“కాంతారా” అంటే అర్థం తెలియదు. రిషబ్ షెట్టిని మునుపు చూసింది లేదు. థియేటర్లు మొదటి ఆట నుంచి ఫుల్ నడుస్తున్నాయి. ఏముంది “కాంతారా”లో. కొత్త కథేం కాదు. గ్రామ రాజకీయాలు, అడవి నేపథ్యం. రంగస్థలం, పుష్ప కలిస్తే ఇది. అంతేనా? అసలుది వేరే వుంది. అదే మ్యాజిక్. జానపద శైలిలో కథ చెప్పడం. మొదటి సీన్ నుంచి ఆఖరి వరకూ ఒక మార్మికత వెంటాడడం. ఇదే దీని విజయ రహస్యం. మొదటి 15 నిమిషాలు, ఆఖరి 15 నిమిషాలు అద్భుతం, బీభత్సం. రసాస్వాదనకి పరాకాష్ట.
థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదనేది నిజం కాదు. ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించలేకపోతున్నారు. “కాంతారా”కి జాతరలా ఎందుకొస్తున్నారు? ఆశ్చర్యం ఏమంటే 150 కెపాసిటీ వున్న థియేటర్‌లో కనీసం 50 మంది మహిళలు. ఆడవారు థియేటర్‌కి రావడం మానేసి, టీవీ, ఓటీటీ చూస్తున్నారనే వాదన కూడా నిజం కాదు. బావుందని నమ్మితే పేరు, భాష, నటుడు ఎవర్నీ చూడరు. సినిమాని నమ్మి వస్తారు.
జానపద రీతిలో కథ చెప్పడం అన్ని భాషల్లో వుంది. అయితే కన్నడీగులు తమ కళల్ని చచ్చిపోకుండా కాపాడుకున్నారు. బయలాటలో (మన వీధి నాటకం లాంటిది) గట్టిగా అరుపులు, పెడబొబ్బలతో కూడిన రౌద్ర ప్రదర్శన వుంటుంది. కాంతారా తొలి సీన్‌లో వినిపించే అరుపులు అలాంటివే. మన నాటకం పరిషత్తులకే పరిమితం చేసుకున్నాం. అయితే కన్నడలో నాటకం బతికే వుంది. బెంగళూరు మెజిస్టిక్‌లో గుబ్బి వీరన్న కళామందిర్ వుంది. ప్రతిరోజూ నాటకం వేస్తారు. టికెట్ పెట్టి జనం చూస్తారు. శని, ఆదివారాలు హౌస్‌ఫుల్. జేసీ రోడ్డులోని రంగమందిరలో కూడా రెగ్యులర్‌గా కన్నడ నాటకాలు వేస్తారు.
కన్నడ సినిమాకి కొత్త స్టామినా ఈ సినిమా. ఒకప్పుడు మొనాటని కథలతో వున్న కన్నడ సినిమాని పుట్టన్న కనగల్ మలుపు తిప్పాడు. సైకాలజీ గురించి తెలియని కాలంలోనే (1970-80) సైకో ఎనాలసిస్ సినిమాలు తీశాడు. ఆ తర్వాత గిరీష్ కర్నాడ్, శంకరనాగ్, అనంత్‌నాగ్ లాంటి గొప్ప నటులు, దర్శకులు ఉన్నా అంత గుర్తింపు రాలేదు. మంచి సినిమాలు వచ్చినా అవి కర్నాటక దాటి రాలేదు. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా హోదా. కాంతారా కూడా అదే రేంజ్‌లో వెళ్లేట్టు వుంది.
పూనకం అనేది మనకి మూడ నమ్మకం కావచ్చు. అన్ని దేశాల్లోని ఆదివాసులకి ఇలాంటి నమ్మకాలు, విశ్వాసాలున్నాయి. భద్ర జీవితం వున్న వాడికి నమ్మకాలు లేకపోయినా ఫర్లేదు. ప్రతిరోజూ అడవి లేదా సముద్రం మీద జీవించే వారికి ఈ నమ్మకాలే ధైర్యం. అడవికి వెళ్లకపోతే బతకలేరు. వెళితే తిరిగి వస్తామో లేదో తెలియదు. జాలర్లు అతి వైభవంగా గంగజాతర ఎందుకు జరుపుకుంటారంటే ఆ తల్లి దయ వుంటేనే జీవితం లేదా మరణం.
అటవీ ప్రాంతాల్లోని వారికి అడవి పంది అతి ప్రమాదకారి. పొలాల్లోని పంటని తినేస్తుంది. ఎదురెళ్లితే కుమ్మేస్తుంది. కాంతారాలో వరాహ అవతారంపై భక్తి ఎందుకంటే ఆ దేవున్ని పూజిస్తే పంది తమ జోలికి రాదనే విశ్వాసం. అందుకే హీరో తల్లి పందిని వేటాడకూడదని మందలిస్తూ వుంటుంది. దేవుడి పూనికతో మార్మికమైన అడవిలో కలిసిపోయిన భర్త కోసం ఆమె ఎంత ఎదురు చూసిందో?
ఈ సినిమా మొత్తం అడవిలో మనం తిరిగినట్టు వుంటుంది. అంత గొప్ప ఫొటోగ్రఫీ. బ్యాగ్రౌండ్ స్కోర్ పీక్స్. పశ్చిమకనుమల అడవిలో జరిగిన కథగా అనుకుంటే ఆ ప్రాంతవాసుల ఆచార వ్యవహారాలు, కట్టూబొట్టులతో పాటు ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సునిశితంగా పరిశీలిస్తే తప్ప ఇది తీయడం సాధ్యం కాదు. డబ్బింగ్‌లోనే ఇంత శక్తిమంతంగా వుంటే, ఒరిజినల్ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.
కాంతారా చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలాంటి సినిమాలు తీయలేకపోతున్నాం, కథలు ఎందుకు రావడం లేదు అనిపిస్తుంది. మనకి క్రియేటివ్ దర్శకులు లేక కాదు, రిస్క్ తీసుకునే హీరోలు లేక కాదు. మన దర్శకులు తమ మూలాలు మరిచిపోయి ఫిల్మ్‌నగర్‌లో బందీలవుతున్నారు. కాలు బయట పెడితే కారు, ఊరు దాటితే విమానం. భూమిపైన కాలు పెట్టిన వాడికే మట్టి వాసన తగులుతుంది, అర్థమవుతుంది. దానికి తోడు చుట్టూ భజన బృందాలు. అహం పూనిన వాళ్లు, ప్రేక్షకులకి పూనకం తెప్పించగలరా? పైగా రీమేక్‌లు వున్నపుడు సొంత బుర్రతో ఆలోచించడం అనవసర రిస్క్.
మన హీరోలు కూడా ఇంకా మూడు డ్యూయెట్లు, నాలుగు ఫైట్స్, ఆరు పంచ్ డైలాగ్‌ల దగ్గరే వున్నారు. కాలం మారింది. నువ్వు ఎన్ని కోట్లతో సినిమా తీశావన్నది కౌంట్ కాదు. యోగ సాధనతో తీయగలిగితే ప్రపంచ మార్కెట్ నీ ముందు తల వంచి నిలబడుతుంది. కాంతారాని అలాంటి సాధనతో తీశారు.
తపస్సు చేసిన వాడికి వరం లభిస్తుంది. బుద్ధి, మనసు ఏకమై పనిచేసిన వాడికి ప్రకృతి పగబట్టి మరీ సహకరిస్తుంది. ప్రకృతి నుంచి మనిషిని విడదీయకూడదని కాంతారా అంతర్లీన సందేశం.
కలుగుల్లోంచి ఎలుకలు బయటికి రావడానికి పొలాల్లో పొగ పెడతారు. కాంతారా పెట్టిన పొగకి ప్రేక్షకులు థియేటర్ల వైపు వస్తున్నారు.
సినిమా మొదట్లో వచ్చే కంబలా (దున్నల పందెం) చూస్తే మైండ్ బ్లాక్. హాట్సాప్ రిషబ్ షెట్టి. తెలుగు చేసిన అల్లు అరవింద్‌కి కూడా.
జీఆర్ మహర్షి