గత ఎన్నికలకు ముందు 'ప్రత్యేక హోదా ' వైసీపీకి ప్రధాన నినాదం అయింది. విశాఖకు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, జనం పై పన్నుల 'బాదుడే బాదుడు 'కూడా ఎన్నికల అంశాలే అయ్యాయి. 'మాట తప్పం… మడమ తిప్పం ' అనేది వైఎస్ జగన్‌కు ప్రజల మనసుల్లో ట్రేడమార్క్ గా, ఒక బ్రాండ్‌గా ముద్రితమై పోయింది. ఫలితంగా విజయం అనే సునామీని వైసీపీ సృష్టించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చిరకాల వాంఛ తీరింది.
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సన్నధ్ధమవుతున్నారు. పాత నినాదాల స్థానంలో ఒక ఎన్నికల అంశం వైసీపీకి ఇప్పుడు కావాలి.అదే… మూడు రాజధానులు. ఈ కోణం నుంచే వైసీపీ క్రియాశీలకం అవుతోంది. మంత్రులు లంగోటా బిగించి గోదాలోకి దిగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న' అమరావతి – అరసవెల్లి ' రైతుల పాదయాత్ర పై వైసీపీ వర్గాల నుంచి అందుకే అడ్డంకులు ఎదురవుతున్నాయి. దారి పొడవునా ' మూడు రాజధానుల ' ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఒక జేఏసీని కూడా ఏర్పాటు అయింది.
కోర్టుల జోక్యం దృష్ట్యా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కానీ, మూడు రాజధానులు అనే ప్రచారాన్ని మాత్రం వైసీపీ పెద్దఎత్తున చేపట్టబోతున్నది. 'ఒకటే వద్దు… మూడు ముద్దు ' అనే ప్రచారానికి ప్రతిగా ' మూడు వద్దు… ఒకటే ముద్దు' అంటూ ప్రతి పక్ష ప్రచారంతో రాష్ట్రం మునిగిపోబోతున్నది. ఇది తప్పితే, వైసీపీకి ఎన్నికల అంశంగా మరొకటి కనుచూపు మేరలో కనపడడం లేదు.
అందువల్లే, రాష్ట్ర 'రాజధాని' ఫలానా ప్రాంతం అని అధికారికంగా లేకుండానే రాష్ట్రాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. నిజానికి, రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 2014 లోనే ఆ హక్కుని వినియోగించుకుని, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. దానికి అనుగుణంగా, రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చిన రైతులకు చట్టబద్ధమైన హామీలు ఇచ్చింది. ఇప్పుడు, రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం భావిస్తే ; రైతులకు గతంలో ఇచ్చిన చట్టబద్ధమైన హామీలను నెరవేర్చి…..; పెట్టే, బేడా సర్దుకు వెళ్ళిపోతే… ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ, రైతులకు ఇచ్చిన హామీల విషయం పక్కన బెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడమే ఇప్పటి వివాదానికి కారణం. అందుకే ఈ 'మార్పు ' అనేది ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. రైతులు కోర్టులకు ఎక్కాల్సి వచ్చింది . రోడ్లూ ఎక్కాల్సి వచ్చింది .
ఒక్కటి మాత్రం స్పష్టం. వైసీపీకి 'రాజధాని' అనేది ఒక ప్రాధాన్య అంశం కాదనే విషయం జన సామాన్యానికి అర్ధమైంది. ఇది ఇంటర్నెట్ కాలం. పై పెచ్చు 5G రోజులు. బెజవాడ కనకదుర్గ గుడి ముందు కూర్చుని అడుక్కునే వారి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటున్నది. టేబుల్ పై కంప్యూటర్, సీట్‌లో లేకపోతే చేతుల్లో ల్యాప్ టాప్. ఇక, కమ్యూనికేషన్ గ్యాప్‌నకు అవకాశం ఎక్కడ?
రాజధాని అమరావతిలోనే ఉన్నప్పటికీ, 13 జిల్లాలనూ అభివృద్ధి చేయడానికి అడ్డంకి ఏముంది? 13 జిల్లాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, కొత్త కొత్త పరిశ్రమలు నెలకొల్పించడానికీ, 13 జిల్లాలనూ సమానమైన 'అభివృద్ధి నేత్రం ' తో చూడడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో 75 జిల్లాలు ఉన్నాయి. అయినా లక్నో ఒక్కటే రాజధానిగా ఉంది. దేశంలో 766 జిల్లాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఢిల్లీ ఒక్కటే రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. మనకు ఉన్నది 13 జిల్లాలు. వాటిని 26గా ప్రభుత్వం విడగొట్టినప్పటికీ, కొత్త ప్రాంతాలు, కొత్త జనాభా ఏమీ కలవలేదు కదా! ఈ పాత 13 జిల్లాలకూ మూడు రాజధానులు ఉంటేగానీ కుదరదు అని వైసీపీ అంటోంది. దీని అంతరార్ధం జనానికి అర్ధం కాకుండా పోవడం లేదు.
అయినప్పటికీ, 'రాజధాని' ని ప్రభుత్వం మూడు భాగాలుగా విడగొట్టినప్పటికీ; అమరావతి నుంచి తరలించాలనుకుంటున్నది రెండు భాగాలనే. ఒక భాగాన్ని ఇప్పటికే అమరావతిలోనే ఉంచాలని నిర్ణయించారు. మరి ఈ మూడేళ్ళల్లో ఆ రెండు భాగాలను రెండు చోట్లకు ఎందుకు ప్రభుత్వం తరలించలేకపోయిందో అర్ధం కాదు. వచ్చిన వెంటనే తరలింపునకు శ్రీకారం చుట్టి ఉన్నట్టయితే; 2019 సెప్టెంబర్, అక్టోబర్ నాటికే, మూడు రాజధానులు ఏర్పడి పోయి ఉండేవి కదా! ఇప్పుడు విశాఖపట్నానికి గానీ కర్నూలుకు గానీ రాజధాని శాఖలను ప్రభుత్వం తరలించలేక పోతున్నది.
ఎక్కడికీ పోని… పోలేని…. పోవడానికి కుదరని 'అమరావతి రాజధాని' కి అనుకూలంగా….; వ్యతిరేకం గా మాటల యుద్ధాలకు మాత్రం తెర లేచింది. దీనితో పరస్పర తీవ్ర విమర్శలు చెల రేగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా… వైసీపీ, వైసీపీయేతర వర్గాలుగా విడిపోయాయి. వైసీపీకి కావలసింది కూడా అదేనేమో అనిపిస్తున్నది.
మూడు రాజధానులే తమ విధానమని చెబుతున్న వైసీపీ నేతలు… ఆ దిశగా చట్టపరమైన చర్యలు ఏమీ తీసుకుంటున్నట్టు కనపడదు. కేవలం ప్రకటనలతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాదు కదా! హైకోర్టులో ఉన్న 'రిట్ అఫ్ మాండమాస్' ను హై కోర్టు ఉపసంహరించుకోవడమైనా జరగాలి. అది కుదరక పోతే, సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పు పై స్టే అయినా తీసుకురావాలి. అప్పుడు కూడా అసెంబ్లీలో మళ్ళీ బిల్ పెట్టి, గవర్నర్ ఆమోదం తీసుకుని, విశాఖపట్నానికి ముఖ్యమైన సచివాలయ కార్యాలయాలు తరలించాలి.
గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీ కార్యాలయం వంటివి విశాఖపట్నానికి తరలి వెళ్ళాలి. ప్రస్తుతానికి, వాద ప్రతి వాదాలతో ' మైండ్ గేమ్' మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో నడుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశం సజీవంగా ఉంచాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నది. అందుకే వైసీపీ నేతలు కూడా యధాఃశక్తి హీట్ పెంచుతున్నారు.
దానివల్ల, విశాఖపట్నానికి రాజధాని కార్యాలయాలు, కర్నూలు కి హైకోర్టు తరలి వెడతాయని కాదు. వచ్చే ఎన్నికల వరకు దీనిని ఒక సజీవ ఎన్నికల ఇష్యూగా ఉంచడమే వారి ఉద్దేశం అయి వుంటుంది. ఎన్నికలంటే…. భావోద్వేగ అంశాలే కదా! వచ్చే ఎన్నికలకు, దీనినో ముఖ్య ప్రచార సాధనంగా జగన్ వాడతారు అనడంలో సందేహం లేదు .
2014 నుంచి 2019 వరకు 'చంద్రబాబు మార్క్ ' పాలనను జనం చూశారు. నచ్చలేదు. అందుకని ఆయనకు 23 సీట్లు ఇచ్చి, జగన్‌కు 151 సీట్లు ఇచ్చారు. 2019 నుంచి 'జగన్ మార్క్' పాలన ను జనం చూస్తున్నారు . మరి ఇప్పుడు ఈ పాలనకు ఈ సారి ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారో చూడాలి.
భోగాది వేంకట రాయుడు