ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత ప్యాకేజీకి అంత పర్ఫామెన్స్ అన్నట్టుంది.
ఆ మధ్య దత్తపుత్రుడు అన్నందుకు ఒప్పుకోని పవన్ కళ్యాణ్ నేడు బహిరంగంగా ముసుగు తీసేసి వీరంగం చేసాడు. అక్కడికేదో చేసిన గొడవకి కవరు, కవరేజీ బాగానే వచ్చినందుకేమో పావలాకి రూపాయి పర్ఫామెన్స్ ఇచ్చాడు వేదికమీద బూతులు వల్లిస్తూ.
అదేం కామెడీయో గానీ, తాను పెరిగింది బూతుల మధ్యలో అని, తానేమీ నగరాల్లో పెరిగినవాడిని కానని, తనదంతా ఊరమాస్ పెరుగుదల అని ఘనకార్యంలాగ చెప్పుకొచ్చాడు. గతంలోనేమో తనది హార్వార్డ్ రేంజ్ అని అక్కడ లెక్చర్లివ్వడానికి వెళ్ళాడు ఈ ఇంటర్ డ్రాపౌట్ ప్రబుద్ధుడు. తన ఒరిజినలేంటో అందరికీ తెలుసు. ఇనాళ్లూ వేసుకున్న పాలిష్డ్ ముసుగు ఇప్పుడు తీసి చూపిస్తున్నాడు. అన్నీ కప్పుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోవట్లేదని పైట జార్చేసాడన్నమాట. కానీ అదెంత రోతగా ఉందో, ఎంత అసహ్యంగా జనానికి రీచయ్యిందో పాపం ఈ అరబుర్ర నాయకుడికి తెలియట్లేదు.
పార్టీ అధినేత అంటే భాష విషయంలో డీసెన్సీ ఉండాలి. అది లేనప్పుడు నెంబర్ టూ గానో, టెన్ గానో మిగులుతాడంతే. ఇక్కడ తన ముఠాలో చంద్రబాబు నెంబర్ వన్ అని, తాను నెంబర్ టూ అని నిరూపించినట్టయ్యింది తన బూతుప్రవచనంతో.
కార్యక్రమమంతా కాపు యువతని రెచ్చకొట్టడానికన్నట్టుగా ఉంది. కాపుల్ని రౌడీలుగా, గూండాలుగా మార్చే పని పెట్టుకున్నాడల్లే ఉంది. ఇదేమైనా సినిమానా? రియాలిటీ! ఒక కులానికి చెందిన యువతకి యాంటీ సోషల్ బ్రాండ్ పడితే నష్టం ఎవరికి? పరోక్షంగా తెదేపాకి ఇదే కావాలా? అందుకే పవన్ కి కాపుల్ని రెచ్చకొట్టమని ఆ విధంగా దిశానిర్దేశం చేసి వేదిక మీదకి వదిలారా?
ఇక్కడొక పెద్ద విషయం ఆలోచించాలి. చంద్రబాబు ఎప్పుడైనా “మన కమ్మ యువత”, “మన కమ్మ కులం” అన్నాడా? కమ్మవాళ్లైన కొడాలి నాని, వల్లభనేని వంశీ అనరాని మాటలంటే వైకాపా నీడలో ఉన్న కమ్మవాళ్ల తోలు తీస్తా అన్నాడా? అదే రాజకీయమంటే? ఒక పార్టీ అధినేత ఒక కులం నాయకుడిగా ముద్రపడితే అతను చచ్చినా అందరివాడు కాలేడు. వెనక ఏదైనా ఉండొచ్చు. కులప్రస్తావన నోటితో చేయకూడదంతే. ఈ మాత్రం ఇంగితం లేదు పవన్ కి. అందుకే అరబుర్ర అనాల్సొచ్చింది.
ఇంతకీ తెదేపా ఎత్తుగడ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ అందరివాడు కాకూడదు. కేవలం కాపు ఓట్లని పోలరైజ్ చేసి మూట కట్టి ఆ ఓట్లని తమకి అమ్మాలి. అంతే అతని పని. దానికే వాడుతున్నారు. ఇతను డూడూబసవన్నలాగ వాడబడుతున్నాడు.
అసలు చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఉండేది హైదరాబాదులోనే. కావాలంటే అక్కడ కలుసుకోవచ్చు. అబ్బే! గొడవ జరుగుతున్నప్పుడే కలవాలి. డ్రామా చెయ్యాలి. తొలుత చంద్రబాబు వైజాగుకే వెళ్ళి పవన్ ని కలుద్దామనుకున్నాడు. కానీ జరుగుతున్న పరిణామాలకి భయపడి డ్రామాని విజయవాడకు మార్చాడు. పవన్ ని అక్కడకి చేర్చాడు. ఇదంతా కమ్మనాయకుడు కాపు నాయకుడ్ని ఆడిస్తున్న గంగిరెద్దాట. కాపు సోదరులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో!
“రాడ్లా, కర్రలా, రాళ్ళా..ఏం పట్టుకొస్తారో రండి…మేమూ రెడీ” అంటున్నాడు. వైకాపాలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తానని ప్రతిజ్ఞ చేసాడు. ఒక పార్టీమీద నోరెత్తినప్పుడు మధ్యలో “కాపు” అంటూ కులప్రస్తావన ఎందుకు?
సరే నిజంగా అంత కాపుకులాభిమానమే ఉంటే తాను కాపులమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడా? పూర్తిగా కాపుపిల్లల్ని కన్నాడా? తన పిల్లలు టెక్నికల్గా సగం కాపులేగా! రాజకీయాల్లో కేవలం కులం కార్డుతో బతకాలంటే కులాన్ని బాగా అంటిపెట్టుకుని కూర్చోవాలి చంద్రబాబు, బాలకృష్ణల్లాగ. అంతే తప్ప అన్యకులస్తుల్ని పెళ్లి చేసుకుంటే లెక్కలు వేరేగా ఉంటాయి. అటువంటి లెక్క కర్నాటక రాజకీయాల్లో ఆ మధ్య పొడచూపింది. జేడీఎస్ కుమారస్వామి కొడుకు ఒక విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ పార్టీ పెద్దలు, ఉన్మాద అభిమానులు అతనిని వారించారు. తమ పార్టీకున్న ముద్రే గౌడల పార్టీ అని, మనుగడ సాగించేదే గౌడ ఓట్ల మీద అని, కనుక వంశాన్ని సంకరం చేయొద్దని అతన్ని ఆపేసారు. ఎందుకంటే అతను ఆ పార్టీకి రాజకీయవారసుడు కనుక పూర్తిగా గౌడ సమాజంతోనే ఉండాలనేది వాళ్ల లెక్క. అలాంటి కరడుగట్టిన కాపులు రేపు అకీరానో, పవనోవిచ్ నో పవన్ కళ్యాణ్ రాజకీయవారసులుగా చూస్తారా? అసలు పరకులస్త్రీలను చేసుకున్న పవన్ ను కాపుజనోద్ధారకుడిగా లెక్కేస్తారా? అతని చిత్తశుద్ధిని శంకించరు?
అందుకే తన కింద ఒకసారి చూసుకుని పవన్ కళ్యాణ్ “కాపు” నినాదం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అప్పుడు అందరివాడౌతాడు. ఇలాంటివేవీ ఆలోచించకుండా తెదేపావారిచ్చిన మీటర్లో స్పీచులు దంచితే రాలేవి తన పళ్ళే అనేది మర్చిపోకూడదు.
ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. అప్పట్లో పరిటాల రవి తనకు గుండు కొట్టించాడన్న వార్తని ప్రచారం చేసింది తెదేపావాళ్లేనని పవన్ కళ్యాణే ప్రకటించాడు. అది కాపుల మనోభావాలకి ఎంత పెద్ద దెబ్బో చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ప్యాకేజీకి దాసోహమంటూ తాను చంద్రబాబు పక్కన నిలబెడితే రాష్ట్రంలోని కాపులందరూ కూడా నిలబడాలా? కాపులంటే మరీ అంత కామెడీగా ఉందా పవన్ కి? రాజకీయచైతన్యం ఉన్న కాపులే సమాజంలో ఎక్కువ. ఎవరో కొంతమంది కాపులు చుట్టూచేరి కేకలుపెడుతుంటే మొత్తం రాష్ట్రంలోని కాపులంతా తన జేబులో ఉన్న ఫీలింగెందుకో పవన్ కళ్యాణ్ కి!
ఎంతసేపూ కుళ్లు, అసూయ, ద్వేషం తప్ప పవన్ కల్యాణ్ రాజకీయంలో మరొకటి కనపడదు. వీలైనంత అశాంతి సృష్టించడం, ఆ అశాంతికి కారణం వైకాపా అని చెప్పడం, తాను కొట్టి తన చెయ్యి నొప్పిపుట్టిందని కంప్లైంట్ ఇచ్చే దగుల్బాజీతనం..ఇవే కదా అతని రాజకీయ పద్ధతులు. ఏమన్నా అంటే వ్యూహం మార్చాడట! కొత్తగా మార్చిందేముంది? ఎప్పుడూ చేసేదిదే కదా!
హరగోపాల్ సూరపనేని