
రిక్షాలు వచ్చినపుడు జట్కాల వాళ్లకి అర్థం కాలేదు. అవి తమ మరణ శాసనమని అర్థమయ్యే సరికి జట్కాలు అంతరించిపోయాయి. ఆటోలు వూళ్లలోకి వచ్చినపుడు ఇంతే. రిక్షాలని తినేశాయి. కొత్త నీళ్లు వస్తే పాతనీళ్లు వెళ్లిపోవాలి, లేదా రూపం మార్చుకోవాలి. ఇది రూల్.
మన సినిమాల పరిస్థితి కూడా ఇదే. ఇంకా జనం థియేటర్‌కి వస్తారనుకుంటే వీళ్లకీ రిక్షాలకి పట్టిన గతే. రోగం ఒక చోట వుంటే చికిత్స ఇంకో చోట జరిగితే రోగి చచ్చిపోతాడు. మీటింగ్‌లు పెట్టి షూటింగ్‌లు ఆపితే బాబ్బాబూ అని ఎవరూ బతిమాలరు. ప్రపంచ సినిమా ప్రేక్షకుడి చేతిలో వున్నపుడు నీ నిరసనను పట్టించుకునే వాళ్లెవరు? అలిగితే నీ డొక్కే ఎండుతుంది.
అయినా మన వాళ్లు ఫాస్ట్‌ఫుడ్ పేరుతో పాచిపోయిన ఫార్ములా తిండి పెడితే, దాని కోసం క్యూలో నిలబడడానికి ప్రేక్షకులు పాతకాలం వాళ్లు కాదు. ఎంతో మారిపోయారు. మారాల్సింది సినిమా వాళ్లే. హీరోలు, దర్శకులు, నిర్మాతలు భ్రమల్లో వున్నారు. ప్రేక్షకులకి రియాల్టీ తెలుసు. సప్లై అండ్ డిమాండ్ సూత్రం ప్రకారం టికెట్ల రేట్లు పెరగాలన్నారు. సినిమా ఒక వ్యాపారమని వాదించి రేట్లు పెంచుకున్నారు. అదే సూత్రం ప్రేక్షకుడికి కూడా వర్తిస్తుంది. విషయం లేని సినిమాల మొహం కూడా చూడడం లేదు. టికెట్ల రేట్లు తగ్గించేశాం రండి బాబూ రండి అని పిలిచినా రావడం లేదు. ఊరికే చూపించినా రారు, రిటర్న్ గిప్ట్‌లు ఇచ్చినా కూడా వచ్చేలా లేరు. దాంతో షోలు క్యాన్సిల్ చేసి థియేటర్ వాళ్లు కుయ్యోముర్రో అంటున్నారు.
ఎందుకీ దుర్గతి? తెలుగువాళ్లకి సినిమాలంటే చాలా ఇష్టం కదా! ఒకప్పుడు క్యూల్లో నిలబడి చొక్కాలు చించుకున్నారు కదా! ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిని చేశారు. చిరంజీవిని చేయకపోయినా పార్టీ పెడితే 18 సీట్లు గెలిపించారు. ఈ సినిమా పిచ్చోళ్లకి ఏమైంది? చిరంజీవి ఆచార్యని నేలకు విసిరి కొట్టారు. బాహుబలితో నెత్తిన పెట్టుకున్న ప్రభాస్‌కి సాహో, రాధేశ్యామ్‌లతో డిజాస్టర్ చూపించారు. పరిస్థితి ఎంత మారిందంటే ఈ రోజు ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఓపెనింగ్స్ కూడా గ్యారెంటీ లేదు. వీకెండ్స్ కూడా జనాలు లేక చేతులు ఎత్తేసే స్థితి.
దీనికి కారణం ఏమంటే జట్కా వాళ్లు, రిక్షా వాళ్లలా మారుతున్న పరిస్థితులని ప్రాధాన్యతలని అర్థం చేసుకోకపోవడం. ఇంకా హీరో బిల్డప్‌లు, ఫారిన్ షూటింగ్‌లు, గ్రాఫిక్స్, నాలుగు డ్యూయెట్లు, ఒక ఐటం సాంగ్, రెండు కామెడీ బిట్స్ అనుకుంటూ పరమ రొటీన్ చెత్తని జనం మీదకి వదులుతూ వుంటే వాళ్లు థియేటర్ వైపు రాకుండా పారిపోతున్నారు.
టికెట్ల రేట్లు పెరగడమే దీనికి కారణమని అనుకుంటే తప్పు. రేట్లు పెరగడానికి జనం అలవాటు పడిపోయారు. పెట్రోల్ పెరిగిందని తిరిగేది తగ్గించామా? సినిమా అంటే అభిమానం, వ్యసనం. భోజనం మానుకుని అయినా చూస్తారు. 200 రూపాయలు ఈ రోజుల్లో పెద్ద డబ్బు కాదు. గట్టిగా హోటల్‌లో టిఫెన్ చేస్తే అయిపోతుంది. అయితే ఆ డబ్బు ఖర్చు పెట్టే ప్రయారిటీల్లో ఈ సినిమా లేదు.
సినిమాల్లో క్వాలిటీ లేకపోవడమే దీనికి కారణమా? అన్ని కాలాల్లో కూడా ప్లాప్‌లు, డిజాస్టర్లు ఉన్నాయి కదా, మరి అప్పుడెందుకు లేదు ఈ స్థితి అంటే, ఆ రోజుల్లో కూడా హిట్ల కంటే ప్లాప్‌లే ఎక్కువ వుండేవి. నిజమే ఎన్టీఆర్ ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో నటిస్తే ఒకటో రెండో హిట్. మిగిలినవి యావరేజ్ లేదా ప్లాప్. అయితే ప్లాప్ సినిమాలకి కూడా ఎంతో కొంత డబ్బులు తిరిగి వచ్చేవి. ఇప్పుడు పబ్లిసిటీ ఖర్చులు కూడా రావు, అది తేడా.
అప్పట్లో అన్ని వర్గాల వారికి సినిమా తప్ప వేరే వినోదం లేదు. థియేటర్లు తక్కువ. చిన్న వూళ్లలో వీకెండ్స్ మాత్రమే మ్యాట్నీలు ఆడేవి (అవి హిందీ సినిమాలు). కొత్త సినిమాలు మాత్రమే రెండుమూడు రోజులు మార్నింగ్ షో వేసేవారు (ఉదయం 10 గంటలకు). మిగిలిన రోజుల్లో రెండు ఆటలే. పట్టణాలు, నగరాల్లో మాత్రమే రోజుకి మూడు ఆటలు. కొత్త సినిమాలు మాత్రం నాలుగు ఆటలు. మెల్లగా పది గంటల షో మాయమై 11.30 షో వచ్చింది. ప్రతిరోజూ నాలుగు ఆటలు. థియేటర్లు పెరిగాయి. ఈ హవా నడుస్తూ వుండగానే సినిమాకి ఆల్టర్‌నేటివ్‌గా టీవీ, వీడియో, సీడీ, డీవీడీ, ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్.
ఎవరి అభిరుచికి తగినట్టు వాళ్లకి ఫోన్‌లోనే అన్నీ వుంటే థియేటర్ వరకూ ఎందుకొస్తారు? ఇంకా మీరు నాలుగు ఆటలు వేసుకుంటూ కరెంట్ ఖర్చులకు కూడా గిట్టుబాటు లేదంటే బేరాలు లేని రిక్షావాళ్లు గుర్తుకొస్తారు. సినిమాలకి భారీ బడ్జెట్ పెడుతున్నాం. 100, 200 కోట్లు ఖర్చు అయ్యిందని అంటున్నారు. హీరోలు, దర్శకులకి రెమ్యునరేషన్లు ఇచ్చి అవసరం ఉన్నా లేకున్నా విదేశాల్లో తీసి, అదంతా ప్రేక్షకులు ఇవ్వాలంటే ఎందుకిస్తారు? వాడికి నచ్చితే ఇస్తాడు.
ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్ అంటే ప్రేక్షకులకి ఆ సినిమాపైన ఆసక్తి వుండేది. ఎందుకంటే ఫారిన్ అనేది కలలో కూడా అందని విషయం. సాఫ్ట్‌వేర్ పుణ్యమా అని ప్రతి పల్లెలో కూడా అమెరికా, కెనడా, బ్రిటన్ చూసిన వాళ్లు కుప్పతెప్పలుగా ఉన్నారు. చూడని వాళ్లకి గూగుల్ కొడితే కనిపిస్తుంది. హీరోలు, డైరెక్టర్లు రిఫ్రెష్ కావడానికి విదేశాల్లో షూటింగ్‌లు చేసి ఆ ఖర్చు సినిమా నెత్తిన రుద్దితే రిజల్ట్ డిజాస్టర్లే.
రాధేశ్యామ్‌లో కథే లేదు, దాన్ని ఇటలీలో తీసినా, గోవాలో తీసినా ఒకటే. సర్కార్‌వారి పాటలో హీరో అమెరికాలో వున్నా, ముంబయ్‌లో ఉన్నా కథకి వచ్చిన నష్టమేం లేదు. అంటే సుందరానికిలో హీరోహీరోయిన్లు అమెరికా వెళ్లకపోయినా అది తాబేలు కథే. బడ్జెట్‌ని నియంత్రించడం అంటే కార్మికుల జీతాలు తగ్గించడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, చిన్నచిన్న నటుల రెమ్యునరేషన్లు తగ్గించడం, భోజనాల్లో కూరలు తగ్గించి, పెరుగుకి బదులు మజ్జిగ నీళ్లు పోయడం కాదు. హీరోలు , డైరెక్టర్లని నియంత్రించి జనానికి నచ్చే సినిమాలు తీయడానికి ప్రయత్నించడం.
అయితే పిల్లిమెడలో గంట ఎవరు కడతారు? డేట్స్ ఇస్తే చాలు, సినిమాలు తీసి లాభాలు సంపాయించాలని అనుకుంటున్నపుడు. గంట కట్టలేనప్పుడు మీటింగ్‌లు, కమిటీలు శుద్ధ దండగ. చిన్ని సినిమాల వాళ్లు నానా పాట్లు పడి ఓటీటీకి అమ్ముకుంటారు, లేదా నష్టపోతారు. నష్టాలు వాళ్లకేం కొత్తకాదు. థియేటర్లు నిండకపోవడం పెద్ద సినిమాల సమస్య.
మళయాళం వాళ్లు లోకల్ కథల నుంచి గ్లోబల్ సినిమాలు తీస్తున్నారు. మనవాళ్లు గ్లోబల్ సినిమాలు తీస్తున్నామనుకుని లోకల్ వాళ్లని కూడా దూరం చేసుకుంటున్నారు. సినిమాకి పునాదిగా వుండాల్సిన కథని నిర్లక్ష్యం చేసి మిగతా హంగులపై శ్రద్ధ పెడుతున్నారు. ఇపుడు దర్శకుడే రైటర్ కాబట్టి ఎవరో ఒకరిద్దరు తప్ప ఇండిపెండెంట్ రైటర్లు ఎవరూ లేరు. ప్రతి డైరెక్టర్ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్ వుంటుంది. ఎక్కువ మంది డైరెక్టర్లు దురాశతో పావలా అర్ధరూపాయి ఇచ్చి రైటర్లతో పని చేయించుకోవాలని చూస్తున్నారు. అవుట్ ఫుట్ కూడా అంతే క్వాలిటీ వచ్చి మిస్ జడ్జ్‌మెంట్‌తో నిర్మాతల్ని ముంచేసి తాము మునిగిపోతున్నారు.
"మా దగ్గర రైటింగ్‌కి పెద్ద బడ్జెట్ లేదండి" సినిమా ఆఫీసుల్లో వినిపించే స్టాక్ డైలాగ్ ఇది. నిర్లక్ష్యానికి గురయ్యే డిపార్ట్‌మెంట్స్‌లో డైరెక్షన్ ఇంకొకటి. కొంత మంది డైరెక్టర్లు తమ టీమ్‌ని కాపాడుకుంటారు కానీ, చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి సరిగా జీతాలు ఇప్పించరు. కరోనా సమయంలో ప్రాణాలకి తెగించి షూటింగ్‌లకి వస్తే కో డైరెక్టర్లకి రూ.25 వేలు మాత్రమే ఇచ్చిన ఘనులున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈ డిపార్ట్‌మెంట్ పని చేస్తుంది కానీ, జీతాలు ఎగ్గొడతారు. డైరెక్టర్లకే Soul లేకపోతే సినిమాల్లో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది?
కర్ణుడి చావుకి కారణాలున్నట్టు ఈ రోజు జనం రాకపోవడానికి అన్ని కారణాలున్నాయి. ప్రేక్షకులు నిస్సందేహంగా మారిపోయారు. మారాల్సిన వాళ్లు మారకపోతే జట్కా, రిక్షాల్లా అంతరించిపోతారు. కాలాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు కాలగర్భంలో కలిసిపోతారు. సినిమాకి ఏం కాదు, అది శాశ్వతం. కాకపోతే థియేటర్లలో వుండదు.
సినిమా పరిశ్రమ బంగారు బాతు నిజమే. బంగారు మాయమై బాతు మాత్రమే మిగిలింది.
జీఆర్ మహర్షి
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా