థియేటర్‌లోకి ఫుడ్ తీసుకెళ్ల కూడదని కోర్టు తీర్పు చెప్పింది. అయితే అసలు సమస్య లోపలున్న విపరీతమైన ధరలు. టికెట్ కంటే ఎక్కువ ఖర్చు అయిపోతోంది. ఒకప్పుడు థియేటర్‌లలో ఈ దోపిడీ లేదు. నగరాల సంగతి తెలియదు కానీ, చిన్న వూళ్లలో బయటా, లోపలా ఒకటే రేట్లు. 1985 తర్వాత పరిస్థితి మారింది. థియేటర్ లోపలే ఫుడ్ కౌంటర్లు వచ్చి, దారుణమైన రేట్లతో బాదడం మొదలు పెట్టాయి. మల్టీప్లెక్స్‌లు వచ్చిన తర్వాత పరిస్థితి చేయిదాటి పోయింది.
మా చిన్నతనంలో థియేటర్‌ని నమ్ముకుని చాలా మంది పేదవాళ్లు బతికేవాళ్లు. థియేటర్ యజమానులు వీళ్ల నోరు కొట్టేవాళ్లు కాదు. థియేటర్ లోపల చిన్న టీ అంగడి, సిగరెట్ షాపు వుండేది. దానికి బయటి నుంచి కూడా ఎంట్రీ వుండేది.
రాయదుర్గంలో అజీజియా, ప్యాలెస్ అనే థియేటర్లు, నూర్‌టూరింగ్, జయలక్ష్మి అనే టెంట్లు వుండేవి. టెంట్లలో జనరల్‌గా పాత సినిమాలు, థియేటర్‌లలో కొత్త సినిమాలు వచ్చేవి. థియేటర్ కెపాసిటీతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చేవాళ్లు. కుర్చీ క్లాస్లో ఎక్సట్రా వేస్తారు. బెంచీలు వేయడం కూడా సాధ్యమే. నేలలో వీలు కాదు. ఒకరి మీద ఇంకొకరు కూచుని , కొట్లాడుకుంటూ చూసేవాళ్లు.
ఇంటర్వెల్ ఉండదు కాబట్టి పాటలు వచ్చినప్పుడు గంపల్లో శనక్కాయలు, మురుకులు తీసుకుని వేడి వేడి అని అరుస్తూ కొందరొచ్చి అమ్మేవాళ్లు. జనాన్ని తొక్కుతూ వెళ్లేవాళ్లు. సోడా, నిమ్మకాయ సోడా అని ఇంకో బ్యాచ్ కుయ్యోమని సౌండ్ ఇచ్చేవాళ్లు. టీ తాగాలంటే బయటికి వెళ్లాల్సిందే.
థియేటర్ గేట్ బయట బొరుగుల మిక్సర్, జామకాయలు దొరికేవి. మిరపకాయి బజ్జీలు సురసురమని పిలిచేవి. కల్తీలేని కాలం కాబట్టి ఆ వాసనకి ముక్కులు అదిరిపోయేవి. ఆకలేస్తే ఉగ్గాని దొరికేది. జంక్ ఫుడ్ లేనేలేదు. అంతా ఒరిజినల్.
థియేటర్ లోపల అమ్మేవాళ్లకి, ఎక్కువ రేట్లు ఆలోచనే లేనంత అమాయకత్వం. సందర్భాన్ని బట్టి లాభాన్ని పెంచుకునే కల్చర్ ఇంకా రాలేదు. మనుషుల్లో లాభాల దురాశ ఎందుకు లేదంటే వస్తు వ్యామోహం లేకపోవడమే. తిండి, బట్, ఇల్లు వుంటే చాలు. నెలనెలా ఈఎమ్ఐలు, బిల్లులు లేవు. ఉన్నదాంతో సర్దుకునేవాళ్లు.
1985 తర్వాత బెంగళూరు నుంచి కొన్ని బృందాలు అనంతపురం వచ్చాయి. వాళ్లు థియేటర్ క్యాంటీన్ కాంట్రాక్టర్లు. అంతకు ముందు లోకల్ వాళ్లు నడుపుకునే వాళ్లు. థియేటర్ యజమానులు కూడా ఇదో ఆదాయ వనరుగా భావించలేదు. అయితే ఈ కాంట్రాక్టర్లు క్యాంటీన్ రూపం మార్చేశారు. పప్పుండలు, మురుకులు మాయమై బిస్కెట్, కేక్, సమోసాలు వచ్చాయి. నిమ్మకాయ సోడా స్థానంలో కూల్ డ్రింక్స్. రేట్లు పెరిగాయి. పిల్లల్ని ఆకర్షించే ఐటమ్స్ వుంటాయి కాబట్టి తల్లిదండ్రులకి కొనక తప్పలేదు. పాప్‌కార్న్ కూడా అపుడే వచ్చింది.
అంతకు ముందు థియేటర్లలో లేదు. ఇపుడు అసలు కంటే కొసరు ఎక్కువని టికెట్ కంటే వీటికే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కుటుంబ సమేతంగా మల్టీప్లెక్స్‌కి జనం రావాలంటే భయపడడానికి ఈ స్నాక్స్ రేట్లు ఒక ముఖ్య కారణం.
జీఆర్ మహర్షి