జగన్ మీద సందు దొరికితే చాలు విమర్శల జడివాన కురించే విపక్షాలు ఏపీ నిండా ఉన్నాయి. ఆ విషయంలో ఎవరి స్థాయిలలో వారు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
అటువంటి సమయంలో నిర్మాణాత్మక విమర్శలు చేసే వారు అసలు ఉన్నారా అన్నదే డౌట్ గా ఉంది. ఈ నేపధ్యంలో లోక్ సత్తా ఏపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అయితే కరోనా కట్టడికి జగన్ తీసుకుంటున్న చర్యలు భేష్ అంటూ కితాబు ఇచ్చేశారు.
ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని కూడా ఆయన మెచ్చుకున్నారు. ఏపీలో వ్యాక్సిన్ కొరతకు కేంద్ర విధానాలే కారణం అని ఆయన అంటున్నారు.
కేంద్రం ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వాలనుకోవడం తప్పుడు విధానమని కూడా బాబ్జీ విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖను తాము పూర్తిగా సమర్దిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం మాత్రమే వ్యాక్సినేషన్ చేయాలని, ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వేళ చేస్తున్న దందా చూసి కూడా వారికే వ్యాక్సిన్లు ఇస్తే సామాన్యుడికి అవి అసలు దొరకవు అని ఆయన అంటున్నారు. జగన్ కరోనా కట్టడి విషయంలో తీసుకునే ప్రతీ చర్యకు తమ మద్దతు ఉంటుందన్ని లోక్ సత్తా నాయకుడు చెప్పడం మంచి పరిణామమే.