Advertisement

Advertisement


Home > Politics - Opinion

బాబుగారి బ్లాక్ మెయిలింగ్ కామెడీ

బాబుగారి బ్లాక్ మెయిలింగ్ కామెడీ

బాబుగారు బ్లాక్ మెయిల్ చేసారు. ఈ సారి తనని ఎన్నుకోకపోతే ఇక తనకి ఓటు వేసే సువర్ణావకాశం జనానికి ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఈ బ్లాక్ మెయిలింగే పెద్ద కామెడీ అనుకుంటే, దీని చుట్టూ పచ్చ చానల్స్ లో జరుగుతున్న ప్రహసనాలు అన్నీ ఇన్నీ కావు. 

ఈ రాష్ట్రంలో వార్తాచానల్స్ లో అత్యంత వినోదాన్ని పంచే ముగ్గురు పేర్లు చెప్పమంటే తడుముకోకుండా చెప్పదగ్గవి - సాంబశివరావు, వెంకటకృష్ణ, మహా వంశీల పేర్లు. వీళ్లేమి మాట్లాడతారో వీళ్లకన్నా అర్థమవుతుందో లేదో అనిపిస్తుంది చాలాసార్లు. స్వామిభక్తిని చూపవచ్చు, తప్పులేదు. కానీ ఆ క్రమంలో తమని తాము అణచేసుకుని అజ్ఞానులుగా ముద్రవేసుకోవాల్సిన అవసరమైతే లేదు.

అయినా ఆ పసుపు కూపంలోనే బతుకుతూ తాము చూస్తున్నదే సత్యమనుకుంటూ, ఊహిస్తున్నదే భవిషత్తు అన్న ధోరణిలో బతకడం మాత్రం పెద్ద ప్రహసనం.

వెంకటకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు ఇవే తనకి ఆఖరి ఎన్నికలు అన్నాడంటే అలా అనడనికి కారకమైన ప్రస్తుత ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోనక్కర్లేదా అన్నాడు. ఈ వాక్యం అర్థం కాక జనం వెర్రి మొహాలేస్తున్నారు. అయినా తలెందుకు దించుకోవాలి...మీసం మెలేయాలి కానీ. ప్రత్యర్థి బెదిరి ఇక మళ్లీ ఎన్నికల్లో నిలబడనంటే అది విజయమవుతుంది కానీ సిగ్గు పడే అంశమెందుకవుతుంది? 

వెంకటకృష్ణ వైనం ఇలా ఉంటే సాంబశివరావు హాస్యవినాయాసాలని ప్రదీప్ చింతా అనే యూట్యూబర్ అదే పనిగా వెటకారంతో విశ్లేషిస్తూనే ఉన్నాడు. సాంబశివరావు కామెడీలు ఇక్కడ రాయడాని చోటు చాలదు కనుక ఆసక్తిగలవాళ్లు ప్రదీప్ చింతా యూట్యూబ్ చానల్లో చూసుకోవచ్చు. 

ఇక పాయింటుకొస్తే...తన భార్యని ఏదో అన్నారని తాను మళ్లీ సీయం అయితే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసి వాకౌట్ చేసిన చంద్రబాబు ఈసారి ఓడిపోతే ఏకంగా రాజకీయ సన్యాసమే అని ప్రకటించేసుకున్నాడు. అసలలా ప్రకటించుకోవడం ఆత్మహత్యాసదృశమని ఎవరు చెప్తారో ఆయనకు. 

భార్యనన్నారని ఏడిస్తేనో, గెలవకపోతే ఇదే ఆఖరి ఎన్నిక అనడం వల్లనో సానుభూతి కెరటం మీద పడుతుందనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట. 

ఈ విషయంలో ఎవడూ సెంటిమెంట్ ఫీలవ్వకపోగా నవ్వుకుంటున్నారన్నది చంద్రబాబుకి, పచ్చ మీడియాకి తెలియకపోవడం వింతల్లోకెల్లా వింత. 

వెంకటకృష్ణ, సాంబశివరావు, మహా వంశీలు తమ నిత్య చర్చలతో, నిరంతర వ్యాఖ్యానంతో ఒక్క తెదేపా సానుభూతిపరులకి తప్ప మిగిలిన అధికశాతం మంది జనానికి విపరీతమైన వినోదాన్ని పంచుతున్నారు. ఆ గ్యాంగ్ మొత్తంలో కొద్దో గొప్పో బుర్ర వాడుతున్నది ఒక్క కొలికిపూడే. 

ఈ మధ్యనే ఒక చర్చలో టీవీ5లో కొలికిపూడి స్వపక్షానికి జ్ఞానబోధ చేసాడు...సొంత మీడియా చేస్తున్న అతి వల్లే తెదేపా నాశనమౌతోందని. 

తలపాగా చుట్టుకుని మాట్లాడే కొలికిపూడిలో ఉన్న తెలివిలో పదొవంతు కూడా సూట్లేసుకుని మాట్లాడే పై ముగ్గురు అజ్ఞానవంతులైన యాంకర్లకి లేదు.  

రామాయణంలో విభీషణుడు రావణాసురుడికి చెప్తూనేవచ్చాడు- "సీతని వదలకపోతే చంకనాకిపోతాం అన్నయ్యా" అని. అయినా మూర్ఖత్వంతో వినలేదు. ఫలితం అందరికీ తెలుసు. ఇప్పుడు కొలికిపూడి ఒకరకంగా చంద్రబాబుకి పచ్చ మీడియాని వదలకపోతే చంకనాకిపోతావని హెచ్చరిస్తున్నట్టే ఉంది. అయినా సరే...వినాశకాలే విపరీతబుద్ధి వల్ల తత్వం బోధపడట్లేదు బాబుకి. ఏది చేస్తే తాను భూస్థాపితమైపోతాడో అవే చెస్తున్నాడు బాబుగారు. 

ఇదిలా ఉంటే అవతల బీజేపీని పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ అడిగితే, బీజేపీవాళ్లు తెదేపాకి విడాకులిచ్చి సర్టిఫికేట్ తెమ్మన్నారు. ఎంత విడాకులు అలవాటే అయినా, వెంటనే ఆ షాక్ నుంచి తేరుకోవడానికేమో వైజాగ్ బీచ్ ఒడ్డున నెచ్చెలుడు నాదెండ్లతో తీరం కనపడని సముద్రంకేసి చూస్తూ వాకింగ్ చేసాడు పవన్. 

ఈ లెక్కన చంద్రబాబుకి జనసేన తోడవడమనేది కలలో మాటే. బీజేపీని కాదని తెదేపాతో కాపురం చేసేంత ధైర్యం పవన్ కి ఉండదు. 

పరీక్ష సెంటరుకెళ్లిన పూర్ స్టూడెంట్ కి ముందు బెంచిలో తనకి ఆన్సర్ షీట్ చూపిస్తానన్నవాడిని ఇన్విజిలేటర్ లేపేసి వేరే చోట కూర్చోపెడితే ఎంత టెన్షన్ పడతాడో అలా ఉంది చంద్రబాబు పరిస్థితి. అఫ్కోర్స్ పవన్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు పూర్ స్టూడెంట్స్ కలిసి సిలబస్ ని చెరి సగం చదివి ఇన్విజిలేటర్ ని మచ్చిక చేసుకుని, ఒకరి పేపర్లో ఒకరు చూసికాపీ కొడదామనుకున్నారు. కానీ ఇక్కడ ఇన్విజిలేటరైన బీజేపీ పరమ స్ట్రిక్ట్. ఇద్దరికీ సీట్లు పక్కపక్కన పడకుండా విడగొట్టింది. 

ఈ దెబ్బకి ఈ సారి పరీక్షలో ఫెయిలవడం ఖాయమనుకున్నట్టున్నారు ఇద్దరూను. ఇలాంటి సందర్భంలోనే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ డైలాగులొస్తాయి. 

పబ్లిక్ పరీక్షల పేపరు దిద్దే మాష్టర్లు "సార్! రకరకాల సినిమా కష్టాలవల్ల చదవలేకపోయాను. ఏదో చేతికొచ్చింది వెలగబెట్టాను. దయచేసి నన్ను పాస్ చెయండి. లేకపోతే నేను ఉరేసుకుని చచ్చిపోవడం ఖాయం" అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ రాతలు చూస్తుంటారు. ఇప్పుడు ఓటర్లని అలాంటి బ్లాక్ మెయిలింగ్ చేసే పని పెట్టుకున్నాడు ఫెయిలవుతానని తెలిసిపోయిన బాబుగారు. హతవిధీ! 

హరగోపాల్ సూరపనేని

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా