో మనకు అర్థం కాదు. సినిమాలో పాట ద్వారా ఆ సంగతిని ఎందరు గుర్తించారో గానీ.. సినిమా విడుదల తర్వాత అంతపెద్ద భారీ చిత్రానికి పనిచేసిన రచయితగా తాను ఇచ్చిన అనేకానేక ఇంటర్వ్యూలలో కూడా విజయేంద్రప్రసాద్ గాంధీ గురించి.. ఆ వాదన చెప్పడానికి ప్రయత్నించారు. బిజెపి ఈ ప్రచారంతో సహజంగానే మురిసిపోయి ఉంటుంది. అందుకే బహుశా ఆయనకు రాజ్యసభ ఎంపీగా కిరీటం పెట్టిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. 

దేశప్రధాని నరేంద్రమోడీ ఈ కొత్త ఎంపీగారిని అభినందించే ట్వీట్‌లో ఏం రాశారో తెలుసా..

‘‘శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తంపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు.’’

దశాబ్దాల ప్రత్యేక అనుబంధం కలిగి ఉండడం ఓకే. కానీ.. సృజనాత్మక రంగంలో అనేకంటే సినిమా రంగంలో అని ఉంటే ఇంకా స్పష్టంగా బాగుండేది. అతని రచనలు (అంటే బహుశా ప్రధాని ఉద్దేశం సినిమా కథలేమో) భారతదేశపు అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చాయిట! ఆయన రచనలు అనగా సినిమాలే అనుకుందాం! వాటిలో అద్భుత దేశ సంస్కృతిని ప్రతిబింబించిన చిత్రాలేమిటి?

విజయేంద్రప్రసాద్.. అద్భుతమైన కమర్షియల్ మాస్ మసాలా చిత్రాల కథలు రూపొందించారు. జానకిరాముడు, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, విజయేంద్ర వర్మ, నా అల్లుడు, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మిత్రుడు, జాగ్వార్ లాంటి చిత్రాలకు కథలిచ్చారు. అన్నీ కూడా మాస్ మసాలా మూస చిత్రాలే. వీటిలో అత్యంత ఘోరమైన ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. కమర్షియల్ హిట్లు కావొచ్చు గానీ.. పురస్కారాలకు ఎంపిక చేసేటప్పుడు నాణ్యతను బేరీజు వేస్తే ఇవి నేలబారు చిత్రాలు. 

ఛత్రపతి, మగధీర, బాహుబలి, భజరంగీ భాయీజాన్ వంటి అత్యద్భుతమైన హిట్లు విజయేంద్రప్రసాద్ ఖాతాలో ఉన్నాయి. (సోర్స్: వికీపీడియా పేజీ) ఈ చిత్రాలలో ప్రధాని మోడీకి ‘‘అత్యద్భుతమైన భారతీయ సంస్కృతి’’ ఎక్కడ కనిపించిందో మనకు అర్థం కాదు. ‘మణికర్ణిక’ చిత్రానికి కథను అందించడం ద్వారా.. నరేంద్ర మోడీకి చిడతలువాయిస్తూ, భజన చేస్తూ.. బిజెపి వ్యతిరేకులందరినీ బండబూతులు తిడుతూ తనకు తాను సెలబ్రిటీ హోదా పులుముకునే కంగనా రనౌత్ ను బహుశా ఈ రచయిత ఇంప్రెస్ చేసి ఉండాలి. లేదా ఆర్ఆర్ఆర్ అనే ఒక అపభ్రంశపు, అపసవ్యపు, చారిత్రక హీరోలకు వంకర ఊహలకు కల్పనలకు సంకరమైన చిత్రానికి కథ అందించడం ద్వారా.. యావత్ ‘బిజెపి వాద హిందూత్వ’ భావజాలాన్ని ఆయన సంతృప్తి పరచి ఉండాలి! వీటిలో ఏ సినిమాలను చూసి.. అద్భుతమైన భారతీయ సంస్కృతిని విజయేంద్రప్రసాద్.. విశ్వవ్యాప్తం చేశారని తాను మురిసిపోయారో.. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి.

ప్రధాని అభినందనల ట్వీట్ ను చూసుకుని అయినా, తనను రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేయడానికి ట్వీట్ లోని విషయాలే గనుక కారణం అయితే.. తను అలాంటి పని చేశానా లేదా అని విజయేంద్రప్రసాద్ కూడా ఆత్మసమీక్ష చేసుకోవాలి! తనకు తెలిసినంత వరకు, లేదా, చరిత్రను పైపైన తడిమి చూసి అదే రీసెర్చి అనుకుని అదే సత్యం అనుకుని అది తన బుద్ధికి లోబడినంత వరకు మాత్రమే గ్రహించి.. తన దృక్పథంలోంచి విశ్లేషించి.. కమర్షియల్ హిట్ కావడానికి అవసరమైనంత మేర వక్రీకరించి.. ఒక కథని వండి వార్చడం కాదు. ఇప్పుడు దక్కిన గౌరవాన్ని కాపాడుకోవాలి!

ఈ దేశం– నూటయాభై కోట్ల మంది ప్రజలు– ఎలా బతకాలో, ఏ విధివిధానాలను అనుసరించాలో నిర్ణయించే శాసనాలను రూపొందించేది చట్టసభ! అలాంటి ఈ దేశపు వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నిర్దేశించి పార్లమెంటు లోకి అడుగుపెట్టే అవకాశం విజయేంద్రప్రసాద్ కు అయాచితంగా లభించింది. 

పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కోసం లోక్ సభకు తలపడేవారు.. పూర్తి జీవితాలను రాజకీయాలకు అంకితం చేసి కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, లక్షల మంది ప్రజల కాళ్లుపట్టుకుని మరీ ఆ అవకాశం సంపాదించుకుంటారు. రాజ్యసభలోకి వెళ్లేవారు.. దొడ్డి దారులలో వందల కోట్ల రూపాయలను రాజకీయ పార్టీల నాయకులకు ముడుపులుగా, కానుకలుగా, విరాళాలుగా, ఖర్చులుగా సమర్పించుకుని.. ఆ హోదా దక్కించుకుంటారు. 

అలాంటి రాజ్యసభ ఎంపీ పదవి.. విజయేంద్రప్రసాద్ కు తానై వరించి వచ్చింది. ఎలా వచ్చిందనేది పక్కన పెడదాం. తెలుగు సినిమా ప్రపంచం సంతోషించదగ్గ విషయం ఇది. కానీ.. ప్రధాని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నట్టుగా.. భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ‘‘వాస్తవిక దృక్పథంతో, వక్రీకరణలు లేకుండా, స్వచ్ఛమైన పరిశీలన, లోతైన పరిశోధనతో’’ ప్రతిబింబిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు రాగల కథలను విజయేంద్రప్రసాద్ రూపొందించాలి. రాజ్యసభ ఎంపీ కాగలిగేంతటి ఉన్నత స్థానాలను చేరుకున్న తర్వాత.. కమర్షియల్ హిట్ ఫ్లాప్ అనే తుచ్ఛమైన తూకం రాళ్లకు అందని మంచి కథలను తయారు చేస్తేనే తనకు దక్కిన గౌరవానికి సార్థకత అని ఆయన తెలుసుకోవాలి. 

విజయేంద్ర ప్రసాద్ చాలా మంచి వ్యక్తి. ఉదారులు. నలుగురితో మంచిగా మెలిగే, పదుగురినీ ఆదుకునే సౌహార్దత, సౌశీల్యం ఉన్న వ్యక్తి. సినిమా రచయితల సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంట నిలుస్తారు. ప్రతి సందర్భంలోనూ ఉదారంగా, తతిమ్మా అందరినీ మించి విరాళాలు ఇస్తుంటారు. ఆయనలోని సులక్షణాలు అనేకం. అవి వేరు, రాజ్యసభ ఎంపీ కావడం వేరు! ఆయనను బిజెపి పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపి ఉంటే.. అసలు ఈ వ్యాసానికి అర్థం లేదు. అలా కాకుండా.. రాష్ట్రపతి కోటాలో కేంద్రప్రభుత్వం ఎంపికచేసి పంపడం వల్లనే యిదంతా!!

మోడీని మించిన మన శ్వేత శ్మశ్రుధరుడు విజయేంద్రుడు. రాజ్యసభ ఎంపీ అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు.

..రాఘవ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?