రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథకాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెళ్లిన తర్వాతే నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలెగాళ్ల వ్యవస్ద తోనే రాయలసీమ కరవు సీమగా మారింది.
అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టారు.
అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు 1928 నవంబర్ 18న రాయలసీమ అని నామకరణం చేశారు. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.
చరిత్రలోకి వెళితే….
1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం, వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ధ భయంతో ఉన్న నిజాం ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు.
అందుకు పరిహారం కింద ఆంగ్లేయులకు సీమ ప్రాంతాన్ని నిజాం వదిలేశారు. ఈ మొత్తం వ్యవహరంలో సీమ మనోభావాలను లెక్కలోకి తీసుకోలేదు. దీని ఫలితంగా పాలెగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతం నుంచి ప్రారంభంలో వారి నుంచి ఆంగ్లేయులకు ప్రతిఘటన ఎదురైంది.
బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలెగాళ్లు నిలువలేకపోయారు. అలా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలెగాళ్లు తొలి స్వతంత్రోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచారు. కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్థానం మనకు లబించకపోవడం దురదృష్టకరం.
ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వల్ల దీన్ని సీడెడ్ జిల్లాలుగా పిలిచేవారు. దీన్నే తెలుగులో దత్తమండలం అని పిలిచినా… నిజానికి సీడెడ్ అన్న ఆంగ్ల పదానికి దత్త మండలం అనే అర్థం సరైంది కాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అన్న దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్ననలను పొందవచ్చనే ఉద్దేశం కావచ్చు. అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీడెడ్ ప్రాంతంగా పిలవబడింది.
నంద్యాల సభలో కీలక నిర్ణయం
1913 లో ప్రారంభమైన ఆంధ్ర మహాసభలు 1928, నవంబర్ 17,18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఇస్దేనే తాము సహకరిస్తామని ఈ ప్రాంత నేతలు ఒత్తిడి తెచ్చారు. దీంతో నవంబర్ 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండల సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అధ్యాపకులు, శ్రీకాకుళం నివాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదంటూ …రాయలసీమ అనే పేరు బాగుంటుందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరిచారు. రాయలసీమ అనే పేరు ఖరారు చేస్తూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆనాటి నుంచి రాయలసీమగా మారింది.
ఘన చరిత్రను గుర్తించకపోవడం వెనుక కుట్ర…
రాయలసీమకు గొప్ప చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యంలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అలాగే తమ పాటలు, పద్యాలతో సమాజాన్ని చైతన్యపథంలో నడిపించిన గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య, మహాకవి వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం సీమ. టీటీడీ తప్ప అన్నమయ్యను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోదు. పప్పూరి తెలుగు ప్రజలు గర్వించదగ్గ దేశభక్తుడు. కాని ప్రభుత్వం అధికారికంగా వారి జయంతిని నిర్వహించదు.
ఆంగ్లేయులకు తిరుగుబాటు రుచి చూపించి, వాళ్ల గుండెల్లో నిద్రించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని తెలిసినా , ఆయన త్యాగాన్ని గుర్తించేందుకు ప్రభుత్వాలకు మనసు రావడం లేదు.
చివరకు దైవ కార్యక్రమమైన కృష్ణాపుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రంలో కలిసే దగ్గర నిర్వహిస్తారు. దీనికి కారణం శ్రీశైలంలో నిర్వహిస్తే ప్రజలు పాల్గొని మన రాయలసీమలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుంటే మనకు నీరు ఇవ్వకుండా మన తర్వాత ఉన్న కృష్ణా డెల్టాలో 3 పంటలు పండటం ఏమిటన్న ఆలోచన, ఆగ్రహం సీమ ప్రజల్లో వస్తుందనే ఉద్దేశం కాదా? అలా రాయలసీమ ఘనచరిత్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెలుగులోకి రాలేక నష్టపోతోంది.
రాయలసీమ చరిత్రలో తీరని అన్యాయం…
1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే ఆంధ్ర ప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడిచాయి. ఆ రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో స్థాపించాలని 1926 లో జరిగిన ఆంద్రమహాసభ తీర్మాణాన్ని, అలాగే మద్రాసు శాసనసభ తీర్మాణాన్ని సైతం ఉల్లంగించారు.
అనంతలో నెలకొల్పాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ, ఆ తర్వాత వైజాగ్ తరలించారు. ఆ విద్యాలయానికి తెలివిగా సీమకు చెందిన కట్టమంచిని వైస్ చాన్స్ లర్ గా నియమించడంతో పాటు వైజాగ్‌లో ఉండటం మంచిదని వారితోనే చెప్పించారు.
గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీబాగ్ ఒప్పందం అవగాహణతో వారితో కలిపి ఆంద్రరాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికన తెలంగాణతో కలిపి ఆంద్రప్రదేశ్ గా మారినపుడు కర్నూలు రాజధానిని వదులుకుని కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించ లేదు. కాని ముఖ్యమంత్రిగా మాత్రం రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డిని నియమించారు.
అలా పదవులు సీమకు, పనులు మాత్రం సర్కారు, హైదరాబాదు వారికిగా మారింది. పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన తెలంగాణ సమాజం రాష్ట్రం కోసం పోరాడి సాధించుకుంది. ఆ సందర్భంలో జరిగిన సమైక్య ఉద్యమంలో కీలక సమయం వచ్చినపుడు తప్పటడుగుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ పరిస్దితి ఏమిటి అన్న విషయం వదలి సమైక్య మత్తులో మునిగిపోయాం.
విడిపోవడం ఖాయమని, మీకు ఏమికావాలో అడగాలని నాటి కేంద్ర ప్రభుత్వం అడిగినా… మాకు ఏమీ వద్దు, సమైక్యమే ముద్దు అన్న నినాదంతో గుడ్డిగా ముందుకెళ్లాం.
కాని సీమ ప్రజలతో సమైక్య ఆందోళన చేయించిన సర్కారు పెద్దలు మాత్రం ఆందోళన వదలి ఢిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి అబివృద్ధికి ఉపయోగపడే పోలవరం, రాజధానికి నిధులు. కోస్తా కారిడార్ లాంటి విలువైన విషయాలను చట్టంలో పొందుపరుచుకున్నారు.
రాయలసీమ కోసం కనీసం ఒక్కటంటే ఒక్కటి చట్టబద్ధంగా చేయించుకోలేకపోయాం. పోలవరం పూర్తి అయినా దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ పథకం అమలు కాకపోతే రాయలసీమకు ప్రయోజనం ఉండదని తెలిసినా దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కానీ విభజన చట్టంలోగాని పేర్కొనలేదు.
విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దుమ్ముగూడెం పథకాన్ని రద్దు చేసినా మన ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండటం వల్ల పోలవరం ఫలితం సీమకు దక్కడం కష్టమే. 2014 లో రాజధాని ఎంపికలో , నేటి ప్రభుత్వం మూడు రాజధానులు వ్యవహారంలో సీమకు దక్కాల్సిన వాటా దక్కలేదు.
శ్రీబాగ్ ఒప్పందంలో కీలకమైన అంశం కృష్ణా , తుంగభద్ర నీటిని రాయలసీమకు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్దేశ్వరం , గుండ్రేవుల , పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యం పెంపు , చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి.
ముఖ్యంగా కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు నగరి , హంద్రీనీవా , వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టులు ముందు ఉంచాలి.
లేకపోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. అటువైపు చర్చ కూడా జరగక పోవడం… అదికూడా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతలుగా రాయలసీమవారు ఉన్న సందర్భంలోనే కావడం సీమ దుస్థితికి అద్దం పడుతుంది.
నేతల తీరుతోబాటు ప్రజలు సైతం కులం, మతం, పార్టీల అభిమానం పేరుతో గుడ్డిగా సమర్థిస్తున్నాం. ధీని ఫలితంగా ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారింది. ఆత్మ గౌరవ నినాదంతో ప్రారంభమైన రాయలసీమ ప్రజల ప్రస్థానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాకా, ఆత్మాభిమానంతో జీవించే రోజు వచ్చేదాకా పోరాడుతూనే ఉండాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436